కులం బురద విజయసాయిని శుద్ధీకరిస్తుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనాలోచితంగా పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన చుట్టూ ప్రస్తుతం ఒక వివాదం నడుస్తోంది. ఆ వివాదం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది. వ్యతిరేకులు ఆ వివాదాన్ని…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనాలోచితంగా పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన చుట్టూ ప్రస్తుతం ఒక వివాదం నడుస్తోంది. ఆ వివాదం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది. వ్యతిరేకులు ఆ వివాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నించడం సహజం. ఆయనను అభిమానించే వారు కూడా అనుమానించేలా వివాదం వైరల్ అవుతున్న తీరు ఆయనకు ఇబ్బందికరం.

దీని నుంచి బయటపడాలంటే.. దానికి సంబంధించిన వివరణలు మాత్రమే కాపాడుతాయి. కానీ.. ఆయన దీనికి సంబంధం లేకుండా టీడీపీ మీద మరో రకం దాడిచేస్తున్నారు. కులం బురద చల్లుతున్నారు. వారి మీద కులం బురద చల్లినంత మాత్రాన.. విజయసాయిరెడ్డి పరిశుద్ధుడు అయిపోతారా? అనేది ఇప్పుడు సందేహం.

దేవాదాయ శాఖ అధికారిణి శాంతితో విజయసాయి రెడ్డి వివాహేతర సంబంధం గురించి.. ఆరోపణలు బాగా వచ్చాయి. ఆ తర్వాత.. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి సాగించిన భూకబ్జాల పర్వంలో ఆయన బినామీగా శాంతి సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ప్రచారాల వెనుక ఉన్న అందరి అంతు తేలుస్తానని విజయసాయి ప్రతిజ్ఞ చేశారు. ఆయన దానిని నిలబెట్టుకోవడం మీద దృష్టి పెట్టడం లేదు.

‘టీడీపీ ఒకే కులం కోసం పనిచేస్తుంది. రాష్ట్రంలో పిల్లల్ని అడిగినా ఈ సంగతి చెబుతారు. కులవ్యాపారుల నిధులతో, కుల చానెల్స్ సహకారంతో టీడీపీ గెలిచింది. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ఇది మీకు చేదుగా ఉన్నా.. నేను సత్యం మాట్లాడుతూనే ఉంటాను’ అని విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్టు పెట్టారు.

విజయసాయిరెడ్డి మాటలు గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలు కులాల వారీగా ముద్రపడిపోయి ఉన్నాయన్నది స్పష్టం. విజయసాయి అంటున్నట్టుగా టీడీపీ గురించి మాత్రమే కాదు.. రాష్ట్రంలో ఏ పసివాడిని కదిలించినా ఏ పార్టీ ఏ కులానిదో తెగేసి చెప్తారు. ఆయా నాయకుల మాటలను కూడా ప్రజలు కులాలను బట్టే గమనిస్తున్నారు.

టీడీపీ మీద కులనిందలు వేయడం వల్ల ఆయన సాధించేదేమీ ఉండదు. కౌంటర్లు వేసే వారికోసం, మరింతగా తన కులాన్ని బజారుకీడ్చడం తప్ప ఆయనకు ఒరిగేది లేదు. కాబట్టి ఇలాంటి డైవర్షన్ పోస్టులను కట్టిపెట్టి.. విజయసాయిరెడ్డి తన మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని నిరూపించడంపై చూపు సారించాలి. పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు.. నింద పడడం సహజం. దానిని కడుక్కోవడం కూడా తప్పదు. అది ఆయన బాధ్యతే.