రాష్ట్రమంతా జగన్ పాలిస్తుంటే, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాత్రం టీడీపీ పరిపాలనే సాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది. కానీ ఆళ్లగడ్డలో మాత్రం టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం చేష్టలుడిగి, ఏమీ చేయలేక నిస్సహాయంగా ప్రేక్షకపాత్ర పోషిస్తుండడం తీవ్ర విమర్శల పాలవుతోంది. అసలు వైసీపీ ప్రభుత్వమా? టీడీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందా? అనే అనుమానాలు, ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి మరో దాష్టీకానికి పాల్పడ్డారు. రుద్రవరం మండలానికి చెందిన రెహమాన్ అనే వ్యక్తిపై సదరు మాజీ మంత్రి, ఆమె భర్త, తమ్ముడు కలిసి దాడికి పాల్పడి, అతని వద్ద ఉన్న రూ.1.35 కోట్లు లాక్కున్నారు. ప్రస్తుతం బాధితుడు నంద్యాల ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అసలేం జరిగిందంటే…
రుద్రవరానికి చెందిన రెహమాన్ ఆళ్లగడ్డలో రెండేళ్ల క్రితం రూ.1.65 కోట్లకు స్థలం కొన్నాడు. 25 శాతం అడ్వాన్స్ చెల్లించాడు. మిగిలిన సొమ్ము నిర్ణీత సమయంలోపు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ స్థలం చింతకుంట శివరామిరెడ్డిది. దీన్ని మొదట దత్తు అనే మధ్యవర్తి కొన్నాడు. అతని నుంచి రెహమాన్ కొనుగోలు చేశాడు.
గడువు లోపు రెహమాన్ స్థలానికి డబ్బు చెల్లించలేదు. అప్పటి నుంచి వివాదం నడుస్తోంది. కొనుగోలు చేసిన రేట్ ప్రకారం డబ్బు చెల్లిస్తానని, రిజిస్ట్రేషన్ చేయించాలని రెహమాన్ కోరాడు. అయితే వడ్డీతో సహా చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేసేందుకు అభ్యంతరం లేదని స్థలయజమానులు చెప్పారు. ఇందుకు రెహమాన్ అంగీకరించలేదు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే దగ్గరికి పంచాయితీ వెళ్లింది. అయితే తాను ఇలాంటి పనులు చేయలేనని తెగేసి చెప్పారు.
నంద్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చి మాజీ మంత్రికి చెప్పి చేస్తామని హామీ ఇచ్చారు. సదరు మాజీ మంత్రి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. డబ్బు తీసుకురావాలని, రిజిస్ట్రేషన్ చేసిస్తానని నమ్మబలికారు. దీంతో రెహమాన్ రూ.1.35 కోట్లు తీసుకుని మహిళా నేత ఇంటికి టీడీపీ స్థానిక నేతలతో కలిసి వెళ్లాడు. తమను కాదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే దగ్గరికి పోతావా? ఆళ్లగడ్డలో తమను కాదని స్థలాలు కొనేంత వాడివయ్యావా? అని బూతులు తిడుతూ దాడికి పాల్పడినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ దాడికి పాల్పడిన వారిలో భార్యాభర్తలు, మాజీ మంత్రి తమ్ముడు ఉన్నారని తెలిసింది. దాడి విషయమై ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించినట్టు సమాచారం.
దీంతో అతను భయంతో ఇంటి నుంచి రెండురోజుల పాటు బయటికి రాలేదు. ఈ విషయమై ఆళ్లగడ్డలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో… ఇవాళ రెహమాన్ ఫిర్యాదు చేసేందుకు నంద్యాల ఎస్పీ కార్యాలయానికి వెళ్లినట్టు తెలిసింది. ఆళ్లగడ్డలో వరుస అరాచకాలకు పాల్పడుతున్నా వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఊరికే ఎందుకు ఉందో అర్థం కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి నాయకులను పెట్టుకుని టీడీపీ ఏం చేయాలని అనుకుంటోందని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం సదరు రౌడీ నాయకురాలి అరాచకాలకు ముకుతాడు వేస్తుందో, లేదో కాలమే జవాబు చెప్పాల్సి వుంది. రాష్ట్రమంతా తమ వారిపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని టీడీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆళ్లగడ్డలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకున్నాయి.