కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరినట్టే సీబీఐ విచారణకు గడువు ఇచ్చింది. విచారణకు కేవలం ఒక్క రోజు ముందు మాత్రమే తనకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో విచారణకు అడ్డంకులు ఎదురవుతున్నాయని, ఇలాగైతే తనకు న్యాయం జరగదని వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సుప్రీంకోర్టుకెళ్లారు.
ఏపీ కాకుండా మరెక్కడికైనా విచారణను మార్చాలని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె విన్నపాన్ని న్యాయస్థానం మన్నించింది. తెలంగాణ రాష్ట్రానికి మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తును మార్చింది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ విచారణ నిమిత్తం ఈ నెల 24న హైదరాబాద్ రావాలని నోటీసులు పంపింది. కడప ఎంపీగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్నానని, ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడంతో నోటీసుల్లో పేర్కొన్న సమయం ప్రకారం విచారణకు రాలేనని ఆయన సమాచారం పంపారు.
కనీసం ఐదు రోజులు ముందుగా చెబితే విచారణకు సహకరిస్తానని అవినాష్‌రెడ్డి సీబీఐ అధికారులకు విన్నవించారు. ఆయన విన్నపాన్ని సీబీఐ అధికారులు మన్నించి, ఆ మేరకు రెండోసారి నోటీసులు పంపారు. ఈ నెల 28న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కేంద్రంగా తీవ్ర ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటిసారి ఆయన విచారణ ఎదుర్కోనున్నారు. దీంతో భవిష్యత్ పరిణామాలు ఏమవుతాయోననే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకుంది.