ఎమ్బీయస్‍: సింగపూరు ఈశ్వరన్

సింగపూరు రవాణా మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలపై అరెస్టయినట్లు వార్త రాగానే మన తెలుగు మీడియా స్పందించిన విధానం వింతగా ఉంది. కొందరు అస్సలు కవర్ చేయలేదు. మరి కొందరు యింకేముంది ఈశ్వరుడు అరెస్టయినప్పుడు…

సింగపూరు రవాణా మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలపై అరెస్టయినట్లు వార్త రాగానే మన తెలుగు మీడియా స్పందించిన విధానం వింతగా ఉంది. కొందరు అస్సలు కవర్ చేయలేదు. మరి కొందరు యింకేముంది ఈశ్వరుడు అరెస్టయినప్పుడు యిక ఆయన నెత్తి మీద అలరారే చంద్రుడు అరెస్టు కావడమే తరువాయి అన్నట్లు చెప్పేస్తున్నారు. మామూలుగా అయితే ఆ దేశంలో ప్రభుత్వం కూలిపోయినా మనం పట్టించుకోము. కానీ అమరావతి నిర్మాణం అనే లింకు ద్వారా, బాబు గారు ఆకాశానికి ఎత్తేయడం ద్వారా ఈశ్వరన్ మనకు పరిచయమయ్యాడు. జగన్ వచ్చాక అమరావతి – సింగపూరు కాంట్రాక్టు చెట్టెక్కడంతో ఈశ్వరుణ్ని మనం మర్చిపోయాం. ఇన్నాళ్లకు ఆయన అరెస్టు కావడంతో మనకు మళ్లీ వార్తల్లో వ్యక్తి అయ్యాడు, అదీ తెలుగు మీడియాలో ఒక వర్గానికి మాత్రమే!

అతని గురించి చదివే ముందు, మనం అతి స్పష్టంగా అర్థం చేసుకోవలసినది ఒకటుంది. ప్రస్తుతం అతనిపై ఉన్నది ఆరోపణ మాత్రమే, అది కూడా ఫలానా కేసులో అని విచారణ సంస్థ ప్రకటించలేదు. అతనితో పాటు ఓంగ్ అరెస్టు కావడం బట్టి ఫార్ములా 1 రేస్ ఒప్పందం విషయంగా అయి ఉంటుందని ఊహిస్తున్నారు. దానిపై విచారణ సాగాలి. నిరూపించ బడాలి. దాదాపు పాతికేళ్లగా అతను పార్టీలో, ప్రభుత్వంలో ప్రముఖమైన వ్యక్తి. రకరకాల విభాగాల్లో మంత్రిగా, ప్రధాని కార్యాలయంలో ముఖ్యుడిగా పని చేశాడు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో సంబంధబాంధవ్యాలు, లావాదేవీలు ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉన్నాడు. నామీద మరీ లోతుగా తవ్వితే మీ అందరి బండారం బయట పెడతా అని పార్టీ పెద్దలను బెదిరించవచ్చు. సింగపూరుకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచి ఆ పార్టీయే రాజ్యమేలుతోంది. అవినీతిరహిత పాలన అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటోంది. ఇప్పుడీ ఆరోపణ వచ్చింది. దీనిమీద విచారణ జరిపించక పోతే 2025లో రాబోయే ఎన్నికలలో దెబ్బ. ఈశ్వరన్ కసి కొద్దీ యింకో నలుగురు పార్టీ ప్రముఖుల పేర్లు చెప్పినా దెబ్బే. అందుకని తూతూమంత్రంగా విచారణ సాగినా ఆశ్చర్యపడరాదు.

