ప్రెవేటు సంస్థల్లో ఉద్యోగాల కల్పన విషయంలో కర్ణాటక రాష్ట్రంలో ఒక చిన్న సంక్షోభం తలెత్తగానే.. ఆంద్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రెవేటు సంస్థల్లో కూడా సీ, డీ గ్రూపు ఉద్యోగాలు నూరుశాతం కన్నడిగులకే తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని ఎక్స్ లో పోస్టు చేశారు సీఎం సిద్ధరామయ్య. ఆ తర్వాత ప్రెవేటు సంస్థల్లో మేనేజిమెంట్ పోస్టుల్లో 50 శాతం, నాన్ మేనేజిమెంట్ పోస్టుల్లో 75 శాతం కన్నడిగులకే ఇవ్వాలంటూ సిద్ధరామయ్య కేబినెట్ తీర్మానించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత వ్యక్తం అయ్యాయి.
ఈలోగా ఏపీ మంత్రి నారాలోకేష్ స్పందించి.. సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఏపీకి రావాల్సిందిగా స్వాగతం పలికారు. విశాఖపట్నంలోని ఐటీ, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్లకు రండి.. మంచి సౌకర్యాలు, నిరంతరాయ విద్యుత్తు ఇస్తాం అంటున్నారు. నిజానికి బెంగుళూరులోని సంస్థలు రీలొకేట్ చేయదలచుకుంటే.. మొదటి ప్రాధాన్యంగా హైదరాబాదు వైపు చూస్తాయి. వాతావరణం సహా ఇతర సౌకర్యాలను గమనిస్తాయి. కానీ.. హైదరాబాదులోని కాంగ్రెస్ ప్రభుత్వం.. బెంగుళూరు నుంచి రీలొకేట్ కాదలచుకున్న కంపెనీలు తరలిరండి అని ఆహ్వానించే పరిస్థితిలో లేదు.
ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ రెండూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే గనుక.. తాము అలా చేస్తే సొంత పార్టీకే నష్టమని రేవంత్ సర్కారు బహిరంగ ప్రకటన చేయదు. ఈ పరిస్థితిని లోకేష్ వాడుకుంటున్నారు. పొరుగు రాష్ట్రంలో ఒక చిన్న సంక్షోభం తలెత్తగానే.. దాని పర్యవసానాలను తమకు అనుకూలంగానే మార్చుకోవడానికి ఏపీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నం బాగుంది. కానీ ఈ ప్రయత్నం వల్ల తక్షణ ప్రయోజనాలు కలిగే అవకాశం తక్కువ.
ప్రస్తుతానికి సిద్ధరామయ్య ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసినప్పటికీ.. ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకూడదని నిర్ణయించింది. అలాగని, ఒకసారి ఆలోచన మొదలైన తర్వాత ఎప్పటికైనా చట్టరూపం దాలుస్తుందని కంపెనీలు భయపడే ప్రమాదం ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్ విస్తరణల విషయంలోనైనా వారు పక్కచూపులు చూస్తారు.
నారా లోకేష్ ఇవాళ చేసిన ట్వీట్ తో సరిపెట్టుకోకుండా.. నిరంతర ప్రయత్నాలు సాగిస్తూ.. కంపెనీలతో టచ్ లో ఉంటే గనుక.. తప్పకుండా.. ఆయన ఆశిస్తున్నట్టుగా విశాఖపట్నం క్లస్టర్లలో ఐటీ కంపెనీలు త్వరలోనే పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది.