అటు బైబిల్ సూక్తులు.. ఇటు స్కార్పియో బిల్డప్పులు

“ఈ అతే కాస్త తగ్గించుకుంటే మంచిది.” సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న సబ్జెక్ట్ ఇది. దసరా నుంచి రాష్ట్ర పర్యటనకు వస్తున్న పవన్ 8 కొత్త స్కార్పియోలకు దండలు కట్టి ఆఫీస్…

“ఈ అతే కాస్త తగ్గించుకుంటే మంచిది.” సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న సబ్జెక్ట్ ఇది. దసరా నుంచి రాష్ట్ర పర్యటనకు వస్తున్న పవన్ 8 కొత్త స్కార్పియోలకు దండలు కట్టి ఆఫీస్ ముందు పెట్టి ఫొటోలు తీయించి సోషల్ మీడియాలో వదిలారు. ఇలాంటి బిల్డప్ లు చూస్తుంటే.. జనసేన ఎంత ఖరీదైన సేనో అర్థమవుతుంది. తనను తాను తగ్గించుకొనువాడు అంటూ బైబిల్ సూక్తులు చెప్పే పవన్.. ఇలా స్కార్పియోలతో హంగామా చేయడం దేనికి.

పవన్ కల్యాణ్ రాజకీయ ప్రచారం దసరా సందర్భంగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అక్టోబర్ లో మొదలయ్యే ప్రచారానికి ఇప్పుడు స్కార్పియోలు కొనడం, పోనీ కొన్నారే అనుకో.. వాటిని ఇలా ప్రదర్శనకు పెట్టడం, సీఎం కాన్వాయ్ లాగా బ్లాక్ స్కార్పియోల వీడియోలు, పొటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం దేనికి..? ఈ అతి వల్లే ఇన్నాళ్లూ జనసైనికులు జనంలో పలుచన అయ్యారు. ఇప్పుడు మళ్లీ అంతకు మించి అంటూ అతి చేస్తున్నారు. ఎన్నికలకు ముందే మా జనసేనాని సీఎం అయిపోయారని, ఆయనకు కాన్వాయ్ కూడా వచ్చేసిందని కలలు కంటున్నారు. దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

అక్టోబర్-5 నుంచి యాత్ర మొదలు పెడుతున్నానని చెప్పారు పవన్ కల్యాణ్. అప్పటికి పవన్ కి కావాల్సింది కార్లు కాదు, పొత్తులపై క్లారిటీ. ప్రచార యాత్రల మొదలు పెట్టే పవన్, తన వెనక ఎన్ని కార్లు వస్తున్నాయో చూడండి అంటూ జనాలకు చెబితే సరిపోదు, తాను ఏ పార్టీతో వస్తున్నారో, వచ్చే ఎన్నికల్లో తనను అభిమానించేవారు ఏ గుర్తుకు ఓటు వెయ్యాలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ క్లారిటీ ఇవ్వకుండా నా కార్లు చూడండి అంటూ పవన్ చెబితే జనం ఎందుకు వింటారు.

తర్జన భర్జనలు..

పవన్ జనంలోకి వెళ్లే ముందే పొత్తుల విషయం తేల్చుకోవాలనుకుంటున్నారు. కానీ అదింకా తేలడంలేదు. టీడీపీతో వెళ్లాలని పవన్ కి మనసులో గట్టిగా ఉన్నా.. ఆ పార్టీ కూడా మహానాడు తర్వాత దూరం పెట్టింది. ఇటు బీజేపీకి.. ఇది అస్సలు ఇష్టంలేదు. దీంతో పవన్ మధ్యలో నలిగిపోతున్నారు. 

ఒకరకంగా ఇది ఆయన కోసం ఆయన తీసుకున్న గొయ్యే అనుకోవాలి. 2019 ఎన్నికల్లో విఫలం అయిన తర్వాత పార్టీ నిర్మాణంపై మరింతగా దృష్టిపెట్టి ఉంటే.. ఈపాటికే జనసేన బలం పెరిగి ఉండేది. ఉన్న ఒక్క ఎమ్మెల్యేకి మర్యాద ఇచ్చి ఉంటే ఆయన కూడా అసెంబ్లీలో జనసేన వాణి వినిపించేవారు.

ఈ రెండూ చేయకుండా.. ఎంతసేపు.. నేను సీఎం అభ్యర్థిని అని మీరు ప్రకటించండి అంటూ పక్క పార్టీలపై పడి ఏడిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎన్నికలకు రెండేళ్లే టైమ్ ఉంది. ఇప్పటికైనా పవన్ కార్లపై పెట్టిన శ్రద్ధ, కాస్త పార్టీ నిర్మాణంపై పెడితే మంచిది.