ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే నాయకుల్లో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ప్రథముడు. వైసీపీలో చేరికలు, తీసివేతల గురించి మిథున్‌కు బాగా తెలుసు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మిథున్ పాత్ర మరింత కీలకంగా మారింది. సర్వేలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, నివేదిక వివరాలను ఎప్పటికప్పుడు సీఎం వైఎస్ జగన్‌తో పంచుకుంటుంటారు.
వైసీపీలో కీలక నాయకుడైన మిథున్‌రెడ్డి ఇవాళ కీలక ప్రకటన చేశారు. కాపు ఉద్యమ నాయకుడైన ముద్రగడ పద్మనాభానికి ఆయన వెల్‌కమ్ చెప్పడం చర్చనీయాంశమైంది. గత కొంత కాలంగా ముద్రగడ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిథున్ కామెంట్స్ వాటికి బలం కలిగిస్తున్నాయి. ముద్రగడ గొప్ప నాయకుడని ఆయన అన్నారు. అలాంటి నాయకుడు వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు.
ఈ విషయమై సీఎం వైఎస్ జగన్, ముద్రగడ పద్మనాభం కలిసి మాట్లాడుకుని తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. ముద్రగడ లాంటి నాయకులు వైసీపీలోకి వస్తే పార్టీ బలపడుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. కాపులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని పవన్‌కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆయన విమర్శించారు.
పక్కా వ్యూహంతోనే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిని పవన్ తిట్టారని ఆయన చెప్పుకొచ్చారు. అసలు ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుందో చెప్పాలని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ కావాలా? వద్దా? అనే అంశంపైనే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇదే అంశాన్ని జగన్ ప్రజల ముందు పెట్టడాన్ని ఆయన గుర్తు చేశారు.