తెలంగాణలో గ్రేట్ ఆంధ్ర సర్వే రిపోర్ట్ గులాబీపై వ్యతిరేక పవనాలు
ఉనికిని చాటుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ కేసీఆర్‌కు ఆ పార్టీలే మైనస్, అవే ప్లస్
ప్రభుత్వ వ్యతిరేక ఓటులో భారీ చీలిక!
తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పట్టం గట్టి కూడా ఎనిమిదేళ్లు అవుతున్నాయి. ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉనికిని ప్రత్యేకంగా చాటడంలో కేసీఆర్ విజయవంతం అయినట్టే లెక్క. తొలి టర్మ్ పాలన తర్వాత వచ్చిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలం పెరిగింది. కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజానీకం వేసిన మెజారిటీ మార్కులవి. 2019లో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన తెలంగాణలో అంతకన్నా ముందే ముందస్తు రూపంలో ఆ ఎన్నికల తతంగం పూర్తయ్యింది. ఈ లెక్క ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ కు తెలంగాణలో రెండో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావాల్సి ఉంది.
ఈ సారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలైతే ఉన్నాయి. అయితే అలాంటి ఆలోచన లేనట్టుగా టీఆర్‌ఎస్ అధినేత ఇది వరకే చెప్పుకున్నారు. అయితే ఇలాంటి మాటలను ఎప్పటి అవసరానికి తగ్గట్టుగా అప్పుడు మార్చేసుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తెలంగాణలో మరోసారి ముందస్తుగానే ఎన్నికలు వచ్చినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవాలని కేసీఆర్ అనుకుంటే.. వచ్చే 2023 ఏడాది ఆఖరి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
ఎన్నికలకు అటుఇటుగా ఏడాది సమయం ఉందనుకుంటే.. ఈ సమయంలో తెలంగాణ ప్రజల రాజకీయ నాడిని పట్టడం ఆసక్తిదాయకమైన అంశం. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలన, తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్ పదే పదే ప్రజల ఆదరణను కోరుతూ ఉండటం, తెలంగాణలో తాము జెండా పాతుతామంటూ బీజేపీ వ్యక్తం చేస్తున్న ఆత్మవిశ్వాసం… ఈ పరిణామాల మధ్యన ఎన్నికలెప్పుడైనా తెలంగాణలో ఇప్పటికే రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది. ఈ రాజకీయ పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయాలెలా ఉన్నాయంటే!
తిరుగులేని కేసీఆర్!
ఎనిమిదేళ్ల పాలన ఫలితంగా కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రబలుతోంది. ఇలాంటి వ్యతిరేకత నుంచి మినహాయింపు పొందడం ఏ పాలకుడికీ సాధ్యం కాకపోవచ్చు. దీనికి కేసీఆర్ కూడా మినహాయింపు అయితే కాదు. ఎనిమిదేళ్ల పాలన ఫలితంగా వివిధ వర్గాల్లో కేసీఆర్ పై వ్యతిరేకత అయితే ఉంది. కానీ అది ఆయనను ఓడిరచి ఫామ్ హౌస్ కు పంపించేయాలనేంత స్థాయిలో లేకపోవడమే విశేషం.
కేసీఆర్ పై ఎంత వ్యతిరేకత ఉన్నా.. టీఆర్‌ఎస్ మూలాలే కదిలిపోయేంత స్థాయిలో అయితే పరిస్థితి లేదు. ఇది ముందుగా చెప్పాల్సిన పాయింట్! గ్రేట్ ఆంధ్రలో ప్రధానంగా తేలిన అంశం.
కాంగ్రెస్ పార్టీ కోలుకుంటోంది!
గ్రేట్ ఆంధ్ర సర్వేలో హైలెట్ అవుతున్న రెండో ప్రధానమైన అంశం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోకపోవడం. ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఈ ప్రతిపక్ష వాసంలో ఒక అడుగు ముందుకు వేస్తూ, నాలుగడుగులు వెనక్కు వేస్తోంది.
