తానేటి వనిత.. జగన్ పరువు తీసేస్తుందా?

ఏ ప్రభుత్వం అయినా సరే.. ఎంతో కీలకంగా పరిగణించే హోంశాఖను ఒక మహిళకు అప్పగించడం ద్వారా.. శాంతి భద్రతల పరంగా మహిళలకు ఒక ధైర్యాన్ని కలిగించడం అనే ఒక అతి గొప్ప సాంప్రదాయానికి శ్రీకారం…

ఏ ప్రభుత్వం అయినా సరే.. ఎంతో కీలకంగా పరిగణించే హోంశాఖను ఒక మహిళకు అప్పగించడం ద్వారా.. శాంతి భద్రతల పరంగా మహిళలకు ఒక ధైర్యాన్ని కలిగించడం అనే ఒక అతి గొప్ప సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అప్పట్లో అందరూ ఆ నిర్ణయాన్ని సాహసంగా అభివర్ణించారు. ఆ సాహసాన్ని ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగించారు. 

తన ప్రభుత్వంలో రెండు దఫాలుగా కేబినెట్ పదవులు కేటాయించే క్రమంలోనూ ఇదే సాంప్రదాయంలాగా పాటించారు. అయితే జగన్ ఇటీవలే పునర్ వ్యవస్థీకరించిన కేబినెట్ లో హోంమంత్రిగా కీలకమైన బాధ్యతలు తీసుకున్న తానేటి వనిత ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? ‘జగన్ నిర్ణయం తప్పు’ అని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. 

తానేటి వనిత వ్యవహార సరళిలో హోం శాఖ నిర్వహణలో సక్రమంగా పనిచేయడం ఒక ఎత్తు.. అర్థం పర్థంలేని మాటలతో ప్రభుత్వం పరువు పోయేలా వ్యవహరించడం మరో ఎత్తు! తాజాగా రేపల్లె అత్యాచార ఘటన గురించి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అత్యాచారానికి పాల్పడిన వారు దుర్మార్గులు కాదు గానీ.. ఏదో తాగిన మత్తులో అలా చేసేశారు పాపం..’ అని వనిత సానుభూతి చూపిస్తున్నట్లుగా ఆమె మాటల అర్థం కనిపిస్తోంది. 

గుంటూరులో మంత్రి మాట్లాడుతూ.. ‘‘రేపల్లి అత్యాచారానికి పాల్పడిన వారు అసలు అత్యాచారం చేయడానికి రాలేదని.. పైగా వాళ్లు తాగి ఉన్నారని.. డబ్బుకోసం ఆమె భర్తపై దాడిచేశారని, ఆమె అడ్డుకోబోయినందువల్ల ఆమెను నెట్టేసే క్రమంలో ఆమె అత్యాచారానికి గురైందని’’ అన్నారు. 

‘‘పేదరికం వల్లనో మానసిక పరిస్థితుల వల్లనో అప్పటికప్పుడు కొన్ని అనుకోని రీతిలో ఇలాంటివి జరుగుతుంటాయని’’ అన్నారు.

ఆమె చెప్పిన మాటల్లో రేపల్లె అత్యాచారానికి పోలీసు సిబ్బంది కొరతకు సంబంధం లేదన్నమాట వాస్తవం. కానీ.. ఏ పరిస్థితుల్లో ఈ అత్యాచారం జరిగిందో ఆమె విశ్లేషణ గమనిస్తే.. ఒక హోం మంత్రి మాట్లాడినట్టుగా లేదు.. ఆ అత్యాచారానికి పాల్పడిన వారి లాయరు మాట్లాడినట్టుగా ఉంది. తాగి వచ్చి, రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం మీద పడుకున్న వ్యక్తితో గొడవ పెట్టుకుని డబ్బు లాక్కుని, భార్యను లాక్కెళ్లి అతడి కళ్లెదుటే అత్యాచారానికి పాల్పడిన వారిమీద తానేటి వనిత గారికి ఇంతగా సానుభూతి జాలి ఎందుకు వెల్లువెత్తుతున్నాయో అర్థం కావడం లేదు. 

ఇలాంటి హోం మినిస్టరు ఉంటే అసలు మహిళలకు ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందా? సాధ్యమేనా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు ఆడపడుచులకు అన్నగా సంపాదించుకుంటున్న పేరు మొత్తం మంటగలిసిపోదా? రాష్ట్రంలోని మహిళల మనన్న పొందే ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకోవడానికి జగన్ పడుతున్న కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారదా? అనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. 

మొత్తానికి హోం మంత్రి తానేటి వనిత తన అవగాహన లేని, అనుచితమైన మాటలతో ప్రభుత్వం, జగన్ పరువు తీస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.