సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ ట్రయిన్ సూపర్ సక్సెస్ అయింది. ప్రారంభమైన కొత్తలో తొలి 3 రోజులు అనుమానాలు రేకెత్తించిన ఈ సర్వీసు, ఆ తర్వాత సూపర్ హిట్టయింది. వంద శాతం కాదు, ఏకంగా 140శాతం ఆక్యుపెన్సీతో తిరుగులేదనిపించుకుంది. అయితే ఈ సర్వీసు మరింత సక్సెస్ అవ్వాలంటే, కచ్చితంగా టైమింగ్స్ మార్చాల్సిందే.
విశాఖ నుంచి సమస్యలివి..!
విశాఖలో వందే భారత్ ట్రయిన్ ఉదయం 5 గంటల 45 నిమిషాలకు బయల్దేరుతుంది. ఈ టైమ్ ను అందుకోవడం విశాఖ నగరవాసులకు కూడా కష్టమే. ఉదాహరణకు గాజువాకలో ఉన్న ఓ వ్యక్తి, ఆ సమయానికి స్టేషన్ కు రావాలంటే చాలా కష్టపడాలి. అటు మధురవాడ, ఎంవీపీ, ఇసుకతోట ప్రాంతవాసులకు కూడా ఈ టైమింగ్ కరెక్ట్ కాదు.
ఇక ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం వాసులు వందేభారత్ ట్రయిన్ ను మరిచిపోవాల్సిందే. ఆ టైమ్ కు ట్రయిన్ ను అందుకోవాలంటే.. విజయనగరం వాస్తవ్యులు ఉదయం 3.30 గంటలకే నిద్రలేవాల్సి ఉంటుంది. ఇది నరకం.
ఇక శ్రీకాకుళం జిల్లా వాసులైతే ముందురోజు రాత్రి విశాఖ వచ్చి బస చేయాల్సి ఉంటుంది. ఇలా విశాఖలో రాత్రి బసచేసి, ఉదయం వందభారత్ అందుకునే బదులు.. అదే రాత్రి బస్సు ఎక్కి పొద్దున్నకే హైదరాబాద్ లో దిగడం బెటర్. సో.. విశాఖ నుంచి బయల్దేరే వందేభారత్ టైమింగ్ ను మార్చాల్సిన అవసరం ఉంది.
సికింద్రాబాద్ నుంచి కూడా సేమ్ సమస్యలు
ఇక సికింద్రాబాద్ నుంచి కూడా దాదాపు ఇలాంటి సమస్యలే ఉన్నాయి. సికింద్రాబాద్ లో ఈ ట్రయిన్ మధ్యాహ్నం 3గంటలకు బయల్దేరుతుంది. ఎంచక్కా భోంచేసి ట్రయిన్ ఎక్కొచ్చని చాలామంది అనుకోవచ్చు. కానీ దిగినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. విశాఖలో వందేభారత్ అర్థరాత్రి 11 గంటల 30 నిమిషాలకు చేరుకుంటోంది. స్టేషన్ లో దిగి బయటకొచ్చేసరికి మరో 15 నిమిషాలు పడుతుంది.
ఆ టైమ్ లో గాజువాక లాంటి ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది. ఆటోలు, టాక్సీలు ఛార్జీల మోత మోగించేస్తున్నాయి. సిటీ బస్సులు లిమిటెడ్ గా తిరుగుతున్నాయి. వందేభారత్ ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా సిటీ సర్వీసులు నడిపే ఆలోచన చేస్తే మంచిది. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులకు ఈ వైపు నుంచి కూడా ట్రయిన్ అక్కరకురావడం లేదు. అర్థరాత్రి 12 గంటలకు వైజాగ్ లో దిగి, మరో రైలు లేదా బస్సు కోసం ఉదయం 5 గంటల వరకు వేచి చూడాల్సిందే.
సో.. వందేభారత్ ట్రయిన్ సక్సెస్ అయినట్టు రైల్వేశాఖ ఘనంగా ప్రకటించుకున్నప్పటికీ, ఇది మరింత సక్సెస్ అవ్వాలంటే రెండు వైపుల నుంచి టైమింగ్స్ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఫ్లయిట్ చార్జీలకు దగ్గరగా ఈ ట్రయిన్ లో ధరలున్నాయనే విమర్శలున్నాయి. ఆ విమర్శల్ని తట్టుకోవాలంటే, రాకపోకల సమయాలు మార్చి, మరింత మంది ప్రయాణికుల్ని ఆకర్షించడం ఒక్కటే మార్గం.