బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇటీవలి సినిమా ఫఠాన్ సూపర్ హిట్ కావడంతో.. షారూక్ తదుపరి సినిమాలకు భారీ మార్కెట్ ఏర్పడుతూ ఉంది. ఫఠాన్ కు ముందు షారూక్ కు సరైన హిట్ లేదు కొంతకాలంగా. ఒక దశలో షారూక్ సినిమాలు ఇక మానేయడం మేలేమో తరహా కామెంట్లు కూడా వినిపించాయి. వరస పెట్టి ఫ్లాప్ లతో షారూక్ అలా వెనుకబడ్డట్టుగా కనిపించాడు. రొటీన్ కథాంశాలను చేసినా, ప్రయోగాలను చేసినా ప్రేక్షకులు ఆ సమయంలో షారూక్ ను ఆదరించలేదు. ఆ సమయంలో షారూక్ తను హీరోగా వరస పరాజయాలను ఎదుర్కొంటుండటంతో నిర్మాణం మీద దృష్టి సారించాడు. తన ప్రొడక్షన్ హౌస్ పై వరస పెట్టి సినిమాలు రూపొందిస్తూ ఆదాయం మాత్రం తగ్గకుండా చూసుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఫఠాన్ షారూక్ కు కరువు తీర్చే హిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ హీరో తదుపరి సినిమాల మార్కెట్ మంచి స్థాయికి చేరుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. షారూక్ తదుపరి సినిమాలు డిజిటల్ మార్కెట్ లో భారీ ధర పలుకుతున్నాయి. దక్షిణాది దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారూక్ హీరోగా వస్తున్న జవాన్ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను ఏకంగా 250 కోట్ల రూపాయలకు అమ్మారట. ఈ సినిమా కు సంబంధించి మొత్తం డిజిటల్ రైట్స్ ఈ ధర పలికాయి. ఇది భారీ మొత్తమే అని వేరే చెప్పనక్కర్లేదు. ఓటీటీ, టెలివిజన్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇవన్నీ కలిపి రెండు వందల యాభై కోట్ల రూపాయలకు అమ్మారట. దాదాపుగా ఆ సినిమా బడ్జెట్ మొత్తానికి సమానంగా ఉంది ఈ ఫిగర్. బడ్జెట్ మొత్తాన్నీ దాదాపుగా ఇలా డిజిటల్ రైట్స్ ద్వారానే సంపాదించుకుంటున్నట్టుగా ఉన్నారు.
ఇక రాజ్ కుమార్ హీరానీ – షారూక్ కాంబోలోని సినిమా డిజిటల్ రైట్స్ కూడా దాదాపు ఇదే స్థాయి ధర పలికిందట. ఈ సినిమాను సుమారుగా 230 కోట్ల రూపాయలకు అమ్మారట. ఇలా వరసగా షారూక్ సినిమా మరోటి భారీ రేటు పలికింది. ఇది కూడా తన బడ్జెట్ ను దాదాపుగా డిజిటల్ రైట్స్ ద్వారానే సంపాదించుకున్నట్టుగా ఉంది.
షారూక్ ఖాన్ సూపర్ హిట్ సినిమా ఫఠాన్ ను ఒక ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థకు వంద కోట్ల రూపాయల ధరకు అమ్మారట! అలా ఆ సినిమా స్ట్రీమ్ అవుతోంది. మరి ఓటీటీ విడుదలతోనే వంద కోట్ల రూపాయలంటే మాటలేమీ కాదు. ఓటీటీకి తోడు ఇతర డిజిటల్ ఆదాయాలన్నింటినీ కలుపుకుని షారూక్ సినిమాలు ఇప్పుడు రెండు వందల కోట్ల రూపాయలకు మించి మార్కెట్ చేసుకుంటున్నాయి. ఒక బాక్సాఫీస్ వద్ద ఫఠాన్ సినిమా సుమారు ఆరు వందల కోట్ల రూపాయల వసూళ్లను పొందిందని అంచనా. ఆ సినిమాతో షారూక్ ఫామ్ ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇతడి తదుపరి సినిమాలకు కూడా మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశాలున్నాయి.
ఇక ఓటీటీ ఆదాయ మార్గం ద్వారా బాలీవుడ్ హీరోలు భారీగా సంపాదించుకోవడం కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో ఇండియాలో ఓటీటీ ద్వారా భారీ పారితోషికం పొందుతున్న హీరోగా అజయ్ దేవగణ్ రికార్డు సృష్టించాడు. ఒక ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థకు ఒక వెబ్ సీరిస్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న అజయ్ దేవగణ్ అందుకు గానూ ఏకంగా 120 కోట్ల రూపాయల పారితోషికం పొందుతున్నాడట.
ఇది ఇప్పటి వరకూ ఇండియన్ వెబ్ సీరిస్ ల చరిత్రలో కొత్త రికార్డు అని, ఒక సీరిస్ ఒక సీజన్ కోసం 120 కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ పొందిన నటులు ఎవ్వరూ లేరని, అజయ్ దేవగణ్ తొలి సారి అలాంటి రెమ్యూనిరేషన్ పొందాడని టాక్.
మొత్తానికి తమ సినిమాల ద్వారా కావొచ్చు, లేదా ఓటీటీ వెబ్ సీరిస్ లలో నటించడం ద్వారా కానీ బాలీవుడ్ తారలు బ్రహ్మాండమైన సంపాదన పొందుతున్నారు.
-హిమ