చిత్రం: పఠాన్
రేటింగ్: 2.75/5
తారాగణం: షారుఖ్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహాం, అశుతోష్ రాణా, డింపుల్ కపాడియా తదితరులు
కెమెరా: సచ్చిత్ పౌలోస్
ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
సంగీతం: విశాల్ – శేఖర్, సంచిత్- అంకిత్
నిర్మాత: ఆదిత్య చోప్రా
దర్శకత్వం: సిద్ధార్థ్ ఆనంద్
విడుదల తేదీ: 25 జనవరి 2023
హిందీ సినిమాలకి విడుదలకి ముందు క్రేజ్ రావడం గగనమైపోయిన ఈ రోజుల్లో ఈ “పఠాన్” చుట్టూ ఆసక్తికరంగా హడావిడి నెలకొంది. ఒక కారణం “బేషరం..” అనే పాట, దానిచుట్టూ ముసిరిన వివాదం. పైగా పూర్తి స్థాయి ఏక్షన్ సినిమాగా ఒక వర్గం ప్రేక్షకులకి అంచనాలు ఏర్పరిచింది. ఊహించిన దాని కంటే తొలి రోజు వసూళ్లు అన్ని ప్రాంతాల్లోనూ బాగున్నాయి.
ఇక విషయంలోకి వెళ్తే ఇది ముగ్గురు సీక్రెట్ ఏజెంట్ల మధ్యన జరిగే కథ. జిం అనే ఒక నిఖార్సైన భారతీయ సైనికుడు ఒకానొక కారణం వల్ల స్వదేశం మీద ద్వేషం పెంచుకుంటాడు. దేశానికి శత్రువుగా మారతాడు. రక్తబీజ్ అనే ఒక భయానకమైన వైరస్ ని ఆయుధంగా సృష్టింపజేస్తాడు. అతడిని అంతమొందించడానికి మరొక రా ఏజెంట్ పఠాన్ ఏం చేస్తాడనేది కథ.
వీళ్ల మధ్యలో పాకిస్తాన్ కి చెందిన ఒక ఐ.ఎస్.ఐ ఏజెంట్ రుబాయి ఉంటుంది. ఆమెకి కూడా ఒక మూసకొట్టుడు బ్యాక్ స్టోరీ ఉంటుంది. తన తండ్రి ప్రత్యర్థుల చేతుల్లో బలైనందుకు కసిని పెంచుకుని క్రుయల్ గా మారుతుంది. జిం కథ కూడా ఇదే.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అనలేం కానీ, ఇదొక ట్రయాంగిల్ ఇంటర్నేషనల్ స్పై స్టోరీ అని చెప్పొచ్చు. ఇంటెర్నేషనల్ ఎందుకంటే..ఇందులో పాకిస్తాన్, ఆఫ్రికా, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలన్నీ ఒక ట్రావెల్ వ్లాగ్ మాదిరిగా కవరయ్యాయి. ఇందులోని పాత్రలు ఒక ఊరిలో ఒక పేట నుంచి ఇంకో పేటకి వెళ్తున్నంత ఈజీగా ఆయా దేశాలకి ఆపరేషన్ పేరుతో వెళ్లిపోతుంటారు.
ఎంత కల్పిత కథ అయినా నమ్మశక్యంగా ఉండాలి. కొత్తదనం తీయడంలో మాత్రమే కాకుండా కథా, కథనాల్లోనూ ఉండాలి. కానీ అవేమీ అక్కర్లేదని ఫిక్సైపోయారు దర్శక నిర్మాతలు.
పౌరాణిక సినిమాల్లో కూడా చూడని స్టంట్స్ ఇందులో ఉన్నాయి. ఆ కొట్టుకునేది గూఢచార సంస్థల సైనికులా లేక గ్రహాంతరవాసులా అన్నది అర్థం కాకుండా రూపొందించిన యాక్షన్ సీన్స్ చిన్న పిల్లల్ని అబ్బురపరుస్తాయేమో తప్ప కాస్త బుర్ర వాడడం తెలిసిన ఆడియన్స్ కి మాత్రం బొప్పి కట్టిస్తాయి. అతిశయోక్తి అలంకారానికి కూడా అతి అనిపించే సన్నివేశాల కుప్ప ఈ సినిమాలో ఉంది. టెర్రరిస్టులు సైంటిష్టుల్ని బంధించడం, ఏదో వెపన్ తయారు చేసి విధ్వంసం సృష్టించాలనుకోవడం, దానిని హీరో గారు నిర్వీర్యం చేయడం… ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ జేంస్ బాండ్ ఫార్ములా! మళ్లీ అదే పట్టుకొచ్చారు.
