Advertisement

Advertisement


Home > Politics - Opinion

వెంకయ్యనాయుడు పేరుతో ఎందుకంత ఓవరాక్షన్?

వెంకయ్యనాయుడు పేరుతో ఎందుకంత ఓవరాక్షన్?

మంచి వాగ్ధాటి, రాజకీయపటిమ, జనాకర్షణ ఉన్న నాయకుడు వెంకయ్యనాయుడు. పార్లమెంటరీ ఎఫైర్స్ మంత్రిగా సముచిత స్థానమిచ్చి తొలుత భాజపా ప్రభుత్వం గౌరవించింది. కానీ క్రమంగా ఆయనని సైడ్ ట్రాక్ పట్టించి ఉపరాష్ట్రపతిని చేయడం బీజేపీ మార్క్ రాజకీయం. ఆ సైడ్ ట్రాక్ కి ప్రధానకారణం ఒకటే...ఆయనకి, చంద్రబాబుకి స్నేహబంధం గట్టిదవడం.  

ఎవరు ఎవరికైనా స్నేహుతులవ్వొచ్చు. కానీ శత్రువుకి మిత్రుడైనవాడిని కాస్త దూరంగానే చూడడం సహజం. ప్రస్తుత బీజేపీ నాయకత్వంలో ఇది మరీ ఎక్కువ. 

నిజానికి వెంకయ్యనాయుడికి చంద్రబాబుతో సత్సంబంధాలు లేకపోయుంటే అమిత్ షా, రాజ్ నాథ్ సింఘ్ లకి సమాంతరంగా కొనసాగుండేవి ఆయంకి గత ఐదేళ్లు. అలాగే ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ప్రవేశపెట్టడం జరిగుండేదేమో. 

ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే...బీజేపీ కి మూలస్థంభమైన లాల్ కృష్ణ అద్వానీని సైడ్ ట్రాక్ కాదు కదా అసలు ట్రాకు మీదే లేకుండా చేసారు ప్రస్తుత దేశాధినేతలు. చాలామందికి కనీసం ఆయనని రాష్ట్రపతిగా అయినా చూడాలని గత కొన్నేళ్లుగా కోరికుంది. కానీ అస్సలు జరగనివ్వలేదు. లెజిస్లేచర్లో గానీ, ఎక్జిక్యూటివ్ లో కానీ అద్వానీకి స్థానం కల్పించలేదు. ఆయన పుట్టిన రోజులకి ప్రస్తుత ప్రధాని వ్యక్తిగతంగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపి దండం పెట్టైతే వస్తారు. అంతే తప్ప రాజ్యాధికారంలో స్థానం మాత్రం ఇవ్వజూపలేదు. దీనికి అసలు కారణం వారికే తెలియాలి. 

ఇక ప్రస్తుతానికొస్తే వెంకయ్యనాయుడుకి ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి ప్రమోషనొచ్చేస్తోందని తెదేపా అనుకూల మీడియా తెగ ప్రచారం చేసేసింది. కీలక నేతలు ఆయనను వ్యక్తిగతంగా కలిసారని, బహుశా ఆయన పేరే ఎన్.డి.ఏ అభ్యర్థిగా ప్రకటించవచ్చని ప్రచారం జరిగింది. 

కానీ బీజేపీ ఆ పని చేయదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకే దేశాధ్యక్ష పదవి అనే లెక్కలో వెళ్తోంది. దానివల్ల దేశంలో ఉన్న అథ్యధిక వర్గాలని గౌరవించినట్టవుతుంది. రాజకీయంగా చూసుకున్నా, నైతికంగా చూసుకున్నా ఇది స్వాగతించదగిన అంశమే. 

అప్పట్లో వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి ప్రకటించినప్పుడు తెదేపా అనుకూల మీడియా నానా రభస చేసింది. అంత పెద్ద సమర్ధుడైన నాయకుడిని బీజేపీ ప్రభుత్వం సైడ్ ట్రాక్ పట్టిస్తోందని వాపోయింది. కానీ ఇప్పుడు అదే మీడియా ఆయనను దేశాధ్యక్ష పదవి వరించబోతోందంటూ వార్తలు వడ్డించింది. దేని కోసమిదంతా? జరగని పని అని తెలిసే ఈ ప్రచారాలు జరుగుతాయా? జరిగితే బాగుండునని రాస్తుంటాయా? రాస్తే జరుగుతాయని నమ్ముతాయా? 

ప్రధాని ఏకాంతంగా ముఖ్యమంత్రితో చర్చించే విషయాలు కూడా గోడకున్న చెవుల ద్వారా తమకు విపిస్తాయని తోచింది రాసేసే ఈ పచ్చ పత్రికలు మరి అలా వినపడే వెంకయ్యనాయుడు కాబోయే రాష్ట్రపతి అని రాసేసాయా? మరి జరగలేదేం? అంటే అసలేమీ వినపడకుండానే రాసిందా? లేక వినిపించినివాడు ఉత్తినే వినిపించాడా? 

ఇదిలా ఉంటే ప్రస్తుత ఉచ్ఛన్యాయమూర్తి పదవీ కాలం పొడిగిస్తున్నారంటూ మరొక వార్త చలామణీలో ఉంది. ఇది కూడా పచ్చమీడియా ప్రచారమే. అదెలా జరుగుతుందో..ఎందుకు జరగాలో చెప్పరు. 

ఈ గోలంతా దేనికంటే కేంద్రంలో తెదేపా నాయకత్వానికి దన్నుగా నిలిచే పవర్ సెంటర్స్ ఈ ఆగస్టు నాటికి ఇక ఉండవు. అందుకే కనీసం న్యాయమూర్తైనా మరొక రెండేళ్లు పదవిలో కొనసాగితే కాస్త ధైర్యంగా ఉంటుంది తెదేపాకి. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నడిపే పార్టీ నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు కూడా చంద్రబాబుకి బద్ధ శత్రువులే. ఏం జరిగినా గోడు వెళ్లగక్కడానికి ఎవ్వరూ లేరు తెదేపాకి. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?