సీనియర్ ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో ఓ వెలుగు వెలిగారు. అయితే అల్లుడు చంద్రబాబు చేతిలో ఎన్టీఆర్ ఘోర అవమానం పొందారనేది బహిరంగ రహస్యమే. మామకు వెన్నుపోటు పొడిచిన అల్లుడిగా చంద్రబాబు రాజకీయ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్‌లో నాణేనికి రెండో వైపు చూడాల్సి వుంది. ఎన్టీఆర్‌కు మొత్తం 8 మంది కుమారులు, నలుగురు కుమార్తెలు.
కుమారుల్లో నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, కుమార్తెల్లో పురందేశ్వరి, భువనేశ్వరిల గురించి ఎక్కువ మందికి తెలుసు. ఎందు కంటే వీరిలో భువనేశ్వరికి తప్ప మిగిలిన వారికి రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. బాలయ్య, హరికృష్ణ సినీ ఇండస్ట్రీ పరంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ కావచ్చు. పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటే శ్వరరావు మామకు తోడుగా టీడీపీలో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. మామకు చేదోడువాదోడుగా నిలిచారు.
భువనేశ్వరి భర్తే చంద్రబాబునాయుడు. ఎన్టీఆర్‌కు అల్లుడయ్యే నాటికే చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు. అంతేకాదు, మంత్రిగా కూడా సేవలందించారు. 1995లో ఎన్టీఆర్‌ను సీఎం గద్దె దించే ఎపిసోడ్‌కు సంబంధించి అందరూ చంద్రబాబు వైపు వేలెత్తి చూపుతున్నారు. కానీ గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ వ్యవహారాల్ని చూస్తుంటే…. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది అల్లుడు కాదు కొడుకులే అని చెప్పక తప్పదు. 8 మంది కుమారుల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరైనా తండ్రికి తగ్గ వారసుడు కాకపోవడం… ఆ మహానటుడు, నేత చేసుకున్న దురదృష్టమే తప్ప మరొకటి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అక్కినేని నాగేశ్వరరావుపై ఇటీవల బాలయ్య చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అక్కినేని… తొక్కినేని అనడం ద్వారా బాలయ్య తన అహంకారాన్ని ప్రదర్శించినట్టైంది. ఈ ఒక్క తప్పే అయితే, బాలయ్యను అర్థం చేసుకోవచ్చు. బాలయ్య నోరు తెరిస్తే ఏదో ఒక వివాదాస్పదమే. అభిమానులు, టీడీపీ కార్యకర్తలపై చేయి చేసుకోవడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. రెండు వాక్యాలు కూడా సరిగ్గా మాట్లాడలేని బాలయ్య లాంటి వాళ్లు ఎన్టీఆర్‌కు నట వారసులే తప్ప, రాజకీయ వారసులు కాకపోవడం తెలుగు సమాజం చేసుకున్న అదృష్టం.
''అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు.. చిరంజీవికి ఏమైంది.. మేము వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు'' అని గతంలో బాలయ్య అనడం గురించి తెలిసిందే. ఈ మాటల్ని బట్టి బాలయ్య తెలివి తేటల్ని అంచనా వేయొచ్చు. ప్రతి మాటలోనూ అహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తామేదో ఆకాశం నుంచి దిగొచ్చిన ఫీలింగ్ బాలయ్య మాటల్లో కనిపిస్తుంది. ఇలాంటి కొడుకులు ఎంత మంది ఉంటే ఏం లాభం? ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబు కోడిపిల్లల్ని గద్ద ఎత్తుక పోయినట్టు తన్నుకెళ్లారు.
బాలయ్య లాంటి కుమారులుంటే… ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవక ఏ అల్లుడైనా ఏం చేస్తారు? ఆ పని చంద్రబాబు కాకుంటే, మరొకరైనా చేసి వుండేవారు. కాకపోతే అల్లుడు కాబట్టి చంద్రబాబుకు మామను వెన్నుపోటు పొడవడం సులువైంది. ఎన్టీఆర్‌ను గద్దె దించే కుట్రలో సడుగుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బామ్మర్దులు బాలయ్య, హరికృష్ణలను చంద్రబాబు భాగస్వామ్యుల్ని చేశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు విజయవంతంగా పదవీచ్యుతుడి చేశారనే కంటే, ఆ మహానుభావుడు అసమర్థులైన కుమారులను కన్నందుకు మూల్యం చెల్లించుకున్నారంటే అతిశయోక్తి కాదేమో.
కనీస సభా మర్యాదలు పాటించని బాలయ్య వ్యవహారశైలిని చూస్తూ… చంద్రబాబు మనసులో నవ్వుకుంటూ వుంటారు. ఇలాంటి బామ్మర్దుల వల్లే కదా తనకు సీఎం పదవి అనే బంగారు కుర్చీ దొరికిందని సంబరపడుతుంటారు. చంద్రబాబు తన వారసుడి విషయానికి వచ్చే సరికి ఎంతో జాగ్రత్తపడుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడైన లోకేశ్‌ను తన తర్వాత టీడీపీకి వారసుడిని చేసేందుకు చంద్రబాబు తపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఉన్న అడ్డంకిని నందమూరి వారసులతోనే ఆయన కంటిని పొడిచారు. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకి అనే ముద్ర వేయించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
లోకేశ్ తెలివితేటల గురించి ప్రత్యర్థులు, సొంత వాళ్ల అభిప్రాయాలు ఎలా వున్నా…. చంద్రబాబు సమర్థుడైన నాయకుడు కావడంతో అప్రమత్తం కావడాన్ని గమనించొచ్చు. చంద్రబాబు పాటి బుద్ధి, తెలివితేటలు ఎన్టీఆర్‌కు ఉండి వుంటే ఆ కథ వేరేగా వుండేది. భవిష్యత్‌ను, చంద్రబాబును, అలాగే తన కుమారుల సమర్థత విషయంలో అంచనా వేయడంలో ఎన్టీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. నాదెండ్ల భాస్కర్‌రావు చేతిలో వెన్నుపోటుకు గురైన అనుభవాల నుంచి ఎన్టీఆర్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు.
ఎన్టీఆర్ కుమారులు ఆయనకు మించి అజ్ఞానులని చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ లోకానికి చాటి చెప్పింది. తాజాగా అక్కినేనిపై బాలయ్య అవాకులు చెవాకుల నేపథ్యంలో ఎన్టీఆర్ వెన్నుపోటు అంశం చర్చనీయాంశమవుతోంది. బాలయ్య లాంటి బామ్మర్థులుంటే… చంద్రబాబు లాంటి బావలు, అల్లుళ్లు కాక మరెవరు పుట్టుకొస్తారనే ప్రశ్న ఎంతైనా ఆలోచించదగ్గదే.