వైసీపీ నంబర్-2 నేతగా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నందమూరి నివాసంలో కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజకీయంగా వాళ్లిద్దరు ప్రత్యర్థులనే హద్దులు దాటి, శత్రువులుగా మసులుకుంటున్న సంగతి తెలిసిందే. ట్విటర్ వేదికగా చంద్రబాబు, లోకేశ్‌లపై విజయసాయిరెడ్డి తీవ్ర అభ్యంతరకర కామెంట్స్‌ను ఎన్నో చేశారు. ఇందుకు కౌంటర్‌గా బాబు, లోకేశ్‌లు కూడా అదే రేంజ్లో సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ ధృవాలైన ఇద్దరు నేతలు కూచుని మాట్లాడుకోవడం సహజంగానే ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
గుండెపోటుకు గురై మృతి చెందిన నందమూరి తారకరత్న ఇటు విజయసాయి, అటు చంద్రబాబుకు వరుసకు అల్లుడు అవుతారు. నందమూరి ఇంట విషాదం చోటు చేసుకోవడంతో, ఆ బాధలో బంధువులైన ఇద్దరు నేతలు భాగం పంచుకున్నారు. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి ఇద్దరూ అర్ధగంట పాటు ఏవో మాట్లాడుకోవడం, అలాగే కలిసి మీడియాతో మాట్లాడ్డం అందరి దృష్టిని ఆకర్షించింది.
వీళ్లద్దరి కలయికపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సంచలన ట్వీట్ చేశారు. అదేంటంటే…
“నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా. అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!”
ప్రత్యేకంగా చంద్రబాబు, విజయసాయిరెడ్డి పేర్లను బండ్ల ప్రస్తావించలేదు. దీంతో ఈ ట్వీట్ ఇద్దరిని ఉద్దేశించి చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుండగా బండ్ల ట్వీట్‌పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. “రాజకీయాల్లో శత్రువులు ఏంది సార్. ఒకవేళ నిజంగా శత్రువులే అయినా.. వాళ్ళు కలిస్తే సంతోషించాలే కానీ… కలవనే కలవకూడదు అనడం ఏంటి?” అని ఒక జర్నలిస్టు మిత్రుడు ప్రశ్నించారు.