జ‌గ‌న్ టార్గెట్ నుంచి ఆ నియోజ‌క‌వ‌ర్గం ఔట్‌!

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ టార్గెట్ నుంచి ఒక నియోజ‌క‌వ‌ర్గం ఔట్ అయ్యింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. చేజేతులా విజ‌యావకాశాల‌ను…

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ టార్గెట్ నుంచి ఒక నియోజ‌క‌వ‌ర్గం ఔట్ అయ్యింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. చేజేతులా విజ‌యావకాశాల‌ను సొంత పార్టీ నేత‌లు చంపుకున్నారు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి తీరాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ టార్గెట్ పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఇందులో చంద్ర‌బాబు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం కూడా వుంది. జ‌గ‌న్ దూకుడు చూస్తే చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌నేది వాస్త‌వం. రాయ‌ల‌సీమ‌లో టీడీపీ మొద‌టి నుంచి బ‌ల‌హీనంగా వుంది. చావుత‌ప్పి క‌న్నులొట్టి పోయిన చందంగా గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా కుప్పంలో చంద్ర‌బాబు, అనంత‌పురం జిల్లా హిందూపురంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఉర‌వ‌కొండ‌లో ప‌య్యావుల కేశ‌వ్ గెలుపొందారు.

రానున్న ఎన్నిక‌ల్లో అక్క‌డ కూడా గెలుపొందాల‌ని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా హిందూపురంలో తాజా ప‌రిణామాలు పూర్తిగా వైసీపీకి వ్య‌తిరేకంగా ఉన్నాయి. హిందూపురం వైసీపీ మాజీ స‌మ‌న్వ‌య‌క‌ర్త చౌళూరు రామ‌కృష్ణారెడ్డి హ‌త్య‌కు సొంత పార్టీలోనే కీల‌క నాయ‌కులు కార‌ణ‌మ‌ని పార్టీ శ్రేణులు న‌మ్ముతున్నాయి. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నేత‌ల తీరు కూడా ఇందుకు బ‌లం క‌లిగిస్తోంది.

పార్టీ కోసం ఎంతో సేవ చేసిన రామ‌కృష్ణారెడ్డి హ‌త్య‌ను ప్ర‌భుత్వం, వైసీపీ పెద్ద‌లు చూసీచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం కూడా వైసీపీ శ్రేణుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. రామ‌కృష్ణారెడ్డి మృత‌దేహాన్ని చూసేందుకు వైసీపీ త‌ర‌పున పెద్ద‌లెవ‌రూ రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కేవ‌లం రామ‌కృష్ణారెడ్డితో వ్య‌క్తిగ‌త సాన్నిహిత్యం ఉన్న ఉమ్మ‌డి అనంత‌పురం వైసీపీ నేత‌లు మాత్ర‌మే వెళ్లారు. అంత్య‌క్రియ‌ల్లో కూడా నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నేత‌లే పాల్గొన‌డం గ‌మ‌నార్హం.

రామ‌కృష్ణారెడ్డి హ‌త్యోదంతంపై ముఖ్యంగా ఆయ‌న సామాజిక వ‌ర్గం ర‌గిలిపోతోంది. హిందూపురం నియోజ‌క వ‌ర్గంలోని 35 వేల రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట‌ర్ల‌పై ప్ర‌భావం చూప‌నుంది. రామ‌కృష్ణారెడ్డి హ‌త్య వెనుక ఎమ్మెల్సీ మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌, అత‌ని పీఏ గోపీకృష్ణ ఉన్నార‌ని కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో ఇక్బాలే వైసీపీ అభ్య‌ర్థి అయితే మాత్రం… ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీ మ‌రిచిపోవాల్సిందే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బాల‌కృష్ణ ప్ర‌చారం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని వైసీపీ నేత‌లే చెబుతున్నారు. వైఎస్సార్ కుటుంబంపై ప్రేమ పెంచుకుని, పార్టీ బ‌లోపేతం కోసం స‌ర్వ‌స్వం త్యాగం చేసిన రామ‌కృష్ణారెడ్డి విష‌యంలో వైసీపీ పెద్ద‌లు అనుస‌రించిన వైఖ‌రి మాత్రం ఎవ‌రికీ రుచించ‌డం లేద‌న్న‌ది నిజం.