ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణకు ట్విటర్ వేదికగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. అక్షరాలను అమ్ముకుని ఎదిగిన జర్నలిస్టు అనే అర్థం వచ్చేలా సోము వీర్రాజు తన మార్క్ విమర్శ చేయడం చర్చనీయాంశమైంది. బీజేపీ కోర్ కమిటీ భేటీలో సోము వీర్రాజు ఎవరో తెలియనట్టు ప్రధాని వ్యవహరించారని ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం ప్రచురితమైంది. రాజకీయాలు కాకుండా మీరేం చేస్తుంటారని ప్రశ్నించారని, వీర్రాజును ప్రధాని గుర్తించకపోవడంపై బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారంటూ కథనంలో ప్రస్తావించారు.
తనను ఓ పథకం ప్రకారం సదరు మీడియా టార్గెట్ చేయడంపై వీర్రాజు ఘాటుగా స్పందించారు. ఇందుకు ట్విటర్‌ను వేదికగా చేసుకున్నారు. వేమూరి రాధాకృష్ణను ఉద్దేశించి సోము వీర్రాజు చేసిన ట్వీట్ ఏంటంటే…
“వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ, అక్షరాలను అడ్డుపెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేసే కొంతమంది వ్యక్తుల జీవితాలను, వారి మానసిక స్థితిని తెలియజేసే అద్భుతమైన మాటలు” అంటూ వీర్రాజు ట్వీట్ చేయడంతో పాటు తెలంగాణ మహాకవి కాళోజీ వల్లించిన సూక్తిని ఆయన షేర్ చేయడం విశేషం.
“అక్షరాలను అడ్డుగా పెట్టుకుని ఎదిగిన వారు ఎందరో. అక్షరాలనే ఆత్మగా చేసుకుని బతికిన వారు కొందరు” అని కాళోజీ అన్న మాటలను ఈ సందర్భంగా వీర్రాజు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనను టార్గెట్ చేసిన ఆర్కేని ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అక్షరాలను అడ్డు పెట్టుకుని ఆర్కే ఎదిగారని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని, అలాంటి జర్నలిస్టుల మానసిక స్థితిని కాళోజీ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నట్టు వీర్రాజు నేరుగానే చెప్పారు.