కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం… వరదరాజులరెడ్డి తమ వాడే అంటోంది. కానీ ఆయన మాత్రం తాను టీడీపీలో ఉన్నానని చెప్పడం గమనార్హం. అసలేం జరిగిందంటే…
ఇటీవల ఏపీ కాంగ్రెస్లో మార్పుచేర్పులను చేపట్టారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఏపీ పీసీసీ నూతన కమిటీని ప్రకటించారు. ఇందులో 30 మంది రాష్ట్ర కమిటీ సభ్యులకు చోటు కల్పించారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేరు కూడా వుంది. ఈ మేరకు ఆయనకు నూతన కమిటీ జాబితా పంపారు. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు.
కాంగ్రెస్ కమిటీలో తనకు చోటు కల్పించడంపై ఆయన వివరణ ఇచ్చారు. తాను నాలుగు దఫాలు కాంగ్రెస్ తరపున ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. 2014లో టీడీపీ తరపున ప్రొద్దుటూరు నుంచి పోటీ చేశానన్నారు. అయితే సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో ఉండడం వల్ల పార్టీ తన విషయంలో పొరపాటు పడి జాబితాలో చోటు కల్పించిందన్నారు. తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
2019లో వరదరాజులరెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన చంద్రబాబుపై ఆగ్రహంతో టీడీపీకి దూరంగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డికి ఆయన మద్దతు ఇవ్వలేదు. టీడీపీ ఓడిపోయింది. తాను ఏ పార్టీలో లేనని ఆయన పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రానున్న ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ పెద్దలతో వరదరాజలరెడ్డి కుటుంబ సభ్యులు చర్చించారు. తమకే టికెట్ వస్తుందనే ధీమాతో వరదరాజులురెడ్డి ఉన్నారు. ఆ నమ్మకంతోనే తాను టీడీపీలో ఉన్నానని వరదరాజులరెడ్డి ప్రకటించారనే టాక్ వినిపిస్తోంది.