జనసేనకు కేటాయించే సీట్లపై టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకుంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఉమ్మడి ప్రెస్‌మీట్ నిర్వహించి రెండు పార్టీలకు చెందిన కొంత మంది అభ్యర్థులను ప్రకటించేందుకు శుభముహూర్తం పెట్టుకున్నారు. అయితే జనసేనకు ఇచ్చే సీట్లపై ఎక్కువగా ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జనసేనకు ఎలాంటి నిర్మాణం లేదు. జనసేనకు ఎక్కడ సీటు ఇచ్చినా , టీడీపీ మద్దతు లేకపోతే గెలిచే పరిస్థితి వుండదు.
ఇందుకు పవన్‌కల్యాణ్ కూడా మినహాయింపు కాదు. ఈ విషయాన్ని స్వయంగా పవన్‌కల్యాణే ఒక బహిరంగ సభలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో తమ నాయకత్వాన్ని బలిపెట్టి జనసేన నేతల పల్లకీ మోయాల్సి వస్తుందనే ఆందోళన టీడీపీ నేతల్లో సహజంగానే వుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు అడుగుతోంది.
రాయలసీమలో జనసేన బలం నామమాత్రమే. టీడీపీకే రాయలసీమలో దిక్కులేని పరిస్థితి. అందుకే గెలిచే చోట సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకోవాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. ఇదే భావన టీడీపీ నేతల్లో కూడా వుంది. దీంతో ఇరుపార్టీల మధ్య వివాదం తలెత్తుతోంది. ఇప్పటికే కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, తాడేపల్లిగూడెం, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతలు సిగపట్లు పడుతున్నారు.
టీడీపీ, జనసేనలలో ఒకరికి టికెట్ ఇస్తే, మరొకరు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టికెట్ల పంపిణీలో చంద్రబాబు, పవన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.
ఉదాహరణకు రాజమండ్రి రూరల్‌ను జనసేనకు కేటాయిస్తే, సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఊరికే వుంటారని ఎవరూ అనుకోరు. ఎందుకంటే చంద్రబాబు కంటే టీడీపీలో ఆయన సీనియర్. తాను టీడీపీ వ్యవస్థాపక సభ్యుడినని పలుమార్లు బుచ్చయ్య గుర్తు చేసిన సంగతి తెలిసిందే. టికెట్ వస్తే చాలు …గెలిచిపోతామనే ధీమా వుండడంతో ఇరుపార్టీల నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇదే సందర్భంలో టికెట్ దక్కకపోతే ఎలా వుంటుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.