వల్లభనేని వంశీని టీడీపీ బద్ధ శత్రువుగా భావిస్తుంది. అలాంటి బద్ధ శత్రువుతో పదేపదే చెట్టపట్టాలేసుకుని తిరిగే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై వేటు వేసే దమ్ము టీడీపీలో కరువైంది.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అవాకులు చెవాకులు, అలాగే ఇటీవల లోకేశ్ జూమ్ కాన్ఫరెన్స్‌లోకి చొరబడ్డాడని వంశీపై టీడీపీ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇలా అనేక సందర్భాల్లో చంద్రబాబు, లోకేశ్‌లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీతో ఇవాళ టీడీపీ నేత వంగవీటి రాధా అంటకాగడం చర్చనీయాంశమైంది.
గన్నవరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో ఇద్దరు నేతలు కాసేపు ఏకాంతంగా భేటీ కావడం రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. వంగవీటి రాధాను స్వయంగా కారులో ఎక్కించుకుని వంశీ తీసుకెళ్లారు. టీడీపీ తరపున గెలుపొందిన వంశీ, ఆ తర్వాత జగన్‌కు మద్దతుగా నిలిచారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం వున్నప్పటికీ, ఇప్పటి నుంచే నేతలు తమ రాజకీయ భవిష్యత్‌ను చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో జగన్‌కు సన్నిహితుడైన వంశీతో రాధా భేటీ కావడతో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంటుందా? అనే చర్చకు దారి తీసింది. ఎన్నికలకు ముందు వంగవీటి రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పుడప్పుడు తప్ప, రాజకీయంగా వంగవీటి రాధా యాక్టీవ్‌గా కనిపించడం లేదు.
కొన్ని నెలల క్రితం తన హత్యకు కుట్రపన్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఫలానా అని ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రతా ఏర్పాట్లు చేయగా, ఆయన తిరస్కరించారు.
కీలక సమయంలో పార్టీ మారి రాజకీయంగా తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా మరోసారి జగన్ పంచన చేరుతారా? లేక టీడీపీలో కొనసాగుతారా? తన సామాజిక వర్గానికి చెందిన జనసేనలో చేరుతారా? అనేది తెలియాల్సి వుంది. కానీ వంశీతో రాధా భేటీ కావడంపై టీడీపీ వర్గాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వ్యక్తిగతంగా వాళ్లిద్దరి మధ్య స్నేహం ఉన్నప్పటికీ, రాజకీయంగా తీవ్ర నష్టం కలిగిస్తున్న వంశీతో రాధా అంటకాగడం వల్ల నెగెటివ్ సంకేతాలు వెళ్తాయని టీడీపీ నేతలు వాపోతున్నారు. రాధాపై క్రమశిక్షణా చర్యలు తీసుకోడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.