Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆ సిగ్గు ఆమెకేనా..? అతడికి వుండదా..!?

ఆ సిగ్గు ఆమెకేనా..? అతడికి వుండదా..!?

ఒంటి మీద ఏ దుస్తులున్నాయి? ఎంత వరకూ వున్నాయి? అసలు దుస్తులున్నాయా? లేదా? ఈ ఆరాలు ఆడవాళ్ళ విషయంలోనే జరగుతాయి. ఇంకా చెప్పాలంటే ఆడ తారల విషయంలోనే జరుగుతాయి. కానీ మగతారల విషయంలో జరగవు. ఈ రికార్డులను అప్పుడప్పుడూ మగవాళ్ళు సైతం బద్దలు కొడుతూ వుంటారు. అదీ కూడా ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో. కానీ ఈ మధ్య మన దేశంలో ఒక మగతార బద్దలు కొట్టారు. ఆయనే రణబీర్‌ సింగ్‌. ‘పద్మావతి’ చిత్రంలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్ర పోషించి విశేషాదరణ పొందిన నటుడు ఆయన.

కానీ ఆయన ఒక మేగజైన్‌ కోసం ‘ఫోటో షూట్‌’ లో పాల్గొన్నాడు. ఎలా? ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా. ఆ ఫోటోలను ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కోట్ల సంఖ్యలో జనం చూసేశారు. ఈ లోగా ఆయన మీద కేసు నమోదు అయ్యింది. దాంతో చూడని వాళ్ళు కూడా చూసేశారు.

బహిరంగంగా ఆయన అశ్లీల ప్రదర్శన చేసి, ఆయన నేరానికి పాల్పడ్డారు అన్నది ఆయన మీద ఫిర్యాదు. ముంబయిలోని చెంబూరు పోలీసుస్టేషన్‌ లో లలిత్‌ టెక్‌చాందిని అనే సామాజిక కార్యకర్త ఆయనకు వ్యతిరేకంగా ఎఫ్‌. ఐ. ఆర్‌ నమోదు చేశారు. ఇందుకు భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని రెండు సెక్షన్లను  (292, 293లను ) ఆశ్రయించారు. రెండూ బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలాను నిరోధించేవే. మొదటి అశ్లీల ప్రచురణలను నిరోధించేదయితే, రెండవది పిల్లలకు అశ్లీల వస్తువులను చూపటాన్ని అడ్డుకునేది. ఇది కాక స్త్రీలను గౌరవాన్ని కించపరచే (509) సెక్షన్‌ ను కూడా ప్రయోగించారు.  

అయితే ఇన్నాళ్ళూ, అశ్లీల ప్రదర్శనకు చెందిన అభియోగాలను స్త్రీలపైనే మోపుతూ వచ్చారు. ఎక్కువ ప్రసిధ్ధుల మీదనే ఈ కేసులు ప్రయోగించారు. ఆ ప్రసిధ్ధుల్లో కూడా స్త్రీలే అధికులు. ‘రోగ్‌’ చిత్రంలో పూజాభట్‌ నటించినప్పుడు విడుదలయి పోస్టర్ల చూసి ఈ నేరమే మోపారు. ఆ పోస్టర్లు అశ్లీలకరంగా, అసభ్యకరంగా వున్నాయని ఒక సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు బంద్రా మెజిస్ట్రేట్‌ కేసు మీద దర్యాప్తు చెయ్యమని బంద్రా మెజిస్ట్రేట్‌ (2005లో) ఆదేశించారు. ఆకేసు పలు న్యాయస్థానాలను దాటి హైకోర్టుకు రావటానికి ఏడేళ్ళు పట్టింది. దీనిని ‘పబ్లిసిటీ స్టంట్‌’ గా గుర్తించి కేసును పక్కన పెట్టేశారు.

ఒక దశాబ్ద కాలంలో ఈ తరహా కేసులు బాలీవుడ్‌ మహిళా తారల మీద బాగానే మోపారు. సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తీసిన ‘డర్టీ పిక్చర్‌’లో విద్యాబాలన్‌ ప్రధాన పాత్ర విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రోమోలూ, పోస్టర్లూ అభ్యంతరంగా వున్నాయని హైదరాబాద్‌ పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేశారు. ఒక ఫ్యాషన్‌ షోలో అసభ్యకరంగా ప్రవర్తించారని, ప్రముఖ నటి, కాలమిస్టు ట్వింకిల్‌ ఖన్నాను ఏకంగే అరెస్టే చేశారు. ఒక న్యూయిర్‌ పార్టీలో అశ్లీల ప్రదర్శన చేశారని మల్లికా షెరావత్‌ మీద కేసు నమోదు చేశారు. శిల్పాశెట్టి అశ్లీల చిత్రాలు ప్రచురించినందుకు ఒక తమిళ పత్రికపైనా, ఆమె పైనా కూడా ఒక న్యాయవాది కేసును నమోదు చేశారు.

