జనసేనాని వారాహి యాత్ర పార్ట్-2 మొదలు కావడమే ఆలస్యం, వైసీపీ నుంచి సెటైర్స్ దూసుకొస్తున్నాయి. ముఖ్యంగా పవన్ సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనానికి కౌంటర్స్ ఇవ్వడంలో ఉత్సాహం చూపుతుంటారు. వారాహి యాత్ర రెండో ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు పవన్‌కల్యాణ్ ఎప్పట్లాగే వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. వీటికి మంత్రి అమర్నాథ్ అదే స్థాయిలో స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు.
గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ నేషనల్ మీడియాలో పవన్ భార్యతో విడిపోయారనే వార్త రాగానే… వెంటనే భుజాలు తడుముకుని ఫొటో విడుదల చేశారని చురక అంటించారు. అసలు పవన్‌కల్యాణ్ వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయయాత్ర నిర్వహిస్తారన్నారు. వారాహి యాత్ర పార్టీ-1 అని, ఇప్పుడు పార్టీ -2 అంటున్నారని వెటకరించారు.
రాజకీయం అంటే వెబ్ సిరీస్ కాదని పవన్‌కు హితవు పలికారు. పవన్ సినిమాల్లో హీరో, రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ అంటూ మండిపడ్డారు. పవన్ సినిమాలో చంద్రబాబు విలన్ అని మంత్రి విమర్శించారు. జనసేనకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరన్నారు. చంద్రబాబును భుజాన వేసుకుని తిరగడానికి రాజకీయ పార్టీ దేనికని ఆయన ప్రశ్నించారు. 2019 ఎన్నికల ఫలితాలు మరోసారి పునరావృతం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్పై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. తరచూ పవన్ వ్యక్తిగత విషయాలను మంత్రి ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పవన్‌తో ఫొటో తీయించుకునేందుకు తహతహలాడిన గుడివాడ అమర్నాథ్, ఇప్పుడే అదే వ్యక్తిని విమర్శిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పవన్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడ్డం మానేయాలని జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారు.