అసలే ఖాకీ.. ఆపై తాగి.. కళ్లు మూసుకుపోయి.. కొందరు కొన్ని సందర్భాల్లో ఎంత నీచంగా ప్రవర్తిస్తుంటారో ఎవ్వరికీ అంతుచిక్కదు. తాను పోలీసుననే దురహంకారానికి తోడు.. కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గమైన తత్వంతో హద్దూ అదుపూ లేకుండా ప్రవర్తించేవాళ్లు బోలెడు మంది ఉంటారు.
పోలీసు ఉద్యోగం అనేది తాము అరాచకంగా వ్యవహరించడానికి ఒక లైసెన్సు లాంటిదని అనుకునే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారిలో కామంతో కళ్లు మూసుకుపోయిన వారిపై హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కొరడా ఝుళిపించారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని.. ఏకంగా సర్వీసునుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కేవలం లైంగిక వేధింపులు మాత్రమే కాకుండా.. వివిధ రకాల అరాచకలకు పాల్పడిన వారిని గత పదినెలల్లో ఏకంగా 55 మందిని డిస్మిస్, టర్మినేట్, రిమూవల్ ఫ్రం సర్వీస్ చేయడం గమనార్హం.
తెలంగాణలో ఆమధ్య పోలీసులు విచ్చలవిడితనం, అకృత్యాలకు సంబంధించిన కొన్ని సంఘటనలు చాలా సంచలనం సృష్టించాయి. మారేడుమిల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కొరట్ల నాగేశ్వరరావు ఓ వివాహితను తుపాకీ చూపించి బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎదురుతిరిగినందుకు ఆమెను, భర్తను కూడా తుపాకీతో బెదిరించి తన కారులో నగర శివార్లలోని తన ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడ వారిని బంధించి ఉంచాలనేది అతని ప్లాన్ గా అప్పట్లో ప్రచారం జరిగింది. వెళుతుండగా అతని కారుకు యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో ఆ వివాహిత కారు దిగి పారిపోయి.. సమీపంలోని వనస్థలి పురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసు విచారణలో అంతా నిజమే అని తేలింది. ఇప్పుడు అతడిని సర్వీసునుంచి తొలగించారు.
ఓ మహిళా కానిస్టేబుల్ కు అర్ధరాత్రి బూతు మెసేజీలు పంపడం, వీడియో కాల్స్ చేసి వేధించడం లాంటి దరిద్రాలకు పాల్పడిన మరో సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ రెడ్డిని కూడా విధులనుంచి తొలగించారు.
కామాతురాణాం న భయం న లజ్జా.. అని అంటారు. కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి భయమూ లజ్జ ఉండవని ఈ వాక్యం మనకు నీతిని చెబుతుంది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు వృత్తిలో ఉంటూ.. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించే ఇలాంటి వారి వలన డిపార్టుమెంట్ కే చెడ్డపేరు అని భావించిన ఉన్నతాధికారులు ఇలాంటి వారిని తొలగించారు.
మరో సంతోషకరమైన విషయం ఏంటంటే.. లంచం తీసుకుంటూ దొరికిన కేసులకు సంబంధించి కూడా కొందరు పోలీసులను ఏకంగా విధులనుంచి టర్మినేట్ చేయడం. పోలీసు ఉద్యోగం అనగానే.. లంచం తీసుకోవడం రుబాబు చేయడం అనేది తమ హక్కుగా భావించేవారు అనేకమంది ఉంటారు. ఇప్పుడు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తీసుకున్న కఠిన చర్యలు, ఉద్యోగాల్లోంచి తొలగించడం అలాంటి వారికి హెచ్చరిక. ఇలాంటి చర్యలు .. తప్పు చేయాలనుకునే పోలీసుల్లో కొంచెమైనా పునరాలోచన పుట్టిస్తే అదే చాలు. వ్యవస్థ బాగుపడుతుంది.