తుడా చైర్మ‌న్‌గా లాయ‌లిస్ట్‌లా? లాబీయిస్ట్‌లా?

తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మ‌న్ ప‌ద‌వి కోసం తీవ్ర పోటీ వుంది. కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌నే ధీమాతో, ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఈ ప‌ద‌విపై చాలా మంది ఆశ‌లు పెంచుకుంటూ వ‌స్తున్నారు.…

తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మ‌న్ ప‌ద‌వి కోసం తీవ్ర పోటీ వుంది. కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌నే ధీమాతో, ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఈ ప‌ద‌విపై చాలా మంది ఆశ‌లు పెంచుకుంటూ వ‌స్తున్నారు. తుడా చైర్మ‌న్ ప‌ద‌వి త‌న‌కంటే త‌న‌క‌ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్నారు.

తుడా చైర్మ‌న్ ప‌ద‌విని ఆశిస్తున్న వారిలో న‌ర‌సింహ‌యాద‌వ్‌, సూరా సుధాక‌ర్‌రెడ్డి పార్టీకి వీర‌విధేయులు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకే అంకిత భావంతో ప‌ని చేస్తున్నారు. మ‌బ్బు దేవ‌నారాయ‌ణ‌రెడ్డి కూడా ఆ ప‌దవిని ఆశిస్తున్నారు. టీడీపీలో చేరిన మొద‌లు, ఆ పార్టీ అభ్య‌ర్థి లేదా మ‌ద్ద‌తుదారుల‌కు ఆయ‌న అండ‌గా నిలుస్తూ వ‌చ్చారు. పార్టీ కోసం మ‌బ్బు శ్ర‌మించార‌నే గుర్తింపు చంద్ర‌బాబు వ‌ద్ద వుంది. టీడీపీకి లాయలిస్ట్‌ల‌నే పేరు వీరికి వుంది. అలాగే చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన డాల‌ర్స్ దివాక‌ర్‌రెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు.

చంద్ర‌గిరిలో టీడీపీ గెలుపు కోసం ఆయ‌న ప‌ని చేశారు. తుడా చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీని లోకేశ్ నుంచి పొందిన‌ట్టు చెప్పుకుంటున్నారు. బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన ర‌వినాయుడు కూడా ఈ ప‌ద‌విపై ఆశ పెట్టుకున్నారు. జ‌న‌సేన నుంచి కిర‌ణ్‌రాయ‌ల్‌, ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ కూడా తుడా చైర్మ‌న్ ప‌ద‌వి కావాలంటున్నారు. అయితే తిరుప‌తి ఎమ్మెల్యేగా జ‌న‌సేనకు ఇవ్వ‌డం, మ‌రీ ముఖ్యంగా బ‌లిజ సామాజిక వ‌ర్గం కావ‌డంతో, వారికే తుడా చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌ర‌ని బ‌లంగా చెబుతున్నారు.

మ‌రోవైపు వైసీపీ అధికారంలో ఉన్నంత వ‌ర‌కూ ఆ పార్టీ ముఖ్య నేత‌ల‌తో అంట‌కాగి, ఇప్పుడు కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా వారే ల‌బ్ధి పొంద‌డానికి చూస్తున్నారంటూ, ఆధారాల‌తో స‌హా టీడీపీ అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతూ, సొంత సంపాద‌న కోసం ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు చేస్తున్న లాబీయిస్ట్‌ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తుడా చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు విన్న‌విస్తున్నార‌ని తెలిసింది. మ‌రి తుడా చైర్మ‌న్ ప‌ద‌వి లాయ‌లిస్ట్‌ల‌కా? లాబీయిస్ట్‌ల‌కు ద‌క్కుతుందా? అనేది ప్ర‌శ్న‌గా మిగిలింది.