జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పొత్తులపై తాజా వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపాయి. మరీ ముఖ్యంగా తాను పాదయాత్ర చేసిన తర్వాత సర్వే చేయిస్తున్నానని ఆయన చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్‌కల్యాణ్ వ్యూహాత్మకంగా తన సామాజిక వర్గం బలంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలో వారాహి యాత్రను ప్రారంభించారు. రెండో దఫా యాత్రను అక్కడే కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పొత్తులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నిస్వార్థంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుందని ఆయన చెప్పడం జనసేన శ్రేణుల్లో జోష్ నింపుతోంది. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని ఆదివారం ఆయన పిలుపునిచ్చారు. పవన్ కామెంట్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పవన్‌కల్యాణ్ ఇప్పుడు సరైన దారిలోకి వచ్చారని నెటిజన్లు అంటున్నారు.
చంద్రబాబును నమ్ముకుంటే ప్యాకేజీ వస్తుందని, శ్రమను నమ్ముకుంటే అధికారం వస్తుందని పవన్‌కు నెటిజన్లు సూచిస్తు న్నారు. పవన్ మాటలు చెప్పడం కాదని, వాటిని ఆచరణలో పెడితేనే ప్రయోజనం వుంటుందని నెటిజన్లు అభిప్రాయపడు తున్నారు. ఇప్పటికైనా పవన్ ఆలోచన విధానం మారినందుకు సంతోషంగా వుందని జనసేన నాయకులు అంటున్నారు.
తనను అభిమానించే వారిని వదిలిపెట్టి, పక్క పార్టీ నాయకుడిపై ఆధారపడి, వారిచ్చే సీట్లనే మహాభాగ్యమని సంతృప్తి చెందే దుస్థితి తమకు రాదని జనసేన నేతలు అంటున్నారు. అయితే సీట్ల విషయమై టీడీపీతో ఎక్కడో తేడా కొడుతోందని, అందుకే పవన్‌కల్యాణ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కల్యాణ్ తాజా వ్యాఖ్యలపై ఎన్ని రోజులు స్థిరంగా నిలబడుతారో చూద్దామని టీడీపీ శ్రేణులు వెటకరిస్తున్నాయి.