తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చిక్కితే… పరిస్థితి ఏంటి? అనే చర్చకు తెరలేచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రఘురామ పాత్ర వుందనే ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఈ మేరకు విచారణకు రావాలని సిట్ ఆయనకు నోటీసులు పంపింది. అయితే సిట్ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన ప్రకటించారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుతో ఆంధ్రా ఎంపీగా ఉన్న తనకు సంబంధం ఏమిటని, ఆ రాష్ట్ర రాజకీయాలతో తనకు లింకు ఏమిటని ఆయన ప్రశ్నించారు. రూ.100 కోట్లు తాను ఇస్తానని వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కూడా ఆయన డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే నిప్పులేనిదే పొగ రాదంటారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ఎంపీల పేర్లు ఎక్కడా వినిపించలేదు.
కానీ రఘురామకృష్ణంరాజు పేరే ఎందుకు తెరపైకి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం రావాల్సి వుంది. ఏపీలో సొంత పార్టీతో రఘురామకు అసలు పొసగడం లేదు. కనీసం ఏపీకి వెళ్లలేని దయనీయ, దుర్భర స్థితిని రఘురామ ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఆయన చక్కర్లు కొడుతూ… కాలం గడుపుతున్నారు. బహుశా దేశ రాజకీయాల్లో ఒక ఎంపీ సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని స్థితి రఘురామకు తప్ప, మరెవరికీ ఎదురై వుండదు.
ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తులో రఘురామ ప్రమేయం ఉందని తేలితే, ఆయన ఎక్కడ తలదాచుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవు తోంది. బీజేపీనే ఢీ కొంటున్న కేసీఆర్‌కు, రఘురామ ఓ లెక్కా? తన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో రఘురామ పాత్ర ఉందని తేలితే మాత్రం… ఎంపీకి దబిడి దబిడే అనే సరదా కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రఘురామకు భవిష్యత్‌లో చోటు వుండకపోవచ్చంటున్నారు.
అసలే చంద్రబాబుకు రఘురామ ఇష్టమైన ఎంపీ. గతంలో ఓటుకు నోటు కేసులో బ్రీఫ్ చేస్తూ చంద్రబాబు ఎలా చిక్కారో అందరికీ తెలుసు. ఆ కేసు పుణ్యాన హైదరాబాద్‌లో పదేళ్ల హక్కును కూడా కాదనుకుని, చంద్రబాబు రాత్రికి రాత్రి అమరావతికి వెళ్లడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తన ప్రమేయం లేదని రఘురామ చెబుతున్నప్పటికీ, ప్రత్యర్థులు మాత్రం ఉంటుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రఘురామకు చోటు దక్కడంపై సిట్ విచారణ ఆధారపడి వుంది.
రఘురామకు అనుకూలమైన నివేదిక వస్తే… ఆయనకు సమస్య లేదు. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే మాత్రం… భవిష్యత్ ఏంటో ఆయనే ఆలోచించుకోవాల్సి వుంటుంది.