ఈశ్వరన్‌పై అనుమానం రేకెత్తించిన కేసేమిటి? ఓంగ్ అనే మలేసియా పౌరుడు ఫార్ములా 1 ప్రాజెక్టు నెలకొల్పుతానంటూ సింగపూరు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రభుత్వం తరఫున సంతకం పెట్టిన ఈశ్వరన్ ఓంగ్ నుంచి లంచం తీసుకున్నాడు అని ఆరోపణ. ఈ ఓంగ్‌కి హోటల్ ప్రాపర్టీస్ లి. అనే సంస్థ ఉంది. కుదుర్చుకున్న ప్రాజెక్టు విలువ 135 మిలియన్ డాలర్లు. కంపెనీకి అనుకూలంగా వ్యవహరించడానికై మధ్యలో యితను కతికి ప్రభుత్వానికి నష్టం చేకూర్చాడు అనే ఆరోపణపై ప్రధాని అతని చేత రాజీనామా చేయించి, విచారణ చేసే అధికారాన్ని సిపిఐబి (కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్‌వెస్టిగేషన్ బ్యూరో)కు అప్పగించాడు. వాళ్లు జులై 11న అరెస్టు చేశారు. బెయిలు వచ్చింది. దీనిపై విచారణ ఎన్నాళ్లు సాగుతుందో తెలియదు. అతని యితర కార్యకలాపాలపై ఆరోపణలు వచ్చాయని చదవలేదు. ఇక వాటిపై విచారణ సాగుతుందన్న ప్రశ్నే ఉదయించదు కదా. ఇతర వ్యవహారాల్లో అమరావతి ఉందని ఏ జాతీయ, అంతర్జాతీయ పత్రికా రాయలేదు. అందువలన అమరావతిపై కూడా సింగపూరు బ్యూరో దృష్టి సారిస్తుంది అని అనడానికి ఏ అవకాశమూ, ఏ ఆధారమూ లేదు.

ఒకవేళ వీళ్ల ఆశలు ఫలించి, అమరావతి సంగతేమిటో తడిమి చూద్దాం అనుకున్నా, అక్కడ ఈశ్వరన్ దోషి ఎలా అవుతాడు? ఓంగ్ కేసులో అయితే తనకున్న ప్రభుత్వ పదవిని దుర్వినియోగం చేశాడు అనే అభియోగాన్ని ఎదుర్కోవాలి. అమరావతి కేసులో ఆయన సింగపూరు ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహించలేదు. అమరావతిలో 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణానికి స్విస్ ఛాలెంజి విధానాన్ని పక్కకు పెట్టి, యితరులకు బిడ్స్ వేసే అవకాశం యివ్వకుండా, 2017 మేలో ఆంధ్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది అసెండాస్- సీన్‌బ్రిజ్- సెంట్‌కార్ప్ అనే సింగపూరు కంపెనీల కన్సార్షియంతో! ఈశ్వరన్ సంతకాలు చేసినది సింగపూరు ప్రభుత్వం తరఫున కాదు, కన్సార్షియం తరఫున! సెంట్‌కార్ప్‌లో పెట్టుబడి పెట్టిన టుమాసెక్ హోల్డింగ్స్ లి. అనే కంపెనీలో ప్రభుత్వంది మైనర్ వాటా, ప్రైవేట్‌ది మేజర్ వాటా, దానికి ఈశ్వరన్ మూడేళ్ల పాటు ఎండీగా ఉన్నాడు. అదీ కనక్షన్. ఆ ఒప్పందం కన్సార్షియంకు పూర్తిగా అనుకూలంగా ఉంటే ఉండనీ, సింగపూరు ప్రభుత్వానికి పోయేదేముంది?

ఆ ఒప్పందం ప్రకారం కన్సార్షియం రూ.306 కోట్లు పెడితే వచ్చే వాటా 58%. రూ.5721 కోట్లు పెట్టే ఆంధ్ర ప్రభుత్వం వాటా 42%. 15 ఏళ్లలో మూడు దశల్లో ప్రభుత్వ సహాయంతో డెవలప్ చేసి సంపాదించే గ్రాస్ టర్నోవర్‌లో ఆంధ్ర ప్రభుత్వానికి కన్సార్షియం యివ్వవలసినది మొదటి విడతలో 5%, రెండో విడతలో 7.5%, మూడో విడతలో 12% మాత్రమే. ఇక్కడ లాభపడుతున్నది సింగపూరు ప్రయివేటు సెక్టార్‌లో ఉన్న కన్సార్షియం, దారుణంగా నష్టపోతున్నది ఆంధ్ర ప్రభుత్వం. (పూర్తి వివరాలు కావాలంటే జులై 16 ‘‘సాక్షి’’లో వర్ధెల్లి మురళి రాసిన ‘‘ఇంటిదొంగ-ఈశ్వరన్’’ చదవండి) ఇది అన్యాయం అని గగ్గోలు పెట్టవలసినది, యిలా ఎందుకు జరిగింది అని విచారణ జరిపించవలసినది బాధితురాలైన ఆంధ్ర ప్రభుత్వం మాత్రమే, అక్రమంగా లాభపడుతున్న సింగపూరు ప్రయివేటు సెక్టారూ కాదు, సంబంధం లేని ప్రభుత్వమూ కాదు.

