తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు తన దమ్ము నిరూపించుకోవాలంటే.. మునుగోడుకు వచ్చి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పోటీచేయాలట! ఒకవైపు తాను ప్రధానమంత్రి మోడీకే ముచ్చెమటలు పట్టించాలనే మిషన్ మీద, తెరాసను జాతీయ పార్టీగా మార్చి కేసీఆర్ దేశరాజకీయాలవైపు కదులుతోంటే.. మునుగోడులో బిజెపి తరఫున నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కు దమ్ముంటే వచ్చి మునుగోడులో తన మీద పోటీచేయాలని ఆయన సవాలు చేస్తున్నారు.
స్థాయికి మించిన సవాళ్లతో పెద్ద పెద్ద నాయకుల మీదికే ఎదురెళ్లడం ఇటీవలి కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. స్థాయి చూసుకోవడం అనేది తర్వాతి సంగతి. కనీసం లాజిక్ చూసుకోవడం కూడా మరచిపోయి నాయకులు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న సవాలు కూడా అలాంటిదే. కోమటిరెడ్డికి కాంగ్రెసు గ్రూపు రాజకీయాల నేపథ్యంలో అక్కడ భవిష్యత్తు ఉండదనే భయంతో.. భాజపా తీర్థం పుచ్చుకున్నాడు.
తాను బలమైన నాయకుడినే అని కొత్త పార్టీలో నిరూపించుకుంటే.. అక్కడ పెద్ద పీట వేస్తారేమోననే ఆశతో ఎమ్మెల్యే పదవికి తనంతగా రాజీనామా చేసి.. ఉపఎన్నికకు కారణం అయ్యారు. ఇక తప్పదు గనుక అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. స్థానికంగా కొన్ని ప్రతికూలతలు, నిరసన స్వరాలు వ్యక్తం అయినా సరే.. వాటన్నింటినీ తొక్కేసి.. కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు.
కానీ మునుగోడులో రాజకీయ వాతావరణాన్ని గమనిస్తున్న వారు మాత్రం.. కోమటిరెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడం నల్లేరుపై బండినడక కాబోదని అంచనా వేస్తున్నారు. ఆయన విజయం కోసం చెమటోడ్చాల్సిందే అంటున్నారు.
సీటును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అందరికంటె ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ప్రారంభించింది. తెరాస మాటల్లో.. తమకు మునుగోడులో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే అని అంటోంది. ఈ మాటలు కేవలం వారి మైండ్ గేమ్ అనుకోవడానికి కూడా వీల్లేదు. వాస్తవంగానూ అలాంటి పరిస్థితి ఉన్నదని కొందరు అంచనా వేస్తున్నారు.
నామినేషన్ సందర్భంగా కోమటిరెడ్డి, కేసీఆర్ కు సవాళ్లు విసురుతూ దమ్ముంటే వచ్చి మునుగోడులో పోటీచేయాలని అన్నారు. ఇదేం పిచ్చి సవాలో అర్థం కావడం లేదు. మరో చోట ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి.. రాజీనామా చేసి వచ్చి ఎందుకు పోటీచేస్తాడు? ఇలా అర్థం పర్థంలేని సవాళ్లతో నవ్వులపాలవుతామనే ఆలోచన కోమటిరెడ్డికి ఉన్నట్టు లేదు.
ఆ మాటకొస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ కంటె.. ఈటల రాజేందర్ బెటర్. రాబోయే ఎన్నికల్లో తాను గజ్వేల్ లో పోటీచేసి కేసీఆర్ ను ఓడిస్తానని సవాలు చేశారు. కోమటిరెడ్డికి నిజంగానే అంత కోరిక ఉంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్లి కేసీఆర్ మీదనో, కేటీఆర్ మీదనో పోటీచేసి తన దమ్ము నిరూపించుకోవచ్చు కదా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.