విద్యుత్తు కొనుగోళ్లపై జరిగిన వ్యవహారాల గురించి విచారణ జరిపిస్తాం అంటోంటే కేసీఆర్ దళాలు భుజాలు తడుముకుంటున్నాయి. విచారణను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన వారు కాస్తా.. న్యాయస్థానాలను ఆశ్రయించి.. ఆ పిటిషన్లను తమకు ఒక కవచంలాగా వాడుకోవాలని అనుకుంటున్నారు. విచారణను తప్పించుకోవాలని చూస్తున్నారు. కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనే దానిని నేరంగా ప్రొజెక్టు చేసి కమిషన్ చిత్తశుద్ధిని శంకించే ప్రయత్న ప్రజారజక కాకపోవచ్చు.
రిటైర్డు జస్టిస్ నరసిహారెడ్డి కమిషన్ మీద సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన కేసీఆర్ కు ఏం ఒరిగింది. కమిషన్ విచారణ మధ్యలోనే ప్రెస్ మీట్ పెట్టడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. మొత్తానికి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఛైర్మన్ పదవినుంచి తనంత తానుగా తప్పుకున్నారు.
తమాషా ఏంటంటే.. ఈ పరిణామాన్ని తాము సాధించిన విజయంలాగా చెప్పుకుంటూ.. గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నాయి. ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి వారంతా ఒక అబద్ధపు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. నర్సింహారెడ్డి తప్పుకున్నంత మాత్రాన విచారణ ఆగిపోయినట్టు కాదు. కొత్త ఛైర్మన్ ను నియమిస్తాం అని తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టుకు ఆల్రెడీ తెలియజెప్పింది.
పోయినోళ్లందరూ మంచోళ్లు అనిపించే తరహాలో.. నర్సింహారెడ్డి స్థానంలో అంతకంటె కఠినంగా ఉండే మరో జస్టిస్ రావొచ్చు. ఇప్పటి కోర్టు తీర్పు వల్ల.. తాను కమిషన్ కు సంజాయిషీ చెప్పవలసిన అవసరం లేకుండా పోతుందని కేసీఆర్ అనుకుంటే భ్రమ.
స్థూలంగా చూసినప్పుడు.. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల విచారణ అని అనగానే.. కేసీఆర్ దళంలో కంగారు మొదలైందా అనే అనుమానం పలువురికి కలుగుతోంది. తెలంగాణ డిస్కమ్ కంపెనీలు అన్నీ అప్పులపాలు కావడానికి కేసీఆర్ ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలు కారణం అనేది రేవంత్ సర్కారు ఆరోపణ. అది కాదని వారు నిరూపించుకుంటే సరిపోతుంది.
విచారణ ఇప్పుడు ఆగిపోలేదని భారాస నాయకులు గుర్తుంచుకోవాలి. అలాగే కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిన రోజులు కూడా ముందు ముందు తప్పకుండా ఉంటాయి. నర్సింహారెడ్డిని తప్పించడానికి దారితీసిన కారణాలను మరింత జాగ్రత్తగా విశ్లేషించి.. మరింత పకడ్బందీగా కొత్త ఛైర్మన్ ఆధ్వర్యంలో విచారణ సాగేలా రేవంత్ సర్కారు జాగ్రత్తలు తీసుకుంటే.. ప్రతిపక్షానికి చిక్కులు తప్పవని ప్రజలు భావిస్తున్నారు.