టీడీపీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ముఖ్య నాయకుడు విజయసాయిరెడ్డి జాలి చూపుతున్నారు. అయితే ఇది వెటకారంతో కూడిన సానుభూతి కావడం గమనార్హం. కొన్ని నెలల పాటు సోషల్ మీడియాకు, ప్రత్యర్థులపై విమర్శలకు దూరంగా ఉన్న విజయసాయిరెడ్డి…. ఇటీవల మళ్లీ యాక్టీవ్ అయ్యారు. టీడీపీపై తన మార్క్ పంచ్‌లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఢిల్లీలో జరగనున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీకి బీజేపీ నుంచి ఆహ్వాన రాకపోవడంతో దెప్పి పొడిచారు. విజయసాయిరెడ్డి ట్వీట్ ఎలా సాగిందంటే…
“అయ్యో పాపం! ఎన్ని లాబీయింగులు చేసినా ఎన్డీయే కూటమి సమావేశానికి టీడీపీకి ఆహ్వానం రాలేదు. బిజెపిలోకి పంపించిన కోవర్టులు శతవిధాలా ప్రయత్నించి భంగపడ్డారు. తాను ఏ గట్టున ఉన్నాడో తెలియని పరిస్థితిలో కుమిలిపోతున్నాడు బాబుగారు. అవకాశవాద రాజకీయాలకు ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదు” అని విజయసాయిరెడ్డి హెచ్చరించడం విశేషం.
బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెరిగిందన్న ప్రచారంతో టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. వైసీపీని ఎదుర్కొనేందుకు బీజేపీ మద్దతు వుంటే బాగుంటుందనే అభిప్రాయం చంద్రబాబులో వుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు మోదీ సర్కార్ తీరని అన్యాయం చేసిందనే భావన ప్రజానీకంలో వుంది. అందుకే బీజేపీతో అంటకాగిన పార్టీకి జనం వాతలు పెడ్తారనే భయం టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు టీడీపీ తనకు తానుగా బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా, ప్రస్తుతానికి ఆ పార్టీ దూరం పెడుతోంది. ఇదే ప్రత్యర్థులకు అస్త్రమవుతోంది. ఈ కోణంలోనే విజయసాయిరెడ్డి ట్వీట్‌ను చూడాల్సి వుంటుంది.