హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి, డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. టీడీపీతో పాటు ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేరును అకస్మాత్తుగా తొలగించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ సమాధానం ఏంటో అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు.
ఇదిలా వుండగా ఎన్టీఆర్ పేరు తొలగింపుపై వైసీపీ అనుకూల టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ట్విటర్ వేదికగా స్పందించారు. నేరుగా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు ఆయన ప్రకటించారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్‌ను అభినందిస్తూనే, హెల్త్ వర్సిటీకి తొలగింపుపై సున్నితంగా వ్యతిరేకత కనబరిచారు. మరోసారి పునరాలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన వేర్వేరుగా చేసిన రెండు ట్వీట్లను పరిశీలిద్దాం.
“గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహనరెడ్డి గారు..మీరు ఎంతో పెద్ద మనసుతో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారకరామారావు గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వని గుర్తింపునిచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు”
“నిజంగా అది ఎంతో చారిత్రాత్మకం..విప్లవాత్మకం..అదే జిల్లాలో ఎన్టీఆర్ గారి చొరవతోనే ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహనీయుడి పేరే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని మనఃపూర్వక విజ్ఞప్తి” అంటూ వల్లభనేని వంశీ జగన్‌కు అప్పీల్ చేయడాన్ని చూడొచ్చు. ఎన్టీఆర్ పేరు తొలగింపుపై వైసీపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఎందుకీ నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలొస్తున్నాయి. ఇందుకు వల్లభనేని వంశీ ట్వీట్లే నిదర్శనం. ఇలా బయటికి చెప్పని వారి అభిప్రాయాల సంగతేంటి?