టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి ఆర్కే రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావుపై అవహేళనగా మాట్లాడాన్ని ఆమె తప్పు పట్టారు. ఇవాళ రోజా మీడియాతో మాట్లాడుతూ అక్కినేనిని బాలయ్య అవమానించడం తప్పని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్‌ని అవమానిస్తే వీళ్లు ఎంత బాధపడతారో, అదే విధంగా అక్కినేని అభిమానులు కూడా బాధపడతారన్నారు.
తన తప్పును బాలయ్య ఇప్పటికీ సరిదిద్దుకోలేదన్నారు. బాలయ్య ఎప్పటికీ సరిదిద్దుకోడని రోజా చెప్పుకొచ్చారు. ఇక పనిలో పనిగా జనసేనాని పవన్‌కల్యాణ్, టీడీపీ యువనేత లోకేశ్‌లపై రోజా విమర్శలు గుప్పించారు. కౌన్సలర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అయిన లోకేశ్ పాదయాత్రకు తాము ఎందుకు అనుమతి ఇవ్వాలని ఆమె ప్రశ్నించడం గమనార్హం. లోకేశ్ పాదయాత్ర చేయగానే రాజకీయంగా ఏదో అయిపోతుందనే భ్రమలో టీడీపీ వుందన్నారు. లోకేశ్ యువగళం కాదు…టీడీపీకి సర్వమంగళం అని వ్యంగ్య కామెంట్ చేశారు. లోకేశ్ పాదయాత్రకు పచ్చ మీడియా ఉద్దేశపూర్వకంగానే హైప్ ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు.
పాదయాత్ర మొదటి రోజే వాళ్లకి అంతసీన్ లేదని అర్థం అయిపోతుందని రోజా విమరశించారు. పొత్తులపై జనసేనాని పవన్‌కల్యాణ్ రోజుకో మాట మాట్లాడి రాజకీయాలను గందరగోళ పరుస్తున్నారని విమర్శించారు. 26 జిల్లాల్లో జనసేనకు అధ్యక్షులే లేరని చెప్పుకొచ్చారు.
అసలు జనసేన పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులే లేరని విమర్శించారు. జనసేన కాదది, చంద్రసేన అని సెటైర్ విసిరారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ తాపత్రయ పడుతున్నారన్నారు. జనసేన కాదది, కన్ఫ్యూజన్ పార్టీ అని విమర్శించారు.