నారా లోకేశ్ రాజకీయ జీవితంలో ఇదో కొత్త ప్రస్థానం. ఆయన భవితవ్యాన్ని తేల్చే పాదయాత్ర మొదలుకానుంది. పాదయాత్రకు సమయం ముంచుకొస్తోంది. ఈ నెల 27న కుప్పంలో వేయనున్న అడుగులు విజయతీరాలకా లేక ఓటమి ఒడ్డుకు చేరుస్తాయా? అనే ప్రశ్నకు కాలం జవాబు చెప్పాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన ఇంటి నుంచి గమ్యస్థానానికి బయల్దేరుతున్న సమయంలో ఉద్విగ్న క్షణాలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం నుంచి కుమారుడు లోకేశ్ పాదయాత్రికుడై బయల్దేరుతున్న శుభ సమయాన సహజంగానే ఉద్వేగపూరిత వాతావరణ నెలకుంది. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు లోకేశ్ ఏకైక కుమారుడు. దీంతో అతన్ని మురిపెంగా పెంచుకున్నారు. మొదటిసారి ఇల్లు విడిచి ఏడాది పాటు ప్రజల మధ్య గడపడానికి లోకేశ్ బయల్దేరుతున్న వేళ కుమారుడిని చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.
తల్లిదండ్రులకు లోకేశ్ పాదాభివందనం చేశారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తల్లి భువనేశ్వరిని ఆత్మీయంగా హత్తుకున్నారు. కుమారుడిని హృదయపూర్వకంగా మరోసారి దీవించారు. అనంతరం భార్య బ్రాహ్మణి విజయ తిలకం దిద్దారు. అత్తమామలు వసుంధర, బాలయ్యలకు లోకేశ్ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అతను ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి తాత దీవెనలు తీసుకున్నారు. ఆ తర్వాత కడపకు వెళ్లారు.
కడపలో దర్గా, మరియాపురంలోని చర్చి తదితర పుణ్య స్థలాలను సందర్శించారు. కడప నుంచి అతను నేరుగా కుప్పానికి వెళ్లనున్నారు. తనతో పాటు టీడీపీ భవిష్యత్‌తో ముడిపడి ఉండడంతో లోకేశ్ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిన తరుణం ఇది. ఇక జీవితాన్ని ఎలా మలుచుకోవాలనేది లోకేశ్ చేతల్లోనే వుంది. లోకేశ్ ఏం చేస్తారో చూడాల్సి వుంది.