తమ అవసరార్థం భారతీయ జనతా పార్టీలో చేరిన నేతలకు పసుపు రంగు వదలడం లేదు! వారికి ఆ రంగు వదలుతుందని కూడా ఎవ్వరూ అనుకోరు, అయితే బీజేపీ ఉన్నా ఎన్టీఆర్ బొమ్మలతో, బాలకృష్ణ ఫొటోలతో, పసుపు రంగు ఫ్లెక్సీలు వేయించుకుని పుట్టిన రోజు పండగను జరుపుకోవడం బీజేపీలోని తెలుగుదేశం మాజీ నేతల ప్రత్యేకత! తెలుగుదేశం నుంచి అధికారం చేజారగానే కొందరు బీజేపీలో చేరారు. అయితే వీరిలో ఒక్కోరిది ఒక్కో కామెడీ!
కర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంకటేష్ ఏమో భారతీయ జనతా పార్టీ. ఆయన తనయుడు తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి! అలాగే తెలుగుదేశం టు బీజేపీలోకి వెళ్లిన మిగతా నేతల సంగతీ చెప్పనక్కర్లేదు. చంద్రబాబుకు అతి సన్నిహితులు వీళ్లంతా. ఇక ఆదినారాయణ రెడ్డి అయితే పేరుకు బీజేపీ, మాట్లాడేదంతా చంద్రబాబు అనుచరుడిగా! ఈ కామెడీలన్నీ కొత్తేమీ కాదు. పేరుకు బీజేపీ, చేసేది చంద్రబాబుకు చంచాగిరి అన్నట్టుగా చాలా మంది వ్యవహరిస్తూ ఉన్నారు. వారిని చూసి బీజేపీ వాళ్లు తొడలు చరుచుకుంటూ ఉంటారు! అయితే వీళ్లేమో తమ పాత గోత్రాలను బయట పెట్టుకోకుండా ఉండానికి కొంచెమైనా వెనుకాడటం కూడా లేదు!
గత వారంలో తెలుగుదేశం మాజీ నేత, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర నేత వరదాపురం సూరి బర్త్ డే సందర్బంగా ఆయన సొంత నియోజకవర్గం ధర్మవరంలో పచ్చరంగు ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ ల బొమ్మలొక్కటే తక్కువ. సైకిల్ సింబల్ లేదంతే. ఫ్లెక్సీలన్నీ టీడీపీ ఫ్లెక్సీలు ఉండే పసుపు పచ్చ కలర్ లోనే వేయించుకున్నారు. చాలా ఫ్లెక్సీల్లో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణల బొమ్మలు కూడా వేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ ల బొమ్మలు వేసుకోవడానికి కాస్త మొహమాట పడ్డారంతే! ఇలా పసుపు ఫ్లెక్సీలతో కాషాయ పార్టీ నేత బర్త్ డే జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీని వెక్కిరించడం ఒక ఎత్తు అయితే, ధర్మవరం టీడీపీ ఇన్ చార్జి పరిటాల శ్రీరామ్ ను మరో రకంగా వెక్కిరిస్తూ ఉంది.
వరదాపురం సూరి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే. ఈయన చంద్రబాబుకు అప్పుడూ, ఇప్పుడూ చాలా సన్నిహితుడని పేరు. పెద్ద కాంట్రాక్టరు అయిన వరదాపురం సూరి తన అవసరం కోసం బీజేపీలోకి వెళ్లారనే పేరుంది. వచ్చే ఎన్నికల్లో ఈయన టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నరనే టాక్ కూడా ఉంది. అయితే ఈయన బీజేపీలోకి వెళ్లాకా ధర్మవరం టీడీపీ ఇన్ చార్జిగా పరిటాల శ్రీరామ్ ను ప్రకటించారు. పరిటాల, వరదాపురం ఫ్యామిలీలకు చాలా కాలం నుంచి పడదు. అంతా కమ్మవాళ్లే , టీడీపీనే. అయితే విరోధం. వరదాపురం సూరి తండ్రి వద్ద పరిటాల రవి పది, పరక తీసుకునే వాడట! ఇదీ వరదాపురం వర్గం చేసే ప్రచారం.
ఇక వరదాపురం సూరి కి ధర్మవరం నియోజకవర్గంలో అనుచరవర్గం ఉంది. అది ఇప్పుడు ఆయనకు ఫ్లెక్సీలు వేసింది. అది కూడా పసుపు కలర్లో! ఎన్టీఆర్, బాలకృష్ణ బొమ్మలను వాడుకుంటూ. ఇది పరిటాల శ్రీరామ్ కు మింగుడుపడే అంశం కాదు. ఒకవైపు తను ధర్మవరం టీడీపీ ఇన్ చార్జిగా ఉండగా, వరదాపురం సగం టీడీపీ నేత స్థాయిలో ఫ్లెక్సీలు వేయించుకుంటున్నారు. మరి ఇదంతా వరదాపురం ఎన్నికల సమయానికి తిరిగి టీడీపీలోకి చేరే సంకేతం కాబోలు. మరి వరదాపురం సూరి తిరిగి టీడీపీలోకి చేరి ధర్మవరం టికెట్ పొందితే… వెర్రివాళ్లయ్యేది పరిటాల శ్రీరామే!