వైసీపీకి 175 సీట్లు… టీడీపీ ఏం చేస్తుందంటే…?

తమ్ముళ్ళ ప్రకటనలు సవాళ్ళూ ఒక్కోసారి వింతగా ఉంటున్నాయి. ఈ మధ్యనే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఇప్పటికిపుడు ఎన్నికలు పెట్టి వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీ ఆఫీస్ కి తాళాలు వేసుకుంటామని భారీ…

తమ్ముళ్ళ ప్రకటనలు సవాళ్ళూ ఒక్కోసారి వింతగా ఉంటున్నాయి. ఈ మధ్యనే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఇప్పటికిపుడు ఎన్నికలు పెట్టి వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీ ఆఫీస్ కి తాళాలు వేసుకుంటామని భారీ ప్రకటన ఇచ్చేసి కొంత ఇబ్బంది పడ్డారు. ఇపుడు అదే మాటను కాస్తా మార్చి విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175కి 175 సీట్లు వస్తే తామే స్వచ్చందంగా టీడీపీ ఆఫీసుని మూసుకుంటామని పల్లా అంటున్నారు. అంటే 174 సీట్లు వస్తే మూసుకోరా అని వైసీపీ నేతలు సెటైర్లు వేసినా జవాబు ఏం చెబుతారో కానీ 175 కి ఒక్క సీటు తగ్గకూడదు అంతే అంటున్నారు పల్లా వారు.

ఈ సవాల్ సంగతి సరే కానీ నిజానికి వైసీపీకి 175కి 175 సీట్లు వస్తే టీడీపీ పార్టీ మూసుకోవాల్సిన అవరమైనా ఆయాసమైనా అసలు ఉంటుందా, అంత వ్యయప్రయాసలు పడే సీన్ ఉంటుందా అని రాజకీయాలు తెలిసిన వారు అంటున్నారు. మరోసారి మొత్తం ఏపీ అంతా వైసీపీ వెంట నడిస్తే ఒక్క సీటు కూడా టీడీపీకి రాక అఖరుకు బాబు సీటు కూడా దక్కకపోతే వేరేగా పార్టీని మూసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నదే వారి మాట‌.

175 గెలిచేలా ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే టీడీపీ ఆఫీస్ ఆటోమేటిక్ గా ఖేల్ ఖతం దుకాణం బంద్ అవుతుంది కదా అని వైసీపీ వారు రిటార్టు ఇస్తున్నారు. జగన్ 175 సీట్లు మేమే గెలుస్తామని చెప్పిన తరువాత నుంచి తమ్ముళ్ళు ఇలా ఉడుక్కుని కూడబలుక్కుని అనవసర సవాళ్ళు చేసే బదులు మేమే 175 సీట్లు గెలుస్తామని ధీమాగా క్యాడర్ కి చెప్పవచ్చు కదా అని అంటున్నారు.

అందువల్ల నిన్న అచ్చెన్న అయినా నేడు పల్లా అయినా తమ ఆవేశాన్ని అంతా సొంత పార్టీ మీద చూపిస్తే టీడీపీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి కానీ ఊరకే ఈ సవాళ్ళు ఎందుకండి అని అంటున్నారు. మరి తమ్ముళ్ళు మాత్రం జగన్ చెప్పిన 175 దగ్గరే ఆగి వైసీపీ ట్రాప్ లో పడుతున్నారా అన్న సందేహాలు అయితే ఆ పార్టీలోనే కలుగుతున్నాయని అంటున్నారంటే ఆలోచించాల్సిందే మరి.