ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతాయని అనుకున్న తిరుపతి టౌన్‌బ్యాంక్ ఎన్నికలు…చివరికి ఉసూరుమనింపించాయి. వైఎస్సార్ సీపీ తన అధికారాన్ని ఉపయోగించుకుని ప్రత్యర్థులు పలాయనం చిత్తగించేలా చేసింది. తిరుపతి టౌన్‌బ్యాంక్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రకటించే పరిస్థితిని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన తనయుడు, డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి కల్పించారు.
తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌లో మొత్తం 57,250 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 12 డైరెక్టర్ల స్థానాలకు 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కాలేజీ గ్రౌండ్‌లో 114, క్లాస్ రూమ్స్‌లో 16 పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు 440 ఓట్లు చొప్పున కేటాయించారు. ఎన్నికలు రెండు గంటలకు పూర్తయి, మూడు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి వుంది.
అయితే ఎన్నికల ప్రక్రియ ముగియకుండానే టీడీపీ చేతులెత్తేసింది. అధికార పార్టీ దౌర్జన్యాలను టీడీపీ అడ్డుకోలేకపోయింది. మీడియా ముందు విమర్శలకే పరిమితమైంది. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. సభ్యులు కాని వారితో ఓట్లు వేయించారని ఆమె చెప్పారు. రీపోలింగ్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేయడం గమనార్హం.
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్ దగ్గరుండి మరీ దొంగ ఓట్లు వేయించినట్టు ప్రత్యర్థులు ఆరోపించారు. ఓటర్లు కాని వారంతా పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా వ్యవహరించారని టీడీపీ నేతలు విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే భూమన టౌన్ బ్యాంక్ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇది ప్రాక్టీస్ అన్నట్టు ప్రత్యర్థులను ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ భయకంపితులు చేశారు. ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు … గెలిచామా? లేదా? అన్నదే ప్రధానం అనే రీతిలో ప్రత్యర్థులకు చోటే లేకుండా చేయగలిగారు. ఆ విధంగా ప్రజాస్వామ్యవాది భూమన తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో తన వాళ్లను కౌంటింగ్ జరగకుండానే విజేతలుగా నిలిపారు.