పీసీసీ ప్రెసిడెంట్ ఎవరనే అంశంతో నిమిత్తం లేకుండా, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, ముఖ్య నేత ఎవరు.. అనే విశ్లేషణలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, నేతల మధ్యన అనైక్యత కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లానే ఉన్నాయి! ఇందులో పెద్ద విశేషం లేదు కానీ, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కొంత వరకూ సానుకూలత ఉండటమే విశేషం. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పట్ల సానుకూలతగా మారుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో పొందే పరిస్థితి కనిపిస్తోంది.
ఒకే ఆయుధంతో బీజేపీ!
తెలంగాణలో జెండాపాతడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తాపత్రయపడుతున్న కమలం పార్టీ అధికారానికి సమీపంలో ఎక్కడా లేదు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంచలనాలే నమోదు చేసింది. అయితే తెలంగాణ మొత్తం అలాంటి సంచలనలేవీ నమోదు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
గతంతో పోలిస్తే బీజేపీ పరిస్థితి మెరుగయినప్పటికీ.. అధికారాన్ని అందుకునేంత సీన్ అయితే కమలం పార్టీకి లేదు. గ్రేట్ ఆంధ్ర సర్వేతో స్పష్టం అవుతున్న విషయం ఇది.
నంబర్ల వారీగా చూస్తే..
మొత్తం ఐదు కేంద్రాలుగా ఈ అధ్యయనం జరిగింది. వేల కొద్దీ పల్స్ ను విశ్లేషిస్తే.. తెలంగాణలో ముక్కోణపు పోరు ఉంది. హైదరాబాద్ లో ఎంఐఎం సీట్లను పక్కన పెడితే, కొన్ని జిల్లాల్లో ముక్కోణపు పోరు తీవ్రంగా ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా చూస్తే…
టీఆర్‌ఎస్‌కు 39% శాతం సానుకూలత వ్యక్తం అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి 31% శాతం ఓట్లు లభించే అవకాశాలున్నాయి. బీజేపీకి ఓటు వేస్తామంటున్న వారి శాతం 28%గా ఉంది. ‘గ్రేట్ ఆంధ్ర’ సర్వేలో 2% మంది ఏపార్టీ వైపు మొగ్గుచూపలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఓటేస్తారు? అనే ప్రశ్నపై సమాధానాలు పై శాతాల వారీగా వచ్చాయి. ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా 39 శాతం సానుకూలత రేటుతో టీఆర్‌ఎస్ ఈ ముక్కోణపు పోరులో ముందంజలో నిలిచింది. నాయకత్వ లోపాలతోనే వార్తల్లో నిలిచే కాంగ్రెస్ పార్టీ 31 శాతం ఓట్లను పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణలో అధికారం తమదేఅని అంటున్న బీజేపీ 28 శాతం ఓట్లను పొందే అవకాశాలున్నాయి గ్రేట్ ఆంధ్ర సర్వేను బట్టి.
ఈ సర్వే సారాంశాన్ని బట్టి టీఆర్‌ఎస్ పై పుష్కలమైన వ్యతిరేకత ఉంది. అటు ఇటుగా అరవై శాతం స్పందనలు టీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగానే వచ్చాయి. అయితే.. ఆ అరవై శాతం వ్యతిరేకతను కాంగ్రెస్, బీజేపీలు చెరో కొంత శాతం చీల్చుకుంటున్నాయి. ఇలా వ్యతిరేక ఓటు రెండు ప్రధానమైన చీలికలు కావడం టీఆర్‌ఎస్ కు వరప్రదంగా మారింది. బెస్ట్ ఆఫ్ త్రీ గా టీఆర్‌ఎస్ నిలుస్తూ, ఛాంపియన్ గా నిలిచే అవకాశాలున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో.
