మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, ఓట్ల లెక్కలు, కుల, మత సమీకరణాలే. పంచాయతీ ఎన్నికల నుంచి అత్యున్నతమైన రాష్రపతి ఎన్నికల వరకు ఇదే ధోరణి. ఏ వర్గం వారికి పదవులిచ్చి అందలం ఎక్కిస్తే సాధారణ ఎన్నికల్లో ఓట్లు పడతాయో ఆలోచిస్తారు. ఒక కులం వారికో, మతం వారికో అత్యున్నత పదవి ఇస్తే ఎన్నికల్లో వారి ఓట్లు గంప గుత్తగా పడతాయని ఆశిస్తారు. సామర్ధ్యం, సత్తా ఇవేమీ పట్టించుకోరు. ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నదంటే త్వరలో జరగబోతున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సీన్ ఇలాగే ఉంటుందని తెలుస్తోంది.
ఆ రెండు పదవులకు ఎన్డీయే నిలబెట్టే అభ్యర్థులే గెలిచే అవకాశాలే ఉంటాయి కాబట్టి ఎన్డీయే ను లీడ్ చేస్తున్న బీజేపీ రెండేళ్లలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలను సాధనాలుగా వాడుకుంటోందని సమాచారం. భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో దేశంలో రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీయేతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈనెల 15న ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 22 మంది వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు దీదీ.
అయితే రాష్ట్రపతి ఎన్నికల ఓట్లలో మెజార్టీ అధికార ఎన్డీఏకే ఉంది. కావాల్సిన మెజార్టీకి కేవలం 1.2 శాతం ఓట్ల దూరంలో ఉంది. వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే వంటి పార్టీలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలవడం ఖాయమేనని తెలుస్తోంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికి సంబంధించి ఎన్డీఏ నుంచి పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేస్తారనే చర్చ సాగుతోంది. వెంకయ్యతో పాటు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్, కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్, జార్కండ్ మాజీ గవర్నర్ ,గిరిజన నేత ద్రౌపది ముర్ము వంటి పేర్లపై కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థులను బీజేపీ దాదాపుగా ఫైనల్ చేసిందని తెలుస్తోంది. గిరిజన నేతకు రాష్ట్రపతిగా, మైనార్టీ వ్యక్తిని ఉప రాష్ట్రపతిగా నియమించాలని నిర్ణయించిందని సమాచారం. ఎందుకంటే ….దేశంలో దాదాపు 9 శాతం మంది గిరిజనులు ఉన్నారు. గిరిజనుల ఆకర్షించడమే లక్ష్యంగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరును బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేసిందని చెబుతున్నారు. గిరిజనులు బీజేపీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయంతో కేంద్రం పెద్దలు ఉన్నారు. వాళ్లను కమలానికి దగ్గర చేసేందుకు ముర్ము ఎంపిక ఉపయోగపడుతుందని లెక్కలు వేస్తున్నారు. గిరిజన నేత కాకుంటే ఓబీసీ వ్యక్తికి అవకాశం ఉంటుందంటున్నారు.
కాని దాదాపుగా ద్రౌపది ముర్ము పేరు ఖాయమైందనే సమాచారమే బీజేపీ వర్గాల నుంచి వస్తోంది. ఇక ఉప రాష్ట్రపతిగా అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేరును దాదాపుగా ఫైనల్ చేశారని తెలుస్తోంది. రాజ్యసభలో బీజేపీ పక్ష ఉపనేతగా ఉన్న నక్వీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెన్యూవల్ ఇవ్వలేదు. నక్వీని ఉప రాష్ట్రపతిగా నియమించాలని నిర్ణయించినందు వల్లే ఆయనను మరోసారి పెద్దల సభకు పంపలేదని తెలుస్తోంది.
నక్వీ కాకుంటే కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టనుందని తెలుస్తోంది. మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముస్లిం దేశాల నుంచి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ముస్లిం అభ్యర్థిని ఉప రాష్ట్రపతి చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఒకవేళ వీళ్లనే కనుక అత్యున్నత పదవులకు ఎంపిక చేస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ ఆలోచన.