అందువలన సింగపూరు ప్రభుత్వం అమరావతిపై విచారణ జరిపించే ఛాన్సే లేదు. కానీ మనీ లాండరింగ్ ట్రాక్ డౌన్ చేయడంలో ఒకవేళ అమరావతి ఒప్పందం విచారణ పరిధిలోకి వచ్చిందనుకోండి. అప్పుడైన జవాబు చెప్పవలసినది ఆంధ్ర ప్రభుత్వం తరఫున సంతకాలు పెట్టిన అమరావతి డెవలప్‌మెంట్ కార్పోరేషన్ అధికారులు మాత్రమే. బాబు నేరుగా పిక్చర్‌లోకి రారు. రాజకీయ నాయకులందరూ చేసే పనే అది. తమకు కావలసినది అధికారుల ద్వారా చేయించేసు కుంటారు. సమస్య వస్తే ‘ఆ సూక్ష్మ వివరాలన్నీ అధికారులు చూసుకోవాలి కానీ అది మా పని కాదు’ అంటారు. ‘నన్ను చూడనీయలేదు. సంతకం పెట్టమని ఒత్తిడి చేశారు’ అని అధికారి చెప్పలేడు. మా బ్యాంకులలో యిలాటివి కోకొల్లలు. ప్రయోజనం సిద్ధించేది ఉన్నత స్థానంలో ఉన్నవారికి, దండనేమో కింది స్థాయి అధికారికి!

బాబు కేసుల్లో యిరుక్కోవడం, అరెస్టు కావడం యివేమీ జరగవు కానీ ఈశ్వరన్ అరెస్టు బాబు యిమేజిని దెబ్బ తీస్తుంది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాబ్ సిటీ పెడతానన్న బిల్లీ రావు సంగతీ యిలాగే అయింది. వైయస్ కూడా విశిష్టా వాహన్ విషయంలో నమ్మి మోసపోయారు. గతంలో యిన్ని జరిగినా 2014లో కూడా బాబు ఈశ్వరన్‌కు ఘనసత్కారం చేసి, ఆంధ్రుల భాగ్యవిధాతగా అయనను ప్రొజెక్టు చేయడం వలన యిప్పుడు యిరకాటంలో పడ్డారు. ఇటువంటి వాడికా అంత ప్రతిష్ఠాత్మకమైన అమరావతి ప్రాజెక్టు అప్పచెప్పింది? ఇంకా నయం, యిక్కడెంత మింగేసేవాడో అనుకుంటారు ఆంధ్రులు. అసలు అప్పట్లో బాబు చేసిన పెద్ద తప్పేమిటంటే ఈశ్వరన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చు కుంటున్నామని చెప్పకుండా, సింగపూరు ప్రభుత్వంతోనే కుదుర్చు కుంటున్నామని ప్రచారం చేసుకోవడం!  