కాంగ్రెస్, బీజేపీల పొత్తు కలలో కూడా సాధ్యం అయ్యేపని కాదు కాబట్టి… టీఆర్‌ఎస్ కు ఇప్పుడు వచ్చిన ఇబ్బందే లేదు! కాంగ్రెస్ పార్టీ కోలుకున్నా, బీజేపీ ఉనికి చాటుకున్నా.. అధికారాన్ని అందుకునే విషయంలో టీఆర్‌ఎస్ ముందు నిలుస్తోంది.
గతంతో పోలిస్తే తగ్గనున్న బలం!
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్ బలం చాలా వరకూ తగ్గనుండటం మాత్రం స్పష్టం అవుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించింది ఓ మోస్తరు మెజారిటీ మాత్రమే. అయితే కేసీఆర్ తీసుకు వచ్చిన ముందస్తు ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్ హవా చూపింది. ప్రత్యర్థి కూటమిగా కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలపడం అప్పట్లో టీఆర్‌ఎస్‌కు పెద్ద అడ్వాంటేజ్ గా మారింది.
చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ సాగించిన పొలిటికల్ గేమ్‌లో కాంగ్రెస్ చిత్తయ్యింది. మోడీ ఇమేజ్ తప్ప మరే ఆయుధం లేని బీజేపీ క్రితం సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికిని చాటలేకపోయింది. లోక్ సభ ఎన్నికల వరకూ వచ్చేసరికి అదో డిఫరెంట్ బాల్ గేమ్ అయ్యింది. పదహారు అనుకున్న కారు పార్టీ ఊహించని పరభవాన్ని ఎదుర్కొంది లోక్ సభ ఎన్నికల బరిలో. కాంగ్రెస్, బీజేపీల తరఫున ఎమ్మెల్యేలుగా ఓడిన ముఖ్య నేతలు.. ఆ తర్వాత ఎంపీలుగా గెలిచి సత్తా చూపించారు. ఈ సారి కూడా లోక్ సభ ఎన్నికలతో సంబంధం లేకుండానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి తెలంగాణలో.
లోక్ సభ ఎన్నికలు వచ్చే వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం లేదు కాబట్టి… ఈ సారి కూడా కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీలుగానే పోటీ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ తెలివి తెచ్చుకుని ఈ సారి చంద్రబాబుతో చేతులు కలిపే అవకాశాలు లేవు. ఇలా మూడు పార్టీలూ ఇలా సోలోగా పోటీ పడితే.. టీఆర్‌ఎస్ మెజారిటీని సంపాదించుకోవచ్చు. అయితే అది భారీ మెజారీటీ అయితే కాదు.
కనీస మెజారిటీ అయితే కచ్చితంగా కారు పార్టీకి దక్కే అవకాశం ఉంది. అది కూడా కాస్త తగ్గినా..ఎంఐఎం సంపాదించు కునే స్టాండర్ట్ సీట్లు టీఆర్‌ఎస్ కు అండగా నిలుస్తాయ నడంలో సందేహం లేదు. కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పుడున్న వ్యతిరేకత మరి కాస్త పెరిగితే.. అప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎంఐఎం భాగస్వామి కావొచ్చు.
కాంగ్రెస్ కు 40 సీట్ల వరకూ!
గత ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీతో చేతులు కలపకపోయి ఉంటే ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ కు మెరుగైన స్థాయిలోనే అసెంబ్లీ సభ్యులుఉండేవారు. ఆ గతం నుంచి పాఠాలు నేర్చుకుని అంతర్గతవిబేధాలను, వీధి రచ్చలను తగ్గించుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాను సంపాదించుకోవడం కష్టం ఏమీ కాదు.
నియోజకవర్గాల వారీగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీ కనీసం నలభై అసెంబ్లీ స్థానాలను నెగ్గే అవకాశాలున్నాయి గ్రేట్ ఆంధ్ర సర్వేను బట్టి. నల్లగొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి .. పాత జిల్లాల పరిధిలో కాంగ్రెస్ కు ఎక్కువ సానుకూలత వ్యక్తం అయ్యింది.
