ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాంటి సీనియర్ నాయకులు విపక్షకూటమి కాంగ్రెస్ సారధ్యంలోనే ముందుకు సాగాలని అభిలషిస్తున్నారు. మరొకవైపు సీతారాం ఏచూరి వంటి వామపక్ష ఉద్దండులు కూడా విపక్షకూటమికి కాంగ్రెస్ మాత్రమే నాయకత్వం వహించాలని కోరుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ పార్టీకి దేశ ప్రధాని పదవిపై ఆసక్తి లేదని, అధికారంలోకి రావడం తమ ఉద్దేశం కాదని, కేవలం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని లౌకికత్వాన్ని సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమని పేర్కొనడం ఆసక్తికరమైన పరిణామం.
వచ్చే ఎన్నికలలో మోడీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమిని గద్దె దించి విపక్షాలను అధికారంలోకి తీసుకురావడం మినహా.. కాంగ్రెస్ పార్టీకి మరొక లక్ష్యం లేదని మల్లికార్జున ఖర్గే ప్రకటించడం విశేషం. విపక్ష ప్రముఖులు కాంగ్రెస్ సారథ్యం కోసం తహతహలాడుతుండగా ఆ పార్టీ మాత్రం ఈ వైరాగ్యాన్ని ప్రకటించడం ఒక వ్యూహం అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడానికి దక్కగల అవకాశాలను సజీవంగా ఉంచుకోవడం కోసమే వ్యూహాత్మకంగా ఈ మాట చెప్పినట్లుగా అంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. రాహుల్ గాంధీ ప్రస్తుతం తనకు సూరత్ కోర్టు విధించిన జైలు శిక్ష హోల్డ్ లో ఉండడం వలన బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రధాని మోడీ ఇంటిపేరు గురించి చులకనగా వ్యాఖ్యలు చేయడంతో దాఖలైన క్రిమినల్ పరువు నష్టం దావా విషయంలో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
గుజరాత్ హైకోర్టులో అప్పీలు చేస్తే జైలు శిక్షను కొట్టివేయడానికి స్టే ఇవ్వడానికి కూడా తగిన కారణాలు కనిపించడం లేదని తేల్చేసింది. ప్రస్తుతం ఆయన అప్పీలు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ ఎప్పటికి తేలుతుందో తెలియదు. ఈ శిక్ష కారణంగా ఇప్పటికే ఎంపీ పదవిని కోల్పోయిన రాహుల్, రెండేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి వస్తే గనుక, ఆటోమేటిక్గా ఆరేళ్లపాటు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోతారు.
అంటే సుప్రీం కోర్టులో కేసు ఒక పట్టాన తెమలకపోయినా సరే.. జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చినా సరే 2024 ఎన్నికలలో రాహుల్ బరిలో ఉండబోరు. కాంగ్రెస్ పార్టీ నిత్యం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం గురించే పరితపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 2024లో విపక్ష కూటమి అధికారంలోకి వచ్చినా సరే రాహుల్ కు పదవి దక్కే యోగం లేదు. మరోవైపు విపక్షాలకు అధికారం దక్కుతుందని గ్యారెంటీ కూడా లేదు. ఈ లెక్కలు వేసుకుని ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రధాని పదవిపై తమకు ఆశ లేదని త్యాగం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవేళ ఈ ఎన్నికల్లో విపక్షాలు కనీసం బాగా బలపడితే, ఆ తర్వాత ఎన్నికల సమయానికి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా తెరమీదకు తీసుకువచ్చి లబ్ధి పొందవచ్చునని ఆ పార్టీ ఆశగా కనపడుతోంది. ఈ సుదూర వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.