చూశారా? ‘అశ్లీల ప్రదర్శన’ అంటే ఆడవాళ్ళు మాత్రమే చేస్తారనే దృష్టి ఇంతవరకూ కలిగించారు. ఈ ధోరణి ఎంతవరకూ పెరింగిందంటే, స్త్రీలు పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని, అశ్లీలంగా కనిపించటం వల్లనే అత్యాచారాలు జరగుతున్నాయని మాట్లాడే స్థితికి వెళ్ళిపోయారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారిలో పెద్ద పెద్ద నేతలూ, సీనియర్‌ అధికారులూ వున్నారు. చాలా ఆశ్చర్యకరంగా రణబీర్‌ సింగ్‌ అనే ఒక పురుషుడి మీద ఈ ఆరోపణ చేస్తున్నారు. రెచ్చగొట్టటానికి మాత్రమే ఇలా నగ్నంగా అతను ఫోటోలు దిగాడని చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో సినిమాలలో శరీర ప్రదర్శనను మగతారలే ఎక్కువగా చేస్తున్నారు. జిమ్ముల్లో చెమటోడ్చి సాధించుకున్న కండల (సిక్స్‌ ప్యాక్‌, ఎయిట్‌ ప్యాక్‌) దేహాలను తెరమీద ప్రదర్శించటానికి తెగ తహతహ పడిపోతున్నారు. ఏదో వంక మీద, ఏదో దృశ్యంలో దుస్తులు సగం పైగా వలచి కండల ప్రదర్శన చెయ్యకుండా వుండలేక పోతున్నాడు. వీళ్ళ ప్రదర్శనతో చూస్తే, మహిళా తారల దేహ ప్రదర్శన చాలా తక్కువ. అయినా అదేమీ అభ్యంతర కరంగా వుండటంలేదు.

నగ్నత్వమూ, అశ్లీలమూ ఒకటి కాదు. కాదనే చట్టాలు కూడా చెబుతున్నాయి. కళలో భాగంగానో, సాహితీ సృజనలోనో నగ్నత్వాన్ని చూపినా, వర్ణించినా అది అశ్లీలం కాదు. ఈ విషయాన్ని చట్టమే స్పష్టం చేస్తోంది. ప్రార్థనా స్థలాల్లో కూడా నగ్న శిల్పాలుంటాయి.

అలా కాకుండా అభ్యంతరకర ప్రవర్తనను రేకేత్తించే విధంగా చెయ్యటాన్నే అశ్లీలమనే నిర్వచనాన్ని చట్టం కూడా చెబుతోంది.

అయితే ఈ నగ్నత్వాన్ని నిరసన రూపంగా కూడా పలుదేశాల్లో వాడుతుంటారు. ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలకు వ్యతిరేకంగా అర్థనగ్న ప్రదర్శనలూ, నగ్న ప్రదర్శనలూ ప్రపంచంలో పలు చోట్ల జరుగుతూనే వుంటాయి. కానీ మన దేశంలో నగ్నత్వాన్నీ, అర్థనగ్నత్వాన్నీ ఇప్పటికీ  నిరసనగా భావించిన సందర్భాలు తక్కువ. ఈశాన్య భారతంలో మణిపూర్‌ వద్ద ఒక సారి మనోరమ అనే మధ్యవయస్కురాలిని సైనిక సిబ్బందే, అపహరించి, అత్యాచారం చేసి, చంపి పారేశారన్న ఆగ్రహంతో అసోం రైఫిల్స్‌ కార్యాలయం మందు, మహిళలు (వృధ్దులు సైతం) దుస్తులు వలిచేసుకుని నగ్నంగా నిలబడి ‘మమ్మల్ని కూడా రేప్‌ చెయ్యండి రా!’ అగ్రహంతో అరిచారు. ఈ ఘటన దేశాన్నే కాదు, ప్రపంచాన్నే కుదిపేసింది.

అలాగే ‘టాలీవుడ్‌’లో ‘క్యాస్టింగ్‌ కోచ్‌’ (లైంగిక వాంఛలు తీరిస్తేనే సినిమాల్లో అవకాశాలు ఇచ్చే దురాచారం) నడుస్తోందంటూ, ఒక మహిళ అర్థనగ్న ప్రదర్శన చేశారు. అదీ నిరసన రూపమే. కానీ, ఆమె లేవనెత్తిన సమస్యకు పరిష్కారం లభించక పోగా, ఆమెపై పలువిధాల దుష్ప్రచారాలు చేశారు, చేస్తూనే వున్నారు. అది వేరే విషయం.

కానీ రణబీర్‌ సింగ్‌ ప్రదర్శన వల్ల మగవాళ్ళ వస్త్ర ధారణ మీద అభ్యంతరాలు రావటం విశేషం. ఇప్పుడు సరికొత్తగా ‘అశ్లీలం’ మీద చర్చ జరగటం కూడా ప్రత్యేకం. విడ్డూరం కాకపోతే, చట్ట సభల్లో ఎన్నికయిన సభ్యులు ‘అశ్లీలం’ లేకుండా మాట్లాడుతున్నారా..!?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?