మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నీతిసూక్తులు చక్కగా చెబుతుంటారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో నీతులు మాట్లాడితే సరిపోదు. వెంటనే వారి ఆచరణ గురించి ప్రశ్నలు వెల్లువెత్తుతాయి. బీజేపీలో వెంకయ్యనాయుడి నిబద్ధత గురించి ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు. జాతీయ పార్టీ అయిన బీజేపీకి సారథ్యం వహించేస్థాయికి చేరుకోవడం చిన్న విషయం కాదు. వెంకయ్యనాయుడు మంచి వక్త కావడం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలపై పట్టు కలిగి వుండడంతో రాజకీయంగా చకచకా ఎదిగారు.
ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయంగా ఆయన్ను దూరం పెట్టడానికి ఉపరాష్ట్రపతి పదవిని కేంద్ర పెద్దలు ఇచ్చారనే అభిప్రాయం లేకపోలేదు. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, తాజాగా ఆయన రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
“నేతలు పార్టీలు మారడం ట్రెండ్‌గా మారింది. ఇది డిస్ట్రబింగ్ ట్రెండ్. పార్టీ మారిన వారు వెంటనే పదవికి రాజీనామా చేయాలి. పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరొచ్చు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాలి” అని వెంకయ్యనాయుడు అన్నారు. వెంకయ్యనాయుడు మాటలు ఆచరణకు నోచుకుంటే బాగుంటుందనేది అందరి అభిప్రాయం.
అయితే తాను రాజ్యసభకు సారథ్యం వహిస్తున్నప్పుడు, నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనం అయ్యారు. ఆ ప్రక్రియలో వెంకయ్యనాయుడు భాగస్వామి అయ్యారనేది నెటిజన్ల విమర్శ. సాంకేతిక అంశాలను సాకుగా తీసుకుని, ఫిరాయింపులను ప్రోత్సహించారనే మచ్చ వెంకయ్యనాయుడిపై వుంది. అందుకే ఆయన ఇలాంటి రాజకీయ నీతులు చెప్పినప్పుడల్లా… మీరు చేసిందేంటి? అనే ప్రశ్న ఎదురవుతూనే వుంటుంది. నాయుడి గారి నీతులు బాగుంటాయని, ఆచరణే అసలు సమస్య అని దెప్పి పొడుస్తున్నారు.