పేరూరు బండపై వకుళమాత ఆలయ పునర్నిర్మాణానికి నోచుకుంది. ఈ ఆలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నారు. ఇంత వరకూ బాగానే వుంది. కానీ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి తల్లి వకుళమాత ఆలయ ప్రారంభ వేడుకకు ఆహ్వానించకపోవడంపై చుట్టు పక్కల గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. లోకానికంతటికీ తల్లి అయినా, తమ ఊళ్లో నెలకొల్పిన ఆలయ ప్రారంభ వేడుకకు ఆహ్వానించకపోవడంపై గ్రామీణులు మండిపడుతున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో వకుళమాత ఆలయం పునర్నిర్మాణానికి నోచుకుంది. తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వుంటుంది. పాతకాల్వ అనే గ్రామంలో ప్రధానంగా ఏకశిల ఈ పేరూరు బండ. పేరూరు, పాతకాల్వ, మల్లవరం గ్రామాలు ఆలయం చుట్టూ వుంటాయి. ఏకశిలపై ఆలయాన్ని నెలకొల్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏ ఉత్సవమైనా స్థానికులు పాల్గొంటేనే విజయవంతమవుతుంది.
అయితే పాతకాల్వ, పేరూరు, మల్లవరం గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా వైసీపీ నేతలే కావడం విశేషం. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నప్పటికీ, తమకు పిలుపు లేకపోవడాన్ని ఆ మూడు గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు అవమానంగా భావిస్తున్నారు. ఆలయాలు, జాతర్లు తదితర వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొనడం సంప్రదాయంగా వస్తోంది.
కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతుండడం వల్లే చర్చకు దారి తీసింది. తిరుచానూరులోని అలివేలు మంగాపురం తరహాలో దివ్యక్షేత్రంగా వకుళమాత ఆలయాన్ని తీర్చిదిద్దే బాధ్యతల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వం, టీటీడీ అప్పగించాయి. సొంత నిధులతో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసే బాధ్యతల్ని పెద్దిరెడ్డి విజయవంతంగా నిర్వర్తించారు.
ఇక స్థానికుల్ని ఈ వేడుకలో ఇన్వాల్వ్ చేసే బాధ్యతల్ని టీటీడీ చేపట్టాలి. ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ ఊరికి వస్తున్నారని గ్రామీణులు ఆనందపడుతున్నా, అక్కడికి తమను ఆహ్వానించలేదనే బాధను బహిరంగంగా వ్యక్తపరుస్తుండడం గమనార్హం.
సుమారు 10 వేల ఓట్లను ప్రభావితం చేసే ఈ గ్రామాల అసంతృప్తిని అధికార పార్టీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలయ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అతిపెద్ద వేడుకలో స్థానికులను, అలాగే సొంత పార్టీ ప్రజాప్రతినిధులను భాగస్వామ్యుల్ని చేయాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.