పవన్ కల్యాణ్.. అసమానమైన క్షాత్రతేజాలు, హీరోయిజం ఉన్న వ్యక్తి. ఎలాంటి శత్రువునైనా చిటికెలో చిత్తు చేయగలడు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా.. సునాయాసంగా అధిగమించగలడు. తనంటే గిట్టనివారు ఎన్ని కష్టనష్టాలను సృష్టించినా.. వాటిని తోసిరాజంటూ.. అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలడు! ఇదంతా వెండితెర మీద!
అంటే.. ఒక రచయితో దర్శకుడో తన బుద్ధికి తోచినట్టుగా పరిస్థితుల్ని మార్చేస్తూ.. విజయాలను హీరో ఖాతాలో రాసిపెట్టినప్పుడు మాత్రమే జరిగే పని. మరి ప్రాక్టికాలిటీ సంగతేమిటి? ఆ మాటకొస్తే రాజకీయ జీవితంలో పవన్ కల్యాణ్ ప్రస్థానం ఎలా సాగుతోంది. సీఎం కుర్చీ లక్ష్యంగా పావులు కదుపుతున్న పవన్ కల్యాణ్.. అనుకున్నది అనుకున్నట్టుగా సాగుతుందా? ఆయన కలగంటున్నట్టుగా తనతో పాటుగా, బిజెపిని కూడా చంద్రబాబు పల్లకీ మోయించడానికి బోయీగా వాడుకోవాలని ఆయన అనుకున్నది జరిగే పనేనా?
కనీసం బిజెపిని విడిచిపెట్టి.. చంద్రబాబును భుజానికెత్తుకోవడమైనా కుదురుతుందా? మంచో చెడో.. తెలిసో తెలియకో ఒకసారి కమలదళం కౌగిలిలోకి వెళ్లిపోయిన పవన్ కల్యాణ్.. అందులోంచి బయటకు రాగలరా? విజయం సంగతి.. ప్రజాధీనం! కనీసం తాను వ్యూహాల వరకు సమర్థుడిని అని చాటుకోగలరా? అవి కబంధహస్తాలు కాదని నిరూపించగలరా? ఇదే ఈ వారం గ్రేటాంధ్ర విశ్లేషణాత్మక కథనం.
జనసేనాని పవన్ కల్యాణ్ కు తనకున్న అపరిమితమైన ప్రజాబలం గురించి.. తనకున్న రాజకీయ వ్యూహరచనా సామర్థ్యం గురించి అంచనాలు చాలా ఎక్కువ! ఆ రెండూ తనకున్న గొప్ప బలాలని ఆయన నమ్ముతుంటారు. కొన్నిసార్లు ఆ అంచనాలు ఆయనకు షాక్ లు ఇస్తుండవచ్చు. కానీ.. ఆ షాక్ లకు ఆయన వేరే కారణాలను అన్వేషించి, తన అహాన్ని సంతృప్తి పరచుకుంటారే తప్ప.. తన అంచనాలు తప్పు అని మాత్రం ఎన్నటికీ అనుకోరు!
తన ప్రజాబలాన్ని అమితంగా ఊహించుకుని పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీని బీఎస్పీ పొత్తుతో ఒంటరిగా బరిలోకి దించాడు. అత్యంత దారుణంగా దెబ్బతిన్నాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా కొన్ని సినిమాలు చేశాడే తప్ప.. ఆయన ప్రజాబలం ఏ రూపంగా ఎంత మేర పెరిగిందని ఎలా అంచనాకు వచ్చాడో తెలియదు. ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలని గమనిస్తున్న వారికి మాత్రం.. అప్పుడూ జనాదరణ ఒకే తీరుగా కనిపిస్తూ ఉంటోంది. ఆయనకు తన బలం పెరిగిందని అనిపిస్తే ఎవరికీ ఏ అభ్యంతరమూ లేదు.
ప్రజాబలం గురించి ఊహించుకున్నట్లుగానే.. తన వ్యూహచాతుర్యం గురించి కూడా ఆయన అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ‘ప్రభుత్వ వ్యతిరేక/ జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూస్తా’ అనే నినాదాన్ని పదేపదే వినిపిస్తూ చంద్రబాబు పల్లకీ మోయడానికి పవన్ కల్యాణ్ చాలా ఉబలాటపడుతున్నారు. బిజెపి కూడా జగన్ వ్యతిరేకతను స్పష్టంగానే చూపిస్తున్నది గనుక.. తాను వారితో పొత్తు పెట్టుకుని బంధాన్ని కొనసాగిస్తున్నాడు గనుక.. ఏదో ఒక తీరుగా ఢిల్లీ హైకమాండ్ ను ఒప్పించి.. వారితో కూడా చంద్రబాబు పల్లకీ మోయించాలనేది కూడా ఆయన మనసులో ఉన్న ప్లాన్-ఏ!
చంద్రబాబునాయుడు ఒకసారి తమకు చేసిన ద్రోహానికి ఇక జీవితంలో ఆయనను క్షమించబోయేది లేదని బిజెపి భీష్మించుకుంటే గనుక.. వారిని విడిచిపెట్టి అయినా సరే.. తనకు కనీసం 30 సీట్లు విదిలించాలనే డిమాండ్ తో చంద్రబాబు పంచన చేరి.. ప్రభుత్వంలో భాగంగా మారాలనేది ఆయన ప్లాన్-బి!
తన పార్టీకి కేటాయించే సీట్లలో జాగ్రత్తగా ఫోకస్ పెట్టి గరిష్టంగా నెగ్గితే.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుకు తన పార్టీకి దక్కిన సీట్లు అనివార్యం అయ్యే పరిస్థితి వస్తే గనుక.. తనకు ముఖ్యమంత్రి కుర్చీలో వాటా ఇవ్వాలనే కోరిక.. ఈ రెండు రకాల ప్లాన్ ల వెనుక ఉన్న అసలు వ్యూహం. అది గనుక వర్కవుట్ అయ్యేట్లయితే తొలి రెండున్నరేళ్లు తనను సీఎం చేసి.. ఆ తర్వాతి రెండున్నరేళ్లను చంద్రబాబు పంచుకోవాలనేది కూడా ఆయన మనసులో మర్మం కావొచ్చు. ఇవి అప్రకటితాలు!! పవన్ కల్యాణ్ విరచిత ఎన్నికల యుద్ధ వ్యూహాలు!
ప్లాన్ ఏను పూర్తిగా తీసి పారేయవచ్చు. మోడీని అన్నేసి మాటలు అన్న తర్వాత.. ఆయన దళపతులు తిరిగి చంద్రబాబు నాయుడు పల్లకీ మోయడానికి జీవితకాలంలో సుముఖత చూపిస్తారని ఊహించలేం. బీజేపీ మహా అయితే కోరుకునేదెల్లా.. కేంద్రంలో కీలక సందర్భాల్లో ఏపీలోని పార్టీల మద్దతు. అటు వైసీపీ అయినా, ఇటు తెలుగుదేశం అయినా వారికి మద్దతివ్వడానికి సదా సంసిద్ధంగానే ఉంటున్నాయి. ఆ మాత్రం దానికి కొత్తగా చంద్రబాబుకు జై కొట్టాల్సిన అవసరం వారికి లేదు. చంద్రబాబు చంకలోకి ఎక్కకుండా 2024 ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటైనా గెలవలేను అనే భయం ఉన్నది పవన్ కల్యాణ్ కు మాత్రమే. బిజెపికి అయితే.. ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవకపోయినా పెద్ద తేడా రాదు. అవసరమూ లేదు. ఏపీలో ఏ పార్టీ ఎంపీలైనా వారి మాట దాటిపోయేదీ లేదు. సో, పవన్ కల్యాణ్ వ్యూహాల్లో ప్లాన్ ఏ అనేది ఏ పరిస్థితుల్లోనూ వర్కవుట్ కాదని అనుకోవచ్చు.
