ఆంధ్రావర్సిటీ వీసీ, వైసీపీ ప్రచారం చేస్తున్నాడని ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది. ఆ పని ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే యూనివర్సిటీ అంటే అత్యున్నత విద్యాసంస్థ. వైస్ చాన్సలర్ దానికి అధిపతి. విద్యార్థుల్ని సరైన దారిలో పెట్టాల్సిన ఆయనే పెడదారి పెడితే ఎట్లా? అయితే రాజకీయాలతో యూనివర్సిటీలను భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుదే.
ఆయన చదువుతున్న ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఈ దరిద్రం మొదలైంది. అక్కడ చంద్రబాబు సహచరులైన కొందరు ప్రొఫెసర్లు పాఠాలు చెప్పడం మాని, విద్యార్థుల్ని తెలుగుదేశం బ్యాచ్‌గా తయారు చేసి, వాళ్లతో ఎన్నికల సర్వేలు చేయించేవారు. ఇది 1989 నుంచి ప్రారంభమైంది. ఆ ప్రొఫెసర్ల పేర్లు తిరుపతిలో అందరికీ తెలుసు.
యూనివర్సిటీ నుంచి జీతాలు తీసుకుంటూ తెలుగుదేశానికి పనిచేసేవాళ్లు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తీవ్రమైంది. ఖర్చులన్నీ భరించి, సర్వే చేసిన విద్యార్థులకి 10 వేల వరకు ఇచ్చేవాళ్లు. 1996లో ఇది చాలా పెద్ద మొత్తం. 294 నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగేది. ఈ నివేదికలు ఆధారంగా టికెట్ల పంపిణీ జరిగేది.
వీసీల నియామకాలు కూడా అర్హత ఆధారంగా కాకుండా, రాజకీయ పక్షపాతంతో మొదలైంది కూడా బాబు హయాంలోనే. అంతకు ముందు కులం, ప్రాంతం పనిచేయలేదని కాదు. అయితే వాటితో పాటు బోధన అనుభవం, ఆయా సబ్జెక్టుల్లో వాళ్లు చేసిన కృషిని పరిగణలోకి తీసుకుని విద్యావేత్తలనే ఎంచుకునే వాళ్లు.
చంద్రబాబు రాకతో విద్యార్హతలు పక్కకి పోయి, కేవలం కులం ప్రాంతం వచ్చాయి. రాజకీయ పక్షపాతంతో యూనివర్సిటీ నియామకాలు జరిగి భ్రష్టు పడుతూ వుంటే ఒక్కరోజు కూడా ప్రశ్నించని మీడియా, ఈ రోజు వైసీపీ హయాంలో ఘోరాలు జరిగిపోతున్నట్టు గగ్గోలు పెట్టడమే వింత. కొసమెరుపు ఏమంటే తెలుగుదేశం సర్వేల్లో పాల్గొన్న వాళ్లలో అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చాయి.