టీడీపీ, జనసేనలకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఆ రెండు పార్టీల మధ్య అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవైపు బీజేపీతో తాను సంసారం చేస్తున్నా అని పవన్ చెబుతూనే, మరోవైపు చంద్రబాబు కన్నుగీటుకు పడిపోయారాయన. చంద్రబాబు వెంటపడుతూ కట్టుకున్న బీజేపీని పవన్ పట్టించుకోవడం లేదు. దీంతో చంద్రబాబు, పవన్ మధ్య సాగుతున్న ప్రేమాయణాన్ని బీజేపీ కళ్లప్పగించి చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.
అసలే పవన్, చంద్రబాబు మధ్య అనైతిక సంబంధం. జగన్‌పై ద్వేషమే చంద్రబాబు అంటే మనసు పారేసుకునేలా చేసింది. అయితే ఇలాంటివి కలకాలం నిలబడేవి కావు. చంద్రబాబుతోనే తన రాజకీయ జీవితం అని చెప్పుకోలేని దుస్థితి పవన్‌ది. ఇటు అధికారిక మిత్రపక్షం బీజేపీ మొహం చాటేస్తుంటే, మరోవైపు అనధికారికంగా పొత్తులో ఉన్న టీడీపీ మనసులో ఏమున్నదో అర్థం కాకపోవడంతో పవన్ అయోమయానికి గురవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
పొత్తులపై పవన్ గందరగోళానికి ఆయన తాజా వ్యాఖ్యలే నిదర్శనం. ‘ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు ఉంది, ఉంటుంది కూడా. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తాం. కాదంటే ఒంటరిగా పోటీ చేస్తాం. లేదా కొత్త పొత్తులు కలిస్తే వారితో వెళ్తాం’ అని పవన్ చెప్పారు. ఎన్నికల ఫెడ్యూల్ ప్రకటించడానికి వారం రోజుల ముందు మాత్రమే పొత్తులపై స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. మరి ఈ విషయం పవన్‌కు ఇప్పుడే తెలిసిందా?
అసలు పొత్తులపై మొదటి నుంచి మాట్లాడుతున్నదే పవన్ కదా? గతంలో తాను పోటీ చేయకుండా టీడీపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చానని, ఇప్పుడు ఆ పార్టీ కాస్త తగ్గాలని పవన్ చెప్పలేదా? రాజకీయాల్లో, అందులోనూ చంద్రబాబు దగ్గర కృతజ్ఞతలకు చోటు లేదని పవన్‌కు తెలియదా? ఇంత అజ్ఞానమా? ఇప్పుడు తాను కోరుకుంటున్నట్టుగా సీట్లు ఇవ్వరనే అనుమానంతో పొత్తులపై పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని అనుకోవాలా?
పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు నోరు తెరవడం లేదు. పవన్‌కు ఇప్పటికైనా అర్థమైందా…. బాబు వ్యూహం ఏంటో? మరోవైపు పొత్తులపై పవన్‌కు ఒక విధానం అంటూ లేకపోవడంతో, అతని వల్ల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య అనుమానాలు చోటు చేసుకున్నాయనేది వాస్తవం. అది చివరికి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.