ఇక ప్లాన్ బి! బిజెపిని విడిచిపెట్టి.. పవన్ కల్యాణ్ విడిగా చంద్రబాబుకు మద్దతివ్వడం! పేపర్ మీద వ్యూహంగా ఇది బాగానే ఉంటుంది. గత ఎన్నికల తర్వాత ఏర్పడిన జనసేన- బిజెపి బంధం.. తొలినుంచి తూతూమంత్రంగానే తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటోంది. వారు ఎన్నడూ ఒక జట్టుగా ఇప్పటిదాకా పనిచేసింది లేదు! ఈ నామమాత్రపు బంధం పుటుక్కుమనడం పెద్ద విషయం కాదు. చిటికెలో ఆ పని అయిపోగలదు! అదే జరిగితే గనుక.. చంద్రబాబు నాయుడుకు ఎడ్వాంటేజీ అవుతుంది. పవన్ కల్యాణ్ అభిమాన, అనుకూల, కాపు ఓటు బ్యాంకును ఆయన గంపగుత్తగా సొంతం చేసుకోవచ్చు.
ఇది సాధారణంగా పైకి కనిపించే సమీకరణం. కానీ.. అచ్చంగా ఇలాగే జరుగుతుందా? తమ జట్టు వీడి పవన్ కల్యాణ్ బయటకు వెళ్తానంటే బిజెపి ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేస్తుంది? అనే ప్రశ్న రావొచ్చు! బిజెపి, ఊరుకోకుండా చాలా చాలా చేయడానికి అవకాశం ఉంది.
అవమానం భరించలేరు..
కేంద్రంలో మోడీ పరిపాలనకు దేశమంతా నీరాజనాలు పడుతున్నదని వారు టముకు వేసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి వాళ్లంతా మోడీ నిర్ణయాలను హర్షిస్తున్నారని కూడా అంటూ ఉంటారు. అలాంటిది ఏపీ లాంటి రాష్ట్రంలో.. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని, ఇంకా బొడ్డూడని ఒక పార్టీ జనసేన.. కమలదళంతో పొత్తుల్లో ఉండి.. హఠాత్తుగా వారి జట్టు వీడి బయటకు వెళ్లిపోతున్నదంటే.. అది కమలదళానికి అవమానకరం అవుతుంది.
బిజెపి ప్రత్యర్థులు ఈ విషయాన్ని సరిగ్గా ప్రచారం చేసుకోగలిగితే గనుక.. దేశవ్యాప్తంగా కూడా బిజెపి హవాపై బురద చల్లడానికి వారికి ఇది ఉపయోగపడుతుంది. పవన్ లాంటి అతి చిన్న నాయకుడికే ఆ పార్టీ మీద నమ్మకం లేదు.. అలాంటి పార్టీని దేశప్రజలు ఎందుకు నమ్మాలి అని జాతీయ ప్రత్యర్థులు ప్రచారం చేసుకుంటే.. బిజెపి గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది.
అందుకే పవన్ కల్యాణ్ తమ జట్టు వీడి బయటకు వెళ్లడానికి వారు ఇష్టపడరు. నయానా భయానా ఆయనను తమతోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు.
కారణం ఏం చెప్పగలరు?
పవన్ కల్యాణ్ బిజెపితో కటీఫ్ చెప్పదలచుకుంటే.. కారణం ఏం చెప్పగలరు? జగన్ వ్యతిరేకత అనేదే పవన్ కల్యాణ్ సింగిల్ పాయింట్ ఎజెండా! బిజెపి కూడా జగన్ మీద నిశిత విమర్శలనే గుప్పిస్తోంది. ఒక రేంజిలో ఆటాడుకుంటోంది. అలాంటి నేపథ్యంలో వారినుంచి ఎందుకు తాను విడిపోతున్నాను అనే విషయంలో.. పవన్ కల్యాణ్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? బిజెపి కూడా వ్యతిరేకిస్తుండగా.. పనిగట్టుకుని చంద్రబాబు చంక ఎక్కాల్సిన అవసరం ఏమిటి? అని ప్రజలు అడిగితే ఆయన మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఇది పవన్ కు చాలా క్లిష్టమైన సంగతి.
