గంటాకు అయ్యన్న థాంక్స్ చెబుతారా…?

విశాఖ తెలుగుదేశం రాజకీయాల్లో ఆ ఇద్దరూ భిన్న ధృవాలు. జిల్లా రాజకీయాల్లో చెరో వైపూ ఇద్దరూ నిలబడి అధినాయకత్వానికి తలనొప్పులు తెచ్చిన ఉదంతాలు ఎన్నో  ఉన్నాయని తమ్ముళ్ళే చెబుతారు. ఈ ఇద్దరు మనసులు కలవకపోవడం…

విశాఖ తెలుగుదేశం రాజకీయాల్లో ఆ ఇద్దరూ భిన్న ధృవాలు. జిల్లా రాజకీయాల్లో చెరో వైపూ ఇద్దరూ నిలబడి అధినాయకత్వానికి తలనొప్పులు తెచ్చిన ఉదంతాలు ఎన్నో  ఉన్నాయని తమ్ముళ్ళే చెబుతారు. ఈ ఇద్దరు మనసులు కలవకపోవడం వల్ల అయిదేళ్ల టీడీపీ జమానాలో నామినేటెడ్ పదవులు కూడా తమ్ముళ్ళు దక్కించుకోలేకపోయారు. గంటాను 2014 ఎన్నికల ముందు టీడీపీలోకి తీసుకోవద్దని అయ్యన్నపాత్రుడు చంద్రబాబుకే నేరుగా చెప్పిన సందర్భం ఉంది.

లేటెస్ట్ గా పార్టీలో మూడేళ్ళుగా పడుకున్న బురదపాములు లేస్తున్నాయంటూ వాటితో జాగ్రత్తగా ఉండాలని అయ్యన్న ఈ మధ్యనే సెటైర్లు వేశారు. గంటా తీరు చూస్తే ఆయన టీడీపీలో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా ఉన్నారు. అయితే అయ్యన్న అరెస్ట్ వ్యవహారం మీద ఖండించి గంటా తాను టీడీపీలోనే కంటిన్యూ అవుతాను అని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చేశారు.

ఇదే సందర్భంలో అయ్యన్నపాత్రుడికి స్నేహహస్తం కూడా అందించారు. విశాఖ జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో చూస్తే అయ్యన్నపాత్రుడుతో కలసి పనిచేయడానికే గంటా సిద్ధపడుతున్నారని అనుకోవాలి. ఉదయం అరెస్ట్ సాయంత్రానికి బెయిల్ తో అయ్యన్నపాత్రుడు ఇంటికి బాగానే చేరుకున్నారు.

తన అరెస్ట్ మీద ఎందరెందరో ఖండిస్తూ ప్రకటనలు చేసినా గంటా ట్వీట్ మాత్రం అయ్యన్నకు ఒక పెద్ద స్పెషల్ అనుకోవాలి. దానికి అయ్యన్న థాంక్స్ చెబుతారా అని గంటా వైపు వారు ఆసక్తిగా చూస్తున్నారు. అదే జరిగితే ఈ ఇద్దరూ మళ్ళీ 2004 నాటి మాదిరిగా కలసి పనిచేసుకుంటారా అన్నది ఆలోచిస్తున్నారు.

అయ్యన్నపాత్రుడు అరెస్ట్ ని గంటా తప్పు పట్టి తన రాజనీతిని చాటుకున్న వేళ జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో అయ్యన్న ఏం చేస్తారు అన్న దాని మీదనే అందరి చూపూ ఉంది. అయ్యన్న రాజకీయం ఏంటో ఇపుడు తెలుస్తుంది అన్న వారూ ఉన్నారు.