ఉత్తరాంధ్ర కోసం జగన్ సర్కారే రంగంలోకి దిగింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించినప్పటికీ, ఎందుకనో ఆ ప్రాంత పౌర సమాజం నుంచి ఆశించిన స్థాయిలో వైసీపీకి, ప్రభుత్వానికి అనుకూలత రావడం లేదు. మరోవైపు విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని అదే ఉత్తరాంధ్రకు అమరావతి పేరుతో పాదయాత్రగా బయల్దేరారు. పైపెచ్చు అమరావతే ఏకైక రాజధానిగా వుండాలని ఉత్తరాంధ్ర నుంచి గళాలు వినిపిస్తుండడం వైసీపీకి చిరాకు తెప్పిస్తోంది.
దీన్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. రాజకీయంగా ఇది వైసీపీకి జీర్ణం కావడం లేదు. పౌర సమాజం నుంచి మూడు రాజధానులకు మద్దతు లభించి వుంటే బాగుండేదని వైసీపీ అభిప్రాయం. మరీ ముఖ్యంగా అడగకనే ఉత్తరాంధ్రకు జగన్ సర్కార్ వరాలిస్తున్నా… ఊహించిన స్థాయిలో మద్దతు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో అమరావతి పాదయాత్ర త్వరలో ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనుంది. ఇది ఉత్తరాంధ్రపై దాడి, దండయాత్ర అని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు చేయాల్సి వస్తోంది. దీంతో ఇది రాజకీయపరమైన అంశంగా ఉత్తరాంధ్ర సమాజం భావిస్తున్నట్టుంది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని తమ ప్రాంతానికి, దండయాత్రగా వస్తున్నారని ఉత్తరాంధ్రలోని ప్రజాసంఘాలు, మేధావులు, విద్యావంతులు ఉద్యమించి వుంటే బాగుండేది.
కానీ అలా ఎందుకు జరగడం లేదనేదే ప్రశ్న. విశాఖ రాజధాని కావాలనే ఆకాంక్ష ఆ ప్రాంత ప్రజానీకంలో లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమరావతి పాదయాత్రకు కౌంటర్‌గా ప్రభుత్వం మరో వ్యూహం రచించింది. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ ఈ నెల 15న విశాఖ గర్జన పేరుతో భారీ ర్యాలీ, సభకు ప్లాన్ చేసింది. దీనికి వైసీపీ మద్దతు పలికింది.
దీని వెనుక ఎవరున్నారో చెప్పాల్సిన పనిలేదు. తాను తలకెత్తుకున్న వికేంద్రీకరణకు, తానే మద్దతు కూడగట్టుకోవాల్సిన పరిస్థితి జగన్ ప్రభుత్వానికి ఎదురైంది. ప్రజల్లో చర్చ పెట్టకుండా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలా జరుగుతోందనే అభిప్రాయం వైసీపీలో ఉంది. ఈ నెల 15న ఏం జరుగుతుందో చూద్దాం.