ఈ సందర్భంలో నన్ను నేను అభినందించుకునే పని ఒకటి చేశాను. 2014 నవంబరు నాటికి అమరావతి, సింగపూరు ప్రభుత్వంతో ఒప్పందం, జి2జి (గవర్నమెంటు టు గవర్నమెంటు) మాట మారుమ్రోగిపోతోంది. బాబు అలానే చెప్పారు. మీడియా అలానే రాసింది. నాకు అనుమానం కలిగింది, సింగపూరు ప్రభుత్వానికి యిదేం పని అని. ఎంతసేపు చూసినా యీ ఈశ్వరనే వస్తాడు తప్ప నాలుగైదు లక్షల కోట్ల రూ.ల ప్రాజెక్టయినా వాళ్ల ప్రధాని రాడెందుకు? తక్కిన మంత్రిగణం, అధికారగణం కూడా రారెందుకు? ‘‘సాక్షి’’లో కానీ, జాతీయ మీడియాలో కానీ యిది జి2జి కాదు అని ఎవరూ రాయలేదు. బాబు ప్రభుత్వం యిచ్చిన హేండ్‌ఔట్‌లనే వాళ్లు ప్రచురిస్తున్నారు. ఇక యిలాక్కాదు, సింగపూరు ప్రెస్‌లో ఏం రాస్తున్నారో చూదామనుకున్నాను. ఆన్‌లైన్‌లో దొరకలేదు. గ్రేట్ ఆంధ్ర పబ్లిషరు వెంకట రెడ్డి గారికి చెప్తే ఆయన అక్కడి పత్రికలకు చందా కట్టి, చదివే సౌకర్యం నాకు కల్పించారు. ఆ సమాచారంతో నేను రాసిన వ్యాసమే – (ఎమ్బీయస్‌ : సింగపూరు కనక్షన్‌ ఏ స్థాయిలో…?

అది తప్పకుండా చదవండి. నా ఆలోచనాక్రమం, సింగపూరు పత్రికల రిపోర్టింగు తెలుస్తుంది. తర్వాతి రోజుల్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అప్పటికి అవేమీ తెలియదు. నా వ్యాసంలో అక్కడి మీడియాలో యీ ఒప్పందం గురించి ఏమీ ప్రముఖంగా రాయలేదని ఎత్తి చూపుతూ ‘‘ఛానెల్‌ న్యూ ఏసియా’’ అనే వెబ్‌సైట్‌లో కనబడిన రిపోర్టు ప్రకారం ఈశ్వరన్‌ మాట్లాడుతూ ‘‘ఈ అంశంలో సింగపూరు కంపెనీలు పోషించే పాత్రపై మేం దృష్టి సారించాం. ఆంధ్ర ప్రభుత్వానికి, మన వ్యాపార ప్రయోజనాలకు మేలు కలిగేట్లా సింగపూరు ఏ మేరకు పాలు పంచుకోవాలో గణనలోకి తీసుకుంటున్నాం.'' (“What role Singapore companies can play in that regard, this is something that we are focusing on, to see how best we can calibrate Singapore's involvement in the way that it is meaningful to the Andhra Pradesh and Indian government, and at the same time beneficial to our business interests,” said Mr Iswaran..)  అన్నారు.

ముక్తాయింపుగా, ‘దీన్ని బట్టి అర్థమైనదేమిటంటే, రాజధాని నిర్మాణంలో పాలు పంచుకునేది సింగపూరు ప్రభుత్వం కాదు, సింగపూరు కంపెనీలు! పూర్వానుభవం లేకపోయినా మన మీద ప్రయోగం చేసి లాభపడుదామని చూస్తున్నాయి’ అని రాశాను. ఇది రాయగానే చాలామంది నాకు మెయిల్స్ రాశారు. బాబు మాటలను శంకించడానికి యిష్టపడని కొందరు సింగపూరు ప్రభుత్వంతో ఒప్పందం కాదనడానికి మీ వద్ద ఆధారాలేమిటి? అని. ఔననడానికి మీ వద్ద ఆధారాలేమిటి? అని అడిగాను నేను. మరి కొందరు సింగపూరు పత్రికలు నేరుగా చదివి బాబు అడ్డగోలుగా అబద్ధమాడేశారని అర్థం చేసుకుని నాకు థాంక్స్ చెప్పారు. అక్కడ రైతుల నుంచి భూములు కొందామనుకున్నాం. మునిగిపోయే వాళ్లం, రక్షించారు… అంటూ.

