తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మిట్టకండ్రిగ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన కొందరు కారులో తిరుమలకు వెళ్లారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు పయనమయ్యారు.
శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలున్నారు. లారీ కిందికి దూసుకెళ్లిన కారును అతి కష్టంపై బయటికి తీశారు.
ఈ దుర్ఘటనతో ఇరువైపులా మూడు కిలోమీటర్లు చొప్పున ట్రాఫిక్ స్తంభించింది. మృతదేహాలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు కొంత సమయం పట్టింది. సంఘటనా స్థలంలో మృతదేహాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
కృష్ణా జిల్లాకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తికి బయల్దేరినట్టు సమాచారం. అతి వేగమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.