టీడీపీలో ఎగ్జిట్‌పోల్స్ గుబులు పుట్టింది. జూన్ ఒకటిన దేశ వ్యాప్తంగా ఏడో విడతలో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. వైసీపీ ఒంటరిగా, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో తలపడ్డాయి.
దీంతో ఫలితాలు ఎలా వుంటాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే నెల నాల్గో తేదీ వెల్లడయ్యే ఎగ్జాట్ ఫలితాల కంటే, అంతకు మూడు రోజుల ముందు వెలువరించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఈ క్రమంలో టీడీపీ పేరుతో ఒక ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఒకటో తేదీన ప్రముఖ చానళ్లలో పేరెన్నికగన్న సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువరిస్తాయని టీడీపీ ప్రకటించింది. అయితే ఆ సంస్థల సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉండనున్నాయని, వాటిపై ఆధారపడి బెట్టింగ్స్ కట్టొద్దనేది టీడీపీ ప్రకటన సారాంశం. 2019లో కూడా లగడపాటితో తప్పుడు సర్వే ఫలితాలు చెప్పించి మోసగించారని టీడీపీ పేర్కొంది. అప్పట్లో మన వాళ్లు చాలామంది బెట్టింగ్స్‌లో ఆస్తులు పోగొట్టుకున్నారని గుర్తు చేయడం గమనార్హం.
ఎగ్జిట్‌పోల్స్ కూటమికి వ్యతిరేకంగా వచ్చినా అధైర్యపడొద్దని టీడీపీ పేర్కొంది. జూన్ 4న కూటమి విజయం సాధిస్తుందని టీడీపీ స్పష్టం చేసింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు ఎలా వుంటాయో టీడీపీకి అర్థమైంది. ఎందుకంటే ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల వివరాలను ముందుగానే అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వాటి ఆధారంగానే టీడీపీ ఉలిక్కిపడుతోందని గ్రహించొచ్చు.