రిలేషన్షిప్స్ లో పడిపోయి, అందులో నిమగ్నమైపోయి, బాధ్యతలు, బాంధవ్యాల్లో మునిగిపోయి.. తమను తాము మరిచిపోయే వారుంటారు! తమ వారి పనుల్లో తనమునకలైపోయి తమకు తాము సమయం కేటాయించుకోని వారుంటారు! అయితే .. ఎంతటి రిలేషన్షిప్ లో ఉన్నా.. మీకంటూ కొంత సమయం కేటాయించుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కూడా చాలా ముఖ్యమని అంటారు రిలేషన్షిప్ కౌన్సెలర్లు!
అలా తమకంటూ తాము సమయం కేటాయించుకోకపోతే, తమను తాము ప్రేమించుకోకపోతే.. ఏదో ఒక రోజున అలాంటి చింతన అయితే ఒకటి కలిగే అవకాశం ఉందంటారు. రిలేషన్షిప్ లో సహచరికి సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో ఎవరికి వారు సమయం కేటాయించుకోవడం కూడా అంతే ముఖ్యం అనేది స్థూలంగా థియరీ!
సెల్ఫ్ లవ్ ఉండాలి!
మీరు ఒకరిని లవ్ చేస్తూ ఉన్నా, మిమ్మల్ని ఒకరు లవ్ చేస్తూ ఉన్నా.. ఇదే సమయంలో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మాత్రం చాలా కీలకం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే.. మీరు ప్రేమించే వారి కోసం ఏమేం చేస్తారో, వారి కోసం ఎంత సమయం, ఎంత డబ్బు వెచ్చిస్తారో.. అలాంటివి మీకు మీరు వెచ్చించుకోవల్సిన అవసరం ఉండటం!
మెడిటేషన్ కంటూ కొంత సమయం!
ప్రస్తుత బిజీ లైఫ్ లో కొంత సమయం కేటాయించుకుంటూ మెడిటేషన్ చేయడాన్ని అలవరుచుకుంటే అన్ని రకాలుగానూ మంచిదనేది సలహా. దినవారీ జీవితంలో ఉంటే ఒత్తిడి, యాంగ్జైటీని తట్టుకోవడానికి మెడిటేషన్ చేసుకోవడం ఉత్తమమార్గం. ఇది సెల్ఫ్ లవ్ లో భాగమే!
ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు!
అన్ని విషయాల్లోనూ, అన్ని రకాలుగానూ పర్ఫెక్ట్ గా ఉండాలనే తాపత్రయాన్ని తగ్గించుకుంటే మంచిది! వృత్తిగత జీవితంలోనో, వ్యక్తిగత జీవితంలోనో కొన్ని లోటు పాట్లంటూ లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు! కాబట్టి.. ఏదో చిన్న చిన్న విషయాలను అతిగా తీసుకుని.. పర్ఫెక్ట్ గా లేమే అనే ఆందోళనకు గురి కావడం తగదు. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదనే విషయాన్ని గుర్తుంచుకుని మీ లోని లోటుపాట్లను మీరే క్షమించేసుకుంటే మంచిది!
పాజిటివ్ సర్కిల్ ను ఏర్పాటు చేసుకోవడం!
కాసిన్ని మంచి మాటలు మాట్లాడి, కాస్త పాజిటివిటీని పంచే స్నేహాలను ఏర్పరుచుకోవాలి. నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే వ్యక్తులు, మిమ్మల్ని అతిగా విమర్శించే వ్యక్తులకు దూరంగా జరగడం మంచి అలవాటు. అది స్నేహితులైనా, బంధువులు అయినా.. తరచూ కలిసే వాళ్లు మీకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే వారిని చూసుకోవాలి తప్ప, మిమ్మల్ని తూర్పారబడుతూ అదనపు ఒత్తిడిని కలిగించే వారి వైపుకు వెళ్లకపోవడం మంచిది!
పర్సనల్ స్పేస్ ను కలిగి ఉండటం!
ఇండిపెండెంట్ గా ఉండగలగాలి, ఎవ్వరూ తోడు లేకపోయినా పనులను చేసుకోగలిగే శక్తిని సంతరించుకోవాలి. అందరితోనూ కలిసి ఉన్నా.. పర్సనల్ స్పేస్ ఉండాలి! ఒక నడకో, ఒక లాంగ్ డ్రైవో, మరో పుస్తకపఠనమో, సోలోగా సినిమా చూడటమో… ఇలాంటి ఏదైతే ఆసక్తి ఉందో, దాన్ని సోలోగా చేసుకోగలుగుతూ.. తమకంటూ పర్సనల్ స్పేస్ ను కొంత కలిగి ఉండగలగాలి!
సెల్ఫ్ కేర్ ఉండాలి!
ఫిజికల్ గా, మెంటల్ గా ఫిజికల్ కేర్ ను కలిగి ఉండటం సెల్పిష్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు! మీ కేర్ పట్ల మీరు ఆసక్తి చూపుతున్నప్పుడు వచ్చే కామెంట్లను కూడా లైట్ తీసుకోవడం మంచిది!
క్రియేటివ్ టాస్క్ లు!
ఆసక్తి ఉంటే క్రియేటివ్ టాస్క్ లను చేపట్టడం కూడా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడంలో భాగమే అవుతుంది. దేన్నైనా క్రియేటివ్ గా తీర్చిదిద్దగల మీ శక్తి కి బయట నుంచి వచ్చే ప్రశంసలు కూడా మీకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి.
మీ బౌండరీల్లో ఉండండి!
మీకు సెట్ కావు అని మీరు బలంగా నమ్ముకున్న వాటిని ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎవరితో అయినా కచ్చితంగా ఉండటంలో తప్పు లేదు! మీకు కూడా సరదా అనిపించే విషయాలను పక్కన పెడితే.. వేరే విషయాల్లో బౌండరీలను కలిగి ఉండటంలో తప్పు లేదు. ఎవరైనా ఆ బౌండరీలను క్రాస్ చేసే విషయంలో ఒత్తిడి చేసినా నిర్మొహమాటత్వం మంచిదే!