అలా అబద్ధాలు చెప్పిన బాబు, తన తప్పు ఒప్పుకోలేదు. 2017 మేలో కన్సార్షియంతో ఒప్పందం చేసేసుకున్నారు. అమరావతి కట్టేసి ఉంటే అది రాష్ట్రాన్నంతటినీ పోషించేటంత బంగారు బాతు అయ్యేదని యిప్పటికీ కోతలు కోస్తారు. ఒప్పందంలోనే కట్టడానికి 15 ఏళ్లు పడుతుందని ఉంది కదా, యీ లోపున బాతుకి తిండెలా వస్తుందని ఆయన అభిమానులు అడగరు. ఇలాటి భూరి కార్యక్రమానికి ఆయన ఆధారపడిన వ్యక్తి కారెక్టరేమిటో యివాళ బయట పడింది. మన 2024 ఎన్నికల లోపున విచారణ పూర్తయితే ఆంధ్రులందరికీ తెలిసి వస్తుంది. ఈ లోపున యీ ఈశ్వరన్ సంగతేమిటి తెలుసుకుందాం.

61 ఏళ్ల ఈశ్వరన్ భారతీయ తమిళ సంతతికి చెందిన సింగపూరు వ్యాపారస్తుడు, రాజకీయ నాయకుడు. హార్వార్డ్ యూనివర్శిటీలో చదివి, పబ్లిక్, ప్రయివేటు సెక్టార్లలో ఉన్నతోద్యోగాలలో పని చేసి 1965లో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచి అధికారంలో ఉన్న పీపుల్స్ యాక్షన్ పార్టీ (పిఎపి) ద్వారా 1997 నుంచి ఎంపీగా నెగ్గుతూ వచ్చాడు. 2006 నుంచి అనేక మంత్రిత్వశాఖల్లో పని చేశాడు. అమరావతి ఒప్పందంపై సంతకం చేసేనాటికి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉంటూనే అనేక వ్యాపారసంస్థల్లో డైరక్టరుగా ఉన్నాడు. అవినీతిరహిత పాలనకు పేరుబడిన సింగపూరులో 1986లో ఒక మంత్రిపై యీ స్థాయి విచారణ జరిగింది. విచారణ పూర్తయ్యే లోపునే అతను మరణించాడు. ఇన్నాళ్లకు యితనిపై జరుగుతోంది. అంతిమంగా ఏమవుతుందో తెలియదు.

టిడిపి మానిఫెస్టో ట్రయిలర్‌లో అమరావతి అంశం చెప్పకపోయినా బాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే దాని నిర్మాణం చేపట్టి తమ పెట్టుబడులకు న్యాయం చేకూరుస్తారని అనేకమంది ఆశ పెట్టుకున్నారు. తను పదవిలోకి రాగానే ‘కావవే ఈశ్వరా’ అంటూ అతని వద్దకు వెళ్లి తన ఓటమి తర్వాత వెనక్కు తగ్గి ఒప్పందం రద్దు చేసుకున్న కన్సార్షియంకు నష్టపరిహారాలు చెల్లించి, మళ్లీ ఒప్పందం కుదుర్చుకుంటారని అనుకున్నారు. తీరా చూస్తే యిప్పుడీ ఈశ్వరన్ అరెస్టయి కూర్చున్నాడు. తను నెగ్గితే యింకో పరమేశ్వరుణ్ని వెతికి పట్టుకోవాల్సిన పని బాబుకి పడుతుంది. అతని గురించి ఏ ఐదేళ్లకో, పదేళ్లకో యిలాటి కథనం రావచ్చేమో ఎవరు చూడవచ్చారు? స్థానికంగా లభ్యమయ్యే టేలంటును పక్కన పడేసి, యీ విదేశీ వ్యాపారస్తుల్ని నమ్ముకుంటే ఏమవుతుందో యిప్పటికైనా మన నాయకులకు కనువిప్పు కావాలి. స్వదేశీయుల్లో కూడా దొంగలు లేకపోలేదు. కానీ వాళ్లతో పేచీ వస్తే భారతీయ  కోర్టుల్లోనే కేసులు వేయవచ్చు. బాబు ఈశ్వరన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్లాటివైతే ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్లాలి. అసలు నష్టం కంటె లిటిగేషన్‌కు ఎక్కువ ఖర్చవుతుంది. అదీ భయం!  

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2023)

mbsprasad@gmail.com