ఎట్టకేలకు టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనపై సానుకూల వార్త. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసి సుమారు 60 నుంచి 70 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఆయా పార్టీల కార్యాలయాల నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినట్టు తెలుస్తోంది.
“జాబితాలో మీ పేరు వుంది. రేపు అధినేతలు ప్రకటించనున్నారు. విజయవాడకు రండి” అని టీడీపీ, జనసేన నాయకులకు వర్తమానం వెళ్లింది. టికెట్ దక్కిన నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌పై స్పష్టత ఇస్తూ తమ కార్యాలయాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చిన విషయాన్ని సహచర నాయకులతో ఆనందంగా పంచుకుంటూ… మీకు ఏమైనా సమాచారం వచ్చిందా? అని టీడీపీ, జనసేన నాయకులు ఆరా తీస్తున్నారు.
ఫోన్ కాల్స్ రాని టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత నాయకులకు ఫోన్ చేసి, తమ పేరు జాబితాలో లేదా? అని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మంచి రోజు కావడంతో కేవలం ముఖ్యమైన నాయకుల పేర్లు మాత్రమే ప్రకటిస్తున్నారని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి అంటే మరో రెండు వారాల్లో అందరి అభ్యర్థిత్వాలను రెండో దఫా ప్రకటిస్తారని ఇరుపార్టీల నాయకులు నచ్చ చెబుతున్నారని తెలిసింది.
అయితే తమ సీట్లను టీడీపీకి లేదా జనసేనకు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఎవరెన్ని చెప్పినా నమ్మలేని పరిస్థితి. తమ సీటుకు ఎసరు పెడుతున్నారనే భయం నేతలను వెంటాడుతోంది. ఏదో జరగబోతోందని కీడు శంకిస్తున్న నాయకులు లేకపోలేదు. దీంతో ఫోన్ కాల్స్ రాని నాయకులు సైతం హుటాహుటిన విజయవాడకు వెళుతున్నారు.