పార్టీ నిర్మాణంలో వెనుకబడ్డ బీజేపీ!
తెలంగాణలోని మతపరంగా సెన్సిటివ్ ఏరియాస్ ల బీజేపీ హవా స్పష్టంగా ఉంది. మతంతో ముడిపడిన జాతీయ వాదం తప్ప భారతీయ జనతా పార్టీ వద్ద తెలంగాణలో పెద్ద ఆయుధాలు లేవు. పేరుకు బీజేపీ వాళ్లు పాదయాత్రలు, రకరకాల యాత్రలు చేస్తున్నా.. పార్టీ నిర్మాణం విషయంలో బీజేపీ మెరుగు పడటం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత తరహా నిర్మాణం కూడా తెలంగాణలో బీజేపీకి లేదని గ్రేట్ ఆంధ్ర సర్వే ద్వారా స్పష్టం అవుతోంది.
మోడీ ఇమేజ్,మతపరమైన అంశాల ద్వారా ఓట్లు పొందవచ్చు. ఆ ఓట్లు ఆ పార్టీని గెలుపు తీరాలకు చేర్చే నియోజకవర్గాలు మాత్రం పరిమితంగానే కనిపిస్తున్నాయి. బీజేపీ రెండంకెల సంఖ్యలో ఎమ్మెల్యేలను పొందినా అది ఘన విజయమే అని గ్రేట్ ఆంధ్ర సర్వేలో స్పష్టం అవుతోంది.
సిట్టింగులపై వ్యతిరేకత!
టీఆర్‌ఎస్ వరసగా మూడోసారి తెలంగాణలో అధికారాన్ని సంపాదించుకుంటుందని చెప్పేందుకు క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న ప్రధానమైన కారణం టీఆర్‌ఎస్ ఇమేజ్. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటంలో టీఆర్‌ఎస్ సంపాదించుకున్న ఇమేజ్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పోలేదు.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన ఆయుధం ‘తెలంగాణ’ ఫీలింగ్. ఇది టీఆర్‌ఎస్‌కు ఎవరిగ్రీన్‌గా మారింది. అయితే ఈ ఇమేజ్ ప్లస్ అయితే, ఆ పార్టీకి మైనస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లా ఉన్నారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. టీఆర్‌ఎస్ కేసీఆర్ పై ఉన్నంత సానుకూలత ఎమ్మెల్యేలపై లేదు. సిట్టింగులను చాలా చోట్ల మార్చాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.
కేసీఆరే ముఖ్యమంత్రి!
టీఆర్‌ఎస్ తరఫున కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ను మాత్రమే చూస్తోంది తెలంగాణ ప్రజానీకం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ స్థానంలో మరొకరి పేరు పట్ల కూడా ఈ సర్వేలో పెద్ద సానుకూలత వ్యక్తం కాలేదు. టీఆర్‌ఎస్ అనే మాటకు కేసీఆర్ అనే పేరును ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు ఆ పార్టీ పట్ల సానుకూలత ఉన్న వారు కూడా.
ఒకవేళ ఎన్నికలకు ముందే మరో పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీఆర్‌ఎస్ ప్రకటించినా.. పరిస్థితిలో చాలా మార్పు రావొచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కేసీఆర్ నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూస్తున్నారు ఆ పార్టీ పట్ల సానుకూలత వ్యక్తం చేసిన వారు కూడా.
కాంగ్రెస్ కష్టపడితే ప్రయోజనం!
టీఆర్‌ఎస్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్న కొన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు తిరిగి మొగ్గు చూపుతూ అయితే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ సవరించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. తెలంగాణలోని ఒకప్పటి తన కంచుకోటలన్నింటినీ కాంగ్రెస్ వచ్చే సారి తిరిగి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా అగుపిస్తున్నాయి.
-వెంకట్ ఆరికట్ల