అలాకాకుండా విధిగా బిజెపిని వీడి బయటకు రావాలనుకుంటే.. ఆ పార్టీ మీద తీవ్రమైన నిందలు వేయాల్సి ఉంటుంది. బిజెపి పార్టీని విలన్ గా ప్రొజెక్టు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు బిజెపిని విలన్ గా నిందించాలంటే.. ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేశారనే విషయం తప్ప ఇంకో మాట లేదు.
కానీ.. వారితో పొత్తుబంధంలోకి దూరిననాటినుంచి.. ఇప్పటిదాకా.. ప్రత్యేకహోదా మాటెత్తకుండా.. ఎన్డీయే భాగస్వామి పార్టీ అనే హోదాను అనుభవిస్తున్న పవన్ కల్యాణ్ కొత్త ప్రత్యేకహోదా డిమాండ్ వినిపిస్తే ప్రజలు నమ్ముతారా?. ఆ మిష మీద బిజెపి మీద నిందలు వేస్తే. పవన్ కల్యాణ్ ఒక పెద్ద అవకాశవాది, మాటమార్చే కుత్సిత నాయకుడు అని ఛీత్కరించుకోకుండా ఉంటారా? అనేది పెద్ద సందేహం. ఆ రకంగా చూసినప్పుడు.. పవన్ కల్యాణ్ ఏదో ఒకరకమైన వంకర వాదనలు వినిపించవచ్చు గానీ.. అవి ప్రజల ఎదుట నవ్వుల పాలయ్యే వాదనలుగానే మిగులుతాయి. ఆయన క్రెడిబిలిటీ (అలాంటిది ఉంటే) సర్వనాశనం అయిపోతుంది.
జగన్ తో అక్రమబంధం ముడిపెతారా?
బిజెపి అనేది జగన్ కు తెరవెనుక సహకరిస్తోందని, వారిద్దరూ ఒకే జట్టు అని నెపం పెట్టడం పవన్ కు ఉన్న మార్గాల్లో ఒకటి. కానీ.. పవన్ నోటమ్మట ఆ మాట వస్తే.. బిజెపి చాలా సీరియస్ గా తీసుకుంటుంది. పవన్ కల్యాణ్ ను ఇన్నాళ్లూ మిత్రుడిగా చూసినప్పుడు ఆయనతో వ్యవహరించిన తీరు వేరు.. ఇలాంటి నింద వేస్తే గనుక.. వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది.
అందుకే వెళ్లనివ్వరు..
ఏ రకంగా చూసినా.. జనసేన పార్టీ ఎన్డీయే జట్టు నుంచి బయటకు వస్తే గనుక.. మోడీ దళానికి అది చాలా పెద్ద అవమానం. అందుకే వారు పవన్ ను బయటకు వెళ్లనివ్వరు. రాష్ట్రంలో తెలుగుదేశానికే ఏం సీన్ లేదని, మనమిద్దరం కలిసి పోటీచేస్తే జగన్ ను మట్టి కరిపించగలం అని బిజెపి వాదిస్తే గనుక.. పవన్ కౌంటర్ ఇవ్వలేరు. మోడీ కి ఉన్న ప్రజాదరణకు, పవన్ కల్యాణ్ ప్రజాదరణ తోడైతే తిరుగుండదనే వాదన తెస్తే.. పీకే ఇరకాటంలో పడతారు.
తనకున్న ప్రజాదరణ మొత్తం సభల్లో విజిల్స్ వేసే బ్యాచ్ మాత్రమేనని.. వాళ్లెవ్వరూ ఓట్లు వేసే రకం కాదని ఆయన బయటకు చెప్పుకోలేరు. చెప్పుకుంటే పరువు నష్టం. చెప్పుకోకపోతే.. బిజెపితోకలిసి మాత్రమే బరిలోకి దిగాల్సి వస్తుంది. ఇలాంటి సంకటస్థితిలో పవన్ పడతారు. అలా ఆయనను ఇరకాటంలోకి నెట్టి.. పొత్తు బంధం చెడకుండా ఉండడానికి బిజెపి ఫోకస్ పెట్టే అవకాశాలే ఎక్కువ.
ఎలా కట్టడి చేస్తారు..?
ఎన్డీయే జట్టులో ఉండడమా? మానడమా? అనేది నా ఇష్టం. నన్ను అడ్డుకోగల వారెవ్వరు? నాకు చెప్పే అంతటి వారెవ్వరు? అని పవన్ బీరాలు పోవచ్చు. కానీ, పవన్ ను గీత దాటనివ్వకుండా కట్టడి చేయడానికి వారికి అనేక మార్గాలు ఉంటాయి. పవన్ కల్యాణ్ సినిమా షూటింగులు చేయకుండా మనుగడ సాగించడం కష్టం. భవిష్యత్తులో ఇన్ని సినిమాలు చేస్తాను అనే మాట ఇచ్చి అడ్వాన్సులు పుచ్చుకోకుండా.. ఆయన ఎన్నికల సంగ్రామాన్ని ఎదుర్కోవడం కూడా కష్టం.
బిజెపి జట్టులోంచి బయటకు వస్తే.. పవన్ కల్యాణ్ తో సినిమా తీయడానికి పూనుకున్న ప్రతి నిర్మాతను కేంద్రం టార్గెట్ చేసిందంటే గనుక.. ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. సినిమా పరిశ్రమ అంటేనే బ్లాక్ మనీ ఆధారంగా నడిచే దందా. కేంద్రం టార్గెట్ చేస్తే.. పవన్ కల్యాణ్ తో సినిమా తీయడానికి ఏ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాకపోయే దుస్థితి ఏర్పడవచ్చు.
తన బతుకు తెరువు కోసం సినిమాలు తప్ప వేరే మార్గం లేదని.. తనకేమీ ఫ్యాక్టరీలు, అక్రమాస్తులు లేవని చెప్పుకునే పవన్ కల్యాణ్ సినిమాలకు దూరం కాలేరు.
ఇది మాత్రమే కాదు. పర్సనల్ వ్యవహారాల సహా.. పవన్ ను ఇరుకున పెట్టడానికి బిజెపి వారి వద్ద అనేకానేక వ్యూహాలు ఉంటాయి. ఇదమిత్థంగా ఇదీ.. అని చెప్పలేని మార్గాల్లో వారు ఆయనను అష్టదిగ్బంధనం చేసేయగలరు. బిజెపి- జనసేన అనివార్యంగా, ఇష్టం లేకపోయినా సరే.. కలిసి పోటీచేయాల్సి రావచ్చు. ఏతావతా చంద్రబాబు ఒంటరిగానో, నామమాత్రం కమ్యూనిస్టుల మద్దతుతోనో బరిలోకి వెళ్లాల్సి వస్తుందనేది ఒక విశ్లేషణ.
పవన్ కల్యాణ్ మౌలికంగా నటుడు. ఆయన హీరోయిజం సహా సకల లక్షణాలూ డైరక్టరు నిర్దేశించినట్టుగా సాగుతాయి. కానీ.. రాజకీయాల్లో కూడా ఆయన తన పాత్రను పోషించడానికి మాత్రమే పరిమితం కావాల్సి రావొచ్చు. డైరక్టర్ అనే పాత్రలో బిజెపి రిమోట్ నుంచి నడిపించవచ్చు. పొత్తులకు ఒడంబడిన పాపానికి.. పవన్ కల్యాణ్ అనివార్యంగా, అయిష్టంగా అయినా సరే.. వారి యాక్షన్, కట్ లకు అనుగుణంగా మాత్రమే చేయాల్సిన దుస్థితి ఏర్పడవచ్చు.
.. ఎల్ విజయలక్ష్మి