ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అధికారం నుంచి దించేందుకు ఎల్లో గ్యాంగ్‌కు అస్త్రాలు కావాలి. జగన్‌పై వివిధ రూపాల్లో సంధిస్తున్న అస్త్రాలను గమనిస్తే …మరీ ఇంత ఛీప్‌ట్రిక్సా అనే అభిప్రాయం కలుగుతోంది. ప్రధాని మోదీ తలచుకుంటే తప్ప జగన్‌ను అధికార గద్దె దింపలేమనే అభిప్రాయానికి ఎల్లో టీం ఓ అభిప్రాయానికి వచ్చింది.
జగన్‌పై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసి, ఎక్కడికక్కడ కట్టడి చేస్తే తప్ప ఏమీ చేయలేమని నిస్సహాయ స్థితికి వెళ్లినట్టు కనిపిస్తోంది. జగన్‌కు ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు కంటే మోదీపై ఎల్లో మీడియా ఆశలు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్‌ను ఏదైనా చేస్తే మోదీ తప్ప, మరెవరి వల్లా కాదనే అభిప్రాయాన్ని బాబు అనుకూల మీడియా కథనాలు కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్‌పై చంద్రబాబు అనుకూల మీడియా వార్తల్ని వండుతోంది. విచిత్రం ఏమంటే తన వార్తా కథనాల్ని చదివి జగన్‌లో పౌరుషం పుట్టుకొచ్చి, కేంద్రంపై కాలు దువ్వుతాడని చంద్రబాబు అనుకూల మీడియా భ్రమిస్తోంది. కేసుల భయంతో కేంద్రానికి సాగిలపడి రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టారనే కథనాల్ని రాస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలపై మౌనం పాటిస్తున్నాడని దెప్పి పొడుస్తోంది.
‘నా భవిష్యత్ భద్రంగా ఉండాలి! వ్యక్తిగత లబ్ధి మాత్రమే చేకూర్చుతూ… మళ్లీ అధికారంలోకి రావాలి. నాకూ, నా వర్గానికీ అవసరమైన పనులు మాత్రం జరిగితే చాలు’ అని జగన్ అనుకుంటూ కేంద్రంతో సత్సంబంధాలు జగన్ కొనసాగిస్తున్నారంటూ అక్కసు వెళ్లగక్కడం గమనార్హం.
విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవడంలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు దొందు దొందే అని చెప్పక తప్పదు. అయితే సమస్యల్లా ఎక్కడంటే… ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబుపై మాత్రం ఎల్లో మీడియా ఈగ వాలనివ్వదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కట్టించాల్సిన పోలవరం ప్రాజెక్టును కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడి, అడిగి తీసుకుని ఈ వేళ త్రిశంకు స్వర్గంలో ఉండడానికి కారణమైన చంద్రబాబు మాత్రం గొప్ర పాలనాదక్షుడని వెనకేసుకు రావడంపైనే అభ్యంతరం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై సీబీఐ, ఈడీ కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వానికి సాగిల పడ్డారని అనుకుందాం. మరి ఏ కేసులూ లేని చంద్రబాబుకు ఏమైంది? రాష్ట్ర హక్కుల విషయమై ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీగా టీడీపీకి బాధ్యత లేదా? టీడీపీ దేనికోసం కేంద్ర ప్రభుత్వానికి సాగిలపడిందో సమాధానం చెప్పాలి. చంద్రబాబు హయాంలో గరిష్ఠ స్థాయిలో సాయం పొంది వుంటే 2019 సార్వత్రిక ఎన్నికల మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఎందుకని ఉద్యమ బాట పట్టారు?
అప్పుడు మోదీ పని అయిపోయిందని, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని నమ్మి చంద్రబాబు వేసిన ఎత్తులు అన్నీఇన్నీ కావు. అయితే అనుకున్నదొకటి, అయ్యిందొకటి అనే చందాన అంతా రివర్స్ కావడంతో చంద్రబాబు కుక్కిన పేనులా కిక్కురమనకుండా ఉన్నారు. గతంలో మోదీపైకి ఎలాగైతే చంద్రబాబును ఉసిగొల్పి భ్రష్టు పట్టించారో, ఇప్పుడు జగన్‌ను అదే విధంగా చేయాలని ఎల్లో మీడియా కలలు కంటోంది. అయితే ఎల్లో మీడియా ఏది కావాలని కోరుకుంటుందో, ఆ పని ఎట్టి పరిస్థితుల్లో జగన్ చేయడని జగమెరిగిన సత్యం. అయితే రెచ్చగొడితే జగన్ ఏదో ఒక బలహీన సమయంలో రెచ్చిపోక పోతాడా? అని ఎల్లో మీడియాకు చిన్న ఆశ.
ఇదే సందర్భంలో ఈ మీడియా తెలంగాణలో మాత్రం వింత వాదన తెరపైకి తెచ్చింది. మోదీపైకి తిరగబడిన కేసీఆర్ ఇక ఇంటిదారి పట్టాల్సిందే అని హెచ్చరిస్తూ…. మీడియాధిపతి రాతలు రాయడం తెలిసిందే. మోదీపై తిరగబడిన కేసీఆర్‌పై ఒక వాదన, స్నేహం కొనసాగిస్తున్న జగన్‌పై మాత్రం మరో వాదన చేయడం వారికే చెల్లింది. ఎప్పుడెలా వ్యవహరించాలో జగన్‌కు బాగా తెలుసు. జగన్‌కు తన ప్రయోజనాలే ముఖ్యం.
ఇందులో మరోమాటే లేదు. చంద్రబాబు విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ ఇద్దరు నేతలు మౌనంగా ఉన్నారనే ఆగ్రహం రాష్ట్ర ప్రజానీకంలో ఉంది. అయితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కేవలం జగన్‌ని మాత్రమే అంటే ప్రయోజనం వుండదు. ఏ రాత వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో తెలియని స్థితిలో సమాజం లేదు. అందుకే జగన్ విషయంలో ఎన్ని రాతలు రాసినా… జనం పట్టించుకోవడం లేదు. రాసిన వాళ్లే చులకన అవుతున్నారు.