అసలీ సినిమాని ఏ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసారా అనేది ఆలోచిద్దాం. ఒకవేళ యంగ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసారనుకుందాం. అయితే ఇందులోని హీరో, విలన్ 50కి పైబడిన వాళ్లు. హీరోయిన్ 40 కి చేరువలో ఉంది. ఎంత హీరోయిన్ బికినీలు వేసినా బిళ్ల గోచీలు పెట్టుకున్నా, హీరో ఎంత కండలు పెంచి చొక్కాలిప్పేసినా యువ ప్రేక్షకులకి వీళ్లు మధ్యవయసు నటీనటులకిందే లెక్క. కేమియో రోల్ లో వచ్చిన సల్మాన్ ఖాన్ కూడా అంతే.
“బ్రహ్మాస్త్ర” లాంటి కంగాళీ సినిమాని ఆ ఏజ్ జనం చూసారంటే అమితాబ్, నాగార్జున వల్ల కాదు..రణబీర్, ఆలియాల వల్ల. మరి యంగ్ కపుల్ లేని ఈ సినిమాకి ఎవరొస్తారు అని అనుకుంటే…ఓపెనింగ్స్ మాత్రం అద్భుతంగా వచ్చాయి. హాల్లో వేరే ఏ సినిమా నుంచి పోటీ లేదు కనుక నిర్మాతలు కోరుకున్నట్టుగా నడుస్తుందేమో కూడా. అలాగని ఇది గొప్ప చిత్రం మాత్రం అనిపించుకోదు. చాలా అపరిపక్వతతో కూడిన కథా, కథనాలు; విషయం లేని కథాంశం..వెరసి ఇదొక బిగ్ బడ్జెట్ బక్వాస్. తెర మీద గ్రాఫిక్స్ కి, సీజీలకి తగలేసిన బడ్జెట్ మాత్రం కొట్టొచ్చ్హినట్టు కనపడింది. ఆ హడావిడే తప్ప ఎక్కడా హత్తుకోని సోల్ లెస్ కథ ఇది.
నటీనటుల విషయనికొస్తే షారుఖ్ ఖాన్ తన వయసుకి సవాలు విసిరి అద్భుతమైన బాడీని చెక్కుకున్నాడు. ఈ హీరో నటన గురించి చెప్పాల్సిన పని లేదు. తన మార్క్ కామెడీ టైమింగ్ కూడా అక్కడక్కడ పలికించాడు.
దీపిక అందాలతో కనువిందు చేసింది. హీరోయిన్ కం వ్యాంపు టైపులో ఉంది ఈమె పాత్ర. బికినీలు కూడా సిగ్గుపడేంత చిన్న సైజులో ఉన్న పీలికలేసుకుని నటించింది . కొన్ని స్టంట్స్ బాగా చేసింది.
జాన్ అబ్రహాం విలన్ గా ఓకే. కానీ మరింత పవర్ఫుల్ నటుడిని పెట్టుంటే బాగుండేది.
సల్మాన్ ఖాన్ తన టైగర్ పాత్రలో వచ్చి ఒక ఫైట్ చేసి పఠాన్ ని రక్షిస్తాడు. ఆ ఫైట్ అయ్యాక తనకు అవసరం వచ్చినప్పుడు పఠాన్ ని పిలుస్తానని చెప్తాడు. అంటే “టైగర్” సీక్వెల్ వస్తే అందులో ఈ పాఠాన్ షారుఖ్ కనిపిస్తాడన్నమాట. ఇలా సినిమాలని క్రాస్ బ్రాండింగ్ చేసుకోవడం ఈ మధ్యన ఒక ట్రెండయ్యింది.
సాంకేతికంగా చూస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంత వరకు ఓకే తప్ప కొత్తదనం లేదు. కెమెరా వర్క్, గ్రాఫిక్స్ మాత్రం అద్భుతమని చెప్పుకోవాలి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉన్నా బాగుండేది. ప్రధమార్థం, ద్వితీయార్థం మొత్తం ఒకే ఫార్మాట్ లో ఎత్తుకు పై ఎత్తులు వేయడం, భీకరంగా కొట్టుకోవడంతోనే సాగుతుంది.
ఏ మాత్రం జెనెరల్ నాలెడ్జ్ లేని ఆడియన్స్ కి ఏమో కానీ, గూఢచార వ్యవస్థలు, అందులోని సీరియస్నెస్ తెలిసిన ప్రేక్షకులు మాత్రం దీనిని ట్రోల్ చేసుకుంటూ చూస్తారు. హాలీవుడ్ స్థాయి ఏక్షన్ సీన్స్ ఉంటే చాలు, మిగతావన్నీ అవసరంలేదనుకునే ఆడియన్స్ నుంచి మాత్రం కంప్లైంట్ ఉండకపోవచ్చు.
బాటం లైన్: బిగ్ బడ్జెట్ యాక్షన్