అభ్యర్థుల ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడుతో టీడీపీ, జనసేన నేతల్లో భయం పుట్టింది. ఒక వైపు వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతుంటే, టికెట్‌పై ఎలాంటి భరోసా లేకపోవడంతో టీడీపీ, జనసేన నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో తక్కువ సమయంలో ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. ఇలాగైతే ఎన్నికల్లో నెగ్గడం కష్టమని చంద్రబాబు, పవన్‌లకు ఇరు పార్టీల నేతలు మొరపెట్టుకున్నారు.
ఇదే సందర్భంలో ఎన్నికల సమరానికి సిద్ధమంటూ వైఎస్ జగన్ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ, మీరు రెడీనా అని ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ దెబ్బకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు దిగి రావాల్సి వచ్చింది. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలకుండానే కొంత మంది అభ్యర్థులనైనా ప్రకటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఉమ్మడి ప్రెస్‌మీట్ నిర్వహించి కొంత మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు.
చంద్రబాబు, పవన్‌లతో పాటు ఇరు పార్టీల ముఖ్య నేతలు అచ్చెన్నాయుడు, లోకేశ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితరుల పేర్లు ప్రకటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల శంఖారావం సభకు ముందు అభ్యర్థుల ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండు పార్టీల్లోని శ్రేణుల్లో జోష్ నింపాలంటే కొంత మంది అభ్యర్థులనైనా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. వైసీపీ అభ్యర్థులను జగన్ ప్రకటించక పోయి వుంటే, టీడీపీ, జనసేన అభ్యర్థులను ఇప్పుడైనా ప్రకటించే అవకాశం